బ్రిటన్ ప్రధాని పదవి నుంచి బోరిస్ జాన్సన్ తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్టు ఆ దేశానికి చెందిన ప్రముఖ పత్రిక డైలి మిర్రర్ ఓ కథనం రాసింది. ఇప్పుడీ కథనం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది. దీనికి ప్రత్యేక కారణం లేకపోలేదు. ఆయనేమీ కమ్యూనిస్టు నేత కాదు. కానీ ఆదర్శంగా జీవించడానికి కమ్యూనిస్టే కానవసరం లేదని ఆయన చాటి చెబుతున్నారు. ఇంతకూ ఆయన ప్రధాని పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకోవడానికి బలమైన కారణమేంటో తెలుసుకుందాం.
ప్రధానిగా తాను తీసుకుంటున్న జీతం సరిపోక పోవడం వల్లే ఆ పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్టు డైలి మిర్రర్ కథనం సారాంశం. జాన్సన్‌కు ప్రధానికి వచ్చే వేతనం కంటే గతంలో ఆయన పనిచేసే ఉద్యోగంలోనే ఎక్కువ జీతం వచ్చేదట! అన్నట్టు బోరిస్ జాన్సన్ ఓ జర్నలిస్టు, కాలమిస్ట్.
గతంలో ఆయన టెలిగ్రాఫ్ పత్రికలో కాలమిస్ట్‌గా పనిచేస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. అప్పట్లో కాలమిస్ట్‌గా 2.75 లక్షల పౌండ్లు సంపాదించేవారు. అలాగే నెలకు రెండు ప్రసంగాలు ఇవ్వడం ద్వారా సుమారు 1.6 లక్షల పౌండ్లు సంపాదించేవారు. ఇది 2.75 లక్షల పౌండ్ల సంపాదనకు అదనం. కానీ ప్రధాని అయ్యాక సంపాదన సగానికి సగం పడిపోయింది.
ప్రధానిగా ఆయనకు వచ్చే వేతనం కేవలం 1.5 లక్షల పౌండ్లు మాత్రమే. ఈ సంపాదనతో ఆయన కనీస అవసరాలు కూడా తీరలేదట. బోరిస్‌కు ఆరుగురు పిల్లలు. విడాకులు ఇచ్చిన భార్యకు భరణం ఇవ్వాల్సి ఉంది. దీంతో ప్రధానిగా తీసుకుంటున్న జీతం దేనికీ సరిపోలేదని బోరిస్ జాన్సన్ ఆవేదన చెందుతున్నారని సమాచారం.
బోరిస్ జాన్సన్ ఒకప్పుడు జర్నలిస్టుగా పనిచేశారు, ఆ తరువాత రాజకీయల్లోకి ప్రవేశించారు. కన్జర్వేటివ్ పార్టీ అధినేతగా థెరిసా మే స్థానంలో బోరిస్ జాన్సన్ ఎన్నికైన తర్వాత 2019 జూలైలో ఆయన బ్రిటన్ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
బోరిస్ జాన్సన్ తనను తాను 'యూరోసెప్టిక్' అని చెప్పుకుంటారు. ఆయన పూర్వీకులది టర్కీ. తాత జర్నలిస్టు. తండ్రి దౌత్య అధికారి, తల్లి కళాకారిణి. వారి కుటుంబం న్యూయార్క్‌లో నివాసం ఉన్నప్పుడు 1964 జూన్ 19న బోరిస్ జాన్సన్ జన్మించారు. తర్వాత వారి కుటుంబం యూకేలో స్థిరపడింది. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఆయన ప్రాచీన సాహిత్యం చదివారు. చదువు అనంతరం జర్నలిస్టుగా ఉద్యోగ ప్రస్థానాన్ని స్టార్ట్ చేశారు.
మొట్ట మొదట ది టైమ్స్ పత్రికలో ఆయన జర్నలిస్టుగా కెరీర్ మొదటు పెట్టారు. ఆ తర్వాత వార్త వక్రీకరణ ఆరోపణలపై ఆయన్ను తొలగించారు. తర్వాత ది డైలీ టెలీగ్రాఫ్ పత్రికకు బ్రస్సెల్స్‌లో ప్రతినిధిగా చేరారు. ఈ పత్రిక కన్సర్వేటివ్ పార్టీకి అనుకూలమనే పేరు ఉంది. ఆ తర్వాత యూకేలో టెలిగ్రాఫ్ పత్రిక కోసం స్పెషల్ కరస్పాండెంట్‌గా పనిచేశారు. అనంతరం 'ది స్పెక్టేటర్స్' అనే మ్యాగజైన్‌కు ఎడిటర్‌గా పని చేశారు.
ఇక బోరిస్‌కు బాగా గుర్తింపు తెచ్చిన మీడియా సంస్థ బీబీసీ. “హావ్ ఐ గాట్ న్యూస్ ఫర్ యు?” అనే బీబీసీ కార్యక్రమంలో రెగ్యులర్‌గా ఆయన కనిపిస్తుండడంతో, ఆయన చాలా మంది ప్రముఖులకు పరిచయం అయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాటలు, అభిప్రాయాలు విమర్శలకు కారణమయ్యాయి. ఇదే సమయంలో ఆయన్ను రాజకీయ నాయకుడిగా తీర్చిదిద్దాయని చెప్పొచ్చు.
2007లో లండన్ మేయర్‌గా, 2001లో జాన్సన్ ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయనది సింపుల్ లైఫ్. ఈ ఏడాది మార్చిలో ఆయన కరోనాబారిన పడి మృత్యువు అంచుల వరకు వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సంపాదన సరిపోదని ప్రధాని పదవిని వద్దనుకోవడం మన దేశ రాజకీయాలు, నాయకులను చూస్తున్న వాళ్లకు ఆశ్యర్యం కలిగిస్తోంది.