ఒకవైపు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఎన్వీ రమణ తీరుపై వివిధ ఆరోపణలతో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు సుదీర్ఘమైన లేఖ రాసి వారం రోజులు గడిచిపోయాయి. ఇందుకు సంబంధించి వివిధ వర్గాలు స్పందించాయి. నెక్ట్స్ సీజేఐ రేసులో ఉన్న రమణ మీద సంచలన ఫిర్యాదులు రావడంతో జాతీయ మీడియా కూడా ఈ అంశం గురించి స్పందించింది.
జాతీయ వార్తా చానళ్లలో చర్చా కార్యక్రమాలు నిర్వహించారు. అంతకు ముందు ఏపీ హై కోర్టు ఇచ్చిన గాగ్ ఆర్డర్స్ నేపథ్యంలో ఈ ఫిర్యాదు మరింత చర్చనీయాంశంగా నిలిచింది. ప్రశాంత్ భూషణ్ వంటి న్యాయవాది ఈ అంశంలో స్పందిస్తూ.. జగన్ నేపథ్యంతో నిమిత్తం లేకుండా వచ్చిన ఆరోపణలపై విచారణ జరగాలని వ్యాఖ్యానించారు. అయితే ఈ అంశం వరకూ సీజేఐ ఇంకా స్పందించలేదు.
ఈ పరిణామాల్లో ఒక మాజీ అడ్వొకేట్ జనరల్ స్పందన ఆసక్తిదాయకంగా ఉంది. జగన్ రాసిన లేఖను సీజేఐ పక్కన పడేస్తాడు అని తను అనుకోవడం లేదని మాజీ అడ్వొకేట్ జనరల్ చింతల విష్ణుమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
న్యాయమూర్తులపై ఫిర్యాదుల్లో ఇది మొదటిది, చివరిది కాకపోవచ్చని ఆయన పేర్కొన్నారు. గతంలో అనేక మంది న్యాయమూర్తులపై రకరకాల ఫిర్యాదులు వచ్చాయని, కొన్ని సార్లు న్యాయమూర్తుల బదిలీలు కూడా జరిగాయని ఆయన గుర్తు చేయడం గమనార్హం.
ప్రత్యేకించి న్యాయమూర్తులు అంతా పబ్లిక్ సర్వెంట్లే అని, వారిపై ఫిర్యాదులు చేయకూడదని ఎక్కడా లేదని సీవీ రెడ్డి వ్యాఖ్యానించారు. న్యాయమూర్తులు పబ్లిక్ సర్వెంట్లే అని గతంలో సుప్రీం కోర్టే స్పష్టం చేసిందని ఆయన ప్రస్తావించారు.
గతంలో తమిళనాడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై విచారణ జరిగిందని, ఎన్వీ రమణపై కూడా తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో సుప్రీం కోర్టు ప్రధాన్య న్యాయమూర్తి జగన్ లేఖను పక్కన పడేస్తాడని తను అనుకోవడం లేదని ఈ న్యాయవాది అభిప్రాయపడ్డారు.
దామోదరం సంజీవయ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాటి న్యాయమూర్తులు జస్టిస్ చంద్రారెడ్డి, జస్టిస్ సత్యనారాయణ రాజుల మీద ఆయన ఫిర్యాదు చేశారని, ఆ ఫిర్యాదు మేరకు చంద్రారెడ్డి ని మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేశారని కూడా ఈ న్యాయవాది చెప్పారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాటి హైకోర్టు న్యాయమూర్తి ఏ.గోపాల్ రెడ్డి మీద ఫిర్యాదు చేశారని ఈ సీనియర్ న్యాయవాది ప్రస్తావించారు.
న్యాయమూర్తులు విచారణల స్పందర్భంగా ఇష్టానుసారం వ్యాఖ్యానించడానికి వీల్లేదని, ఏదైనా ఉంటే తీర్పుల్లో రాయవచ్చని, తీర్పు సందర్భంగా స్పందించవచ్చని విచారణల్లో ఉన్నప్పుడు తీవ్ర వ్యాఖ్యానాలు సరికాదన్నారు.
దమ్మాలపాటి శ్రీనివాస్ పిటిషన్ పై ఏపీ హై కోర్టు ఇచ్చిన గాగ్ ఆర్డర్స్ పై కూడా ఈ న్యాయవాది స్పందించారు. దమ్మాలపాటి దాఖలు చేసిన పిటిషన్ కూడా వచ్చిన ఆదేశాలకూ సంబంధం లేదని, ఆయన మనసులోని కోరికలను కూడా తీర్చినట్టుగా ఉందన్నారు. ధర్యాప్తులు ఆపమని ఆదేశాలు ఇవ్వడం సరిగా లేదని ఆయన అభిప్రాయపడ్డారు.