దున్నపోతు ఈనిందంటే.. గాటన కట్టేయమన్నాడట వెనకటికి ఓ ప్రబుద్ధుడు. చంద్రబాబునాయుడు అతడి కంటె ఘనుడు. దున్నపోతు ఈనిందని అనగానే.. దానికి బారసాలకు కల్యాణ మండపం బుక్ చేసే టైపు. తనను హత్య చేయడానికి రెక్కీ చేశారని విజయవాడకు చెందిన నాయకుడు వంగవీటి రాధా అన్నదే తడవుగా చంద్రబాబునాయుడు స్పందించారు. చాన్సు దొరికిందే చాలనుకున్నట్టున్నారు. ఆ స్పందించడంకూడా కాస్త అతిగానే స్పందించారు.
టీడీపీ నేత వంగవీటి రాధాను టార్గెట్ చేసి హత్య చేయాలని చూస్తున్న వారిని తక్షణం పట్టుకోవాలని డీజీపీకి ఓ లేఖ రాసి పారేశారు. దానితో పాటు తన సహజశైలిలో రాష్ట్రంలో పరిపాలన గురించి, గూండా రాజ్యం గురించి, జంగల్ రాజ్ గురించి తనకు తోచిన, గుర్తుకు వచ్చిన పదాలు అన్నింటినీ.. ఆ లేఖలో పొందు పరిచేశారు. ఇంతా కలిపి చంద్రబాబునాయుడు లేఖ రాసిన వ్యవహారం గుమ్మడికాయల దొంగ భుజాలు తడుముకున్నట్టుగా కూడా కనిపిస్తోంది.
రాధా ఈ కామెంట్స్ చేసిన తర్వాత.. అతని అనుచరులు దేవినేని అవినాష్ దిష్టిబొమ్మలను దహనం చేసి ఉండొచ్చు గాక.. అంతమాత్రాన వైఎస్సార్ కాంగ్రెస్ రాధాను హత్య చేయడానికి ప్రయత్నిస్తున్నదని బురద చల్లడం విజ్ఞత అనిపించుకోదు. కానీ చంద్రబాబు చేస్తున్న పని అలాగే ఉంది. మొన్నటికి మొన్న రంగా వర్ధంతి రోజున.. రాధా.. తన హత్యకు రెక్కీ జరిగిందనే సంగతి వెల్లడించారు. అదే వర్ధంతి సభలో రాధాతో పాటు.. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా ఉన్నారు. ‘‘రాధా తండ్రి వర్ధంతి కార్యక్రమంలో.. తెలుగుదేశం పార్టీ నాయకులు లేరు’’ ఆ సంగతి గుర్తుంచుకోవాలి.
ఇదొక ఎత్తు అయితే.. ఆ తర్వాత.. రాధాకు సెక్యూరిటీ ఇవ్వాలని ప్రభుత్వం అనుకున్నప్పటికీ ఆయన నో చెప్పారు. మధ్యలో చంద్రబాబునాయుడు ఎందుకు హడావుడి చేస్తున్నాడో అర్థం కాని సంగతి. రెక్కీ జరిగిందని రాధా చెబితే.. చంద్రబాబు డీజీపీకి లేఖ రాస్తే ఏమవుతుంది? తగిన చర్య తీసుకోవాలని, శాంతి భద్రతలు కాపాడాలని డీజీపీకి లేఖ రాయడం డ్రామాలాగా అనిపిస్తోంది కదా? అనేది ప్రజల సందేహం.
తన హత్యకు రెక్కీ జరిగిందనే అనుమానం రాధాకు ఉంటే.. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయాలి. చేస్తే.. ఆయన ఎన్నడు రెక్కీ జరిగిందని అనుమానిస్తున్నారో.. ఆరోజున ఆయనకు అనుమానం కలిగిన ప్రాంతాల సీసీ టీవీ ఫుటేజీలను స్కాన్ చేశారంటే.. పోలీసులు చాలా స్వల్పవ్యవధిలోనే అనుమానితుల్ని పట్టుకోగలరు.
ఇవాళ్టి రోజుల్లో టెక్నాలజీని వినియోగించుకునే ఇలాంటి నేరగాళ్లను కట్టడి చేయడం సులువైన వ్యవహారమే. అలాంటి ప్రయత్నం తన పార్టీ నాయకుడితో చేయించడం చేత కాక.. చంద్రబాబునాయుడు.. డీజీపీకి లేఖ రాయడం.. అందులో రాష్ట్రంలో జంగల్ రాజ్ సాగుతోందని.. ఏదైనా జరిగితే ప్రభుత్వం బాధ్యత వహించాలని అనడం ఎగస్ట్రాగా కనిపిస్తోంది.
ఏ చిన్న అవకాశం వచ్చినా.. నాయకుల వ్యక్తిగత వివాదాల విషయాలు కాస్త వివాదాలుగా మారుతాయని అనిపించినా వాటినుంచి రాజకీయ ప్రయోజనాలు పిండుకోవాలని చూసే చంద్రబాబునాయుడు సంకుచిత ఆలోచన ధోరణిని ఏమనాలి? ఇలాంటి పనుల ద్వారా.. తన పరువే పోతుందని.. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే.. రాయాల్సింది లేఖ కాదని.. ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలని.. ప్రభుత్వం ఇస్తానని చెప్పిన సెక్యూరిటీని ఆమోదించి తీసుకునేలా తమ పార్టీకి చెందిన రాధాను ఒప్పించాలని ప్రజలు అంటున్నారు.
సెక్యూరిటీ ఇస్తామంటే తీసుకోకుండా.. ఏదైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అంటే ఎలా కుదురుతుంది? చంద్రబాబైనా కాస్త బుర్ర పెట్టి ఆలోచించాలి.