హమ్మయ్య లోకేష్ జనాల్లోకి వచ్చారు అనుకుంటున్న టీడీపీ నేతలు, కార్యకర్తలంతా.. అసలు బండారం బైటపడే సరికి.. అసలు ఈయన ఎందుకొచ్చార్రా బాబూ అని తలలు పట్టుకుంటున్నారు.
అప్పటికీ టీడీపీకి మంచి పట్టున్న ప్రాంతాల్లో కేవలం టీడీపీ కార్యకర్తల మధ్యే లోకేష్ పర్యటన సాగుతోంది. ఆసాంతం జై చంద్రబాబు, జై లోకేష్ అనే నినాదాలు మారుమోగిపోతున్నాయి. ఇంకేముంది అయ్యగారు ఫుల్ ఫామ్ లో ఉంటారని అంతా అనుకున్నారు. కానీ మన లోకేశం మాత్రం వరిచేలో విలవిల్లాడుతున్నారు.
ఎప్పుడూ చేలోకి దిగిన బాపతు కాకపోవడం, అసలు వరి వృక్షంబులు మొలవాలంటే.. ఏ విత్తనాలు నాటాలి అని అడిగేంత అమాయకుడు కావడంతో చోటా మోటా నాయకులు తెగ ఇబ్బంది పడిపోతున్నారు. వరి పైరుని ఎలా పట్టుకోవాలో కూడా తెలియకపోవడంతో ఆఖరికి కెమెరామెన్లు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి. బాబుగారు బాబుగారు అలా కాదు, ఇలా అని చెప్పిన తర్వాతే లోకేష్ తన తప్పు సరిచేసుకుంటున్నారు.
ఇక రైతుల్ని ఆయన అడిగే కుశల ప్రశ్నలు మంచి కామెడిగా సాగిపోతున్నాయి. సీఎం జగన్ కార్యక్రమాలు లైవ్ ఎందుకు ఇవ్వరు, ఎడిట్ చేసి ఎందుకిస్తారు అని పదే పదే ప్రశ్నించే లోకేష్.. తన పరామర్శ యాత్రలను ఎందుకు ఎడిట్ చేస్తున్నారో చెప్పగలరా? ఎంత కార్యకర్తల్ని తెచ్చిపెట్టుకున్నా.. ఎక్కడో ఒకచోట నిజం బైటకు రాకుండా ఉంటుందా?
జగన్ వచ్చాక అంతా బాగానే ఉంది అనగానే వీడియో కట్ అయిపోవడం లోకేష్ పర్యటనల్లో చాలా చోట్ల జరిగింది. ఇక జై జగన్ నినాదాలు కూడా కొన్నిచోట్ల మిన్నంటాయి. వీటన్నిటినీ జాగ్రత్తగా ఎడిట్ చేసుకుంటూ.. చినబాబు మాంటేజ్ షాట్స్ ని హైలెట్ చేసుకుంటూ.. ఎడిటర్లు తెగ ఇబ్బంది పడుతున్నారు.
న్యూస్ ఛానెల్స్ టీమ్ కాకుండా.. సెపరేట్ గా చినబాబు టీమ్ ఒకటి ఈ ఎపిసోడ్స్ ని కవర్ చేస్తోంది. వీటిల్ని ఎడిట్ చేసి న్యూస్ ఛానెళ్లలో, సోషల్ మీడియాలో వదులుతున్నారు.
వ్యవసాయ బోర్లకు విద్యుత్ మీటర్లు బిగించే వ్యవహారంపై కూడా లోకేష్ కి చుక్కెదురైంది. మీటర్లు బిగిస్తే.. ఉద్యమం చేయండి అని ఉచిత సలహా పారేసిన లోకేష్ కి.. బిల్లులు ప్రభుత్వమే కడతామంటుంటే మాకేంటి ఇబ్బంది అని కొందరు రైతులు ప్రశ్నించారు. అక్కడ కూడా లోకేష్ బిక్కమొహం పెట్టారు.
మొత్తమ్మీద వరద బాధితుల పరామర్శ కోసం లోకేష్ ని రాంగ్ టైమ్ లో, రాంగ్ ప్లేస్ కి పంపించి చంద్రబాబు తప్పు చేశారని తేలిపోయింది. జగన్ పాలనలో లోకేష్ ఎప్పుడు రంగంలోకి దిగినా అది రాంగ్ టైమ్ అవుతుంది.. ఎక్కడ అడుగుపెట్టినా అది రాంగ్ ప్లేస్ అవుతుంది.