సోము కామెడీ -2 : చీప్ గురించి చీప్ మాటలు!

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఏమాత్రం తగ్గడం లేదు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని నవ్వుల పాలు చేసే.. కార్యక్రమానికి సీక్వెల్ కూడా అందించారు. బీజేపీ అధికారంలోకి వస్తే.. చీప్ లిక్కర్ రేటును 70 రూపాయలకు…

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఏమాత్రం తగ్గడం లేదు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని నవ్వుల పాలు చేసే.. కార్యక్రమానికి సీక్వెల్ కూడా అందించారు. బీజేపీ అధికారంలోకి వస్తే.. చీప్ లిక్కర్ రేటును 70 రూపాయలకు తగ్గిస్తామని, ఆర్థిక పరిస్థితి బాగా టే యాభై రూపాయలకే అందిస్తానని సభలో ప్రకటించడం ద్వారా.. ఆయన నిన్న గొప్ప సంచలనమే సృష్టించారు. ఆయన తన మాటలతో, ప్రగల్భాలతో నవ్వులపాలు కావడం కొత్త విషయం ఎంతమాత్రమూ కాదు.. ఈ మాటతో పార్టీని కూడా నవ్వులపాలు చేశారు. 

ఎవరు అక్షింతలు వేశారో ఏమో.. లేదా ఇంటికెళ్లి సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ చూసుకున్నాక.. జ్ఞానోదయం అయిందో ఏమో తెలియదు గానీ.. నష్టనివారణకు బుధవారం ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. నిజానికి తన మంగళవారం నాటి ప్రసంగం గురించి ఆయన వివరణ ఇవ్వాలి. కానీ దానిని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం పార్టీని మరింత నవ్వులపాలు చేసేలా సాగింది. 

సోము వీర్రాజు పేదల పక్షపాతి అట. తన ఆడపడచులకోసమే ఆయన చీప్ లిక్కర్ రేటు తగ్గించాలనే సంకల్పాన్ని ప్రకటించాడట. లిక్కర్ ను 250 రూపాయలకు అమ్మడం ద్వారా ఈ ప్రభుత్వం పేదవాడి రక్తం తాగుతున్నది గనుక.. ఆ పేదలకు కూలి డబ్బులు మిగలడానికి.. ఆ రకంగా.. తాగడానికి పోగా మిగిలిన డబ్బులను వారు ఇల్లు గడవడానికి ఖర్చు పెట్టుకోవడానికి ఇచ్చేలాగా ప్లాన్ చేసుకుంటారని.. ఇంత దూరాలోచనతో సోము వీర్రాజు చీప్ లిక్కర్ ను యాభై రూపాయలకు అందించాలనే ఆలోచన చేస్తున్నారట. నోరు జారి అనేశాడు సరే.. దానిని దిద్దుకోవాల్సినది బదులుగా.. సమర్థించుకోవడానికి ప్రెస్ మీట్ పెట్టడమే ఒక సాహసం. 

మరే మెలిక దొరకలేదేమో.. పేదల పక్షపాతినని.. లిక్కర్ రేటు తగ్గిస్తే.. మిగిలిన డబ్బులతో పేదలందరూ చాలా సుఖంగా జీవిస్తారని ఆయన సెలవిచ్చారు. ఆయన చెబుతున్నట్టుగా 250 రూపాయల లిక్కర్ ను 50రూపాయలకు అమ్మేస్తోంటే.. ఒక్కొక్కరూ అయిదేసి సీసాలు తాగేస్తే సోము వీర్రాజు గారు ఏం చేస్తారు? యాభైకి ఒక్క సీసా మాత్రమే అమ్మేలా, అంతకు మించి తాగితే ఒప్పుకోనంటూ.. ప్రతి మద్యం దుకాణం దగ్గరా బెత్తం పట్టుకుని కూచుంటారా? అనేది ప్రశ్న. 

పేదల పక్షపాతి తెలుగింటి ఆడపడచుల జీవితాల గురించి ఆలోచించడానికి ఇంతకు మించిన మహానుభావుడు లేడని ఈ కొత్త ప్రెస్‌మీట్ అనగా.. సోము గారి కామెడీ ఎపిసోడ్ పార్ట్ 2 చూసి జనం నవ్వుకుంటున్నారు. చీప్ లిక్కర్ ఆఫర్ తో బీజేపీ పరువు మంటగలిసి చీప్ పార్టీగా మారిపోయింది. ఈ సమర్థింపుతో ఇంకాస్త చీప్ చీప్ గా మారిపోయింది.