ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పేరు చెబితేనే.. ఎగిరెగిరి పడే పవన్ కల్యాణ్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు వింటే మాత్రం వణికిపోతుంటారు. ఇరు రాష్ట్రాల సమస్యలపై అక్కడో విధంగా, ఇక్కడో విధంగా స్పందించడం పవన్ కల్యాణ్ కి మహ బాగా అలవాటు.
తాజాగా వరద నష్టాలపై కూడా పవన్ తన రెండు నాల్కల ధోరణి చూపించారు. హైదరాబాద్ వరదలతో ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారనే విషయం ఎవరూ కాదనలేరు. అక్కడి ప్రభుత్వానికి పవన్ కల్యాణ్ కోటి రూపాయల సాయం అందించడాన్ని కూడా ఎవరూ ఆక్షేపించరు.
అదే సమయంలో ఏపీలో కూడా వరదలతో రైతన్నలు విలవిల్లాడుతున్నారు కదా? తెలంగాణ ప్రజలు అస్సలు పట్టించుకోని జనసేనకు ఏపీ ప్రజలే ఒక ఎమ్మెల్యే సీటు కూడా ఇచ్చారు కదా. మరి ఇక్కడి ప్రజలు ఏం పాపం చేశారని కనీసం పవన్ కల్యాణ్ తలచుకోలేదు. పోనీ అది ఆయన వ్యక్తిగత వ్యవహారం అనుకుందాం.. ఇక పార్టీ పరంగా తీసుకున్న స్టాండ్ ని కూడా పవన్ కేసీఆర్ కోసం పక్కనపెట్టారని తేలిపోయింది.
హైదరాబాద్ వరదల్లో పరామర్శకు వెళ్లిన కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ తప్పంతా కేసీఆర్ సర్కార్ దేనంటూ నిందించారు.
వలస పాలకులపై దుమ్మెత్తిపోసిన కేసీఆర్, తాను అధికారంలోకి వచ్చాక ఏం ఒరగబెట్టారని, ఏదైనా చేసి ఉంటే.. హైదరాబాద్ కి ఈ ముంపు బాధ తప్పేదని అన్నారు. కిషన్ రెడ్డి మాత్రమే కాదు, తెలంగాణ బీజేపీ కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టింది.
మరి బీజేపీతో చెలిమి చేస్తున్న జనసేన కేసీఆర్ సర్కారుపై పల్లెత్తు మాట అనకపోవడంలో ఆంతర్యం ఏంటి? అంటే పవన్ హైదరాబాద్ లో ఉంటే సినిమా యాక్టర్ లాగా విరాళాలు మాత్రమే ఇస్తారు, ఏపీకి వస్తే.. ఫక్తు రాజకీయ నాయకుడిలా మారిపోయి జగన్ రెడ్డీ, జగన్ రెడ్డీ అంటూ దీర్ఘాలు తీస్తారు. ఏంటీ వ్యత్యాసం.
తెలంగాణ, ఏపీ మధ్య ఆర్టీసీ బస్సులు నడవకపోవడానికి కారణం ఎవరు? తెలంగాణ అధికారుల మంకు పట్టు వల్లే ఇన్నాళ్లూ ఈ విషయంలో ప్రతిష్టంభన నెలకొందనే విషయం పవన్ కి తెలియదా? మరి దసరా సందర్భంగా బస్సులు నడవకపోవడాన్ని ఏపీ ప్రభుత్వ వైఫల్యంగా ఎలా పరిగణిస్తారు. ఏకపక్షంగా ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించడంలో అర్థం ఉందా? కేసీఆర్ ని కానీ, ఆయన ప్రభుత్వాన్ని కానీ పల్లెత్తు మాట అనే ధైర్యం జనసేనానికి లేదా?
అంత ధైర్యం లేకపోతే తెలంగాణలో జనసేన అకౌంట్ క్లోజ్ చేసుకోవడం ఒక్కటే పవన్ ముందున్న ఏకైక మార్గం. ప్రశ్నించే ధైర్యం లేని పవన్ కి పాతికేళ్ల ప్రస్థానం కూడా పగటి కలే.