యవ్వనపు తొలిరోజులు ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో విలువైనవి. తెలిసీ తెలియని ఆ వయసులో ఆలోచనలు తుపానులా ఎగిసి పడుతుంటాయి. జీవితాన్ని సరైన తీరానికి చేర్చే వయసు కూడా అదే.
యవ్వనపు రోజుల్లో ఏ మాత్రం ఆలోచనలు బ్యాలెన్స్ తప్పినా జీవితం చేజారినట్టే. అందుకే ఆ వయసులో సరైన అడుగులు వేసేలా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకుంటుంటారు. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో కన్నవారి ఆందోళన ఎక్కువే.
ఈ నేపథ్యంలో అగ్రహీరోయిన్ కిరాయా అద్వాణీ తన యవ్వనపు రోజుల్ని గుర్తు చేసుకుంటూ తన్మయానికి లోనయ్యారు. ఆ రోజుల్లో మనసులో పూచిన తొలిప్రేమ అనే గులాబీ పువ్వు తాలూకు జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.
హైస్కూల్ రోజుల్లో తన ప్రేమాయణం గురించి కియారా అద్వాణీ చెప్పుకొచ్చారు. అయితే విఫలమైన ప్రేమే జీవితాంతం నీడలా వెంటాడుతుందనేందుకు కియారా జీవితంలోని ఘటనే ఉదాహరణ.
అయితే హృదయానికి పూచే ప్రేమ పువ్వు ఎప్పుడూ తాజాగా మెరిసిపోతుంటుందని ఆమె చెప్పే జ్ఞాపకాలు సరికొత్త విషయాన్ని ఆవిష్కరిస్తున్నాయి. ‘ప్లస్ టూ చదువుతున్న రోజుల్లో ఓ అబ్బాయిని ఎంతగానో ఇష్టపడ్డాను.
సెలవు రోజుల్లో ఇంట్లో ఏదో ఒక అబద్ధం చెప్పి అతడిని కలుసుకునేదాన్ని. మరోవైపు చదువుపై సరైన శ్రద్ధ కనబరచలేదంటూ తల్లిదండ్రులు మండిపడేవారు. ఈ సంఘర్షణ నడుమ నా ప్రేమను త్యాగం చేశాను. ఆ సమయంలో మానసికంగా ఎంతో ఆవేదనకు గురయ్యాను. వయసు తీసుకొచ్చిన పరిపక్వతతో నెమ్మదిగా తేరుకున్నా’ అని కియారా అద్వాణీ తన మధుర జ్ఞాపకాలను అభిమానులతో పంచుకున్నారు.