ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఆయన పేరు ఏపీ ఆవల ఎంత మందికి తెలుసో తెలియదు. అసలు ఏపీలోనే సోము వీర్రాజు పేరు తెలిసినోళ్లు ఎంతమందనేది వేరే ప్రశ్న. రాయలసీమ ప్రాంతంలో అయితే బీజేపీ పార్టీ గుర్తేదో కూడా చాలా మంది తెలియదు పాపం! అదీ కమలం పార్టీ పరిస్థితి.
ఆ సంగతలా ఉంటే… కమలం పార్టీ ఏపీ విభాగం అధ్యక్షుడు సోము వీర్రాజు పేరు జాతీయ మీడియాలో మోగిపోతోంది. యాభై రూపాయలకే చీప్ లిక్కర్ ఆఫర్ ను ప్రకటించిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు అంటూ జాతీయ వార్తా సంస్థలు ప్రత్యేక కథనాలను ఇస్తున్నాయి.
తమ పార్టీకి ఏపీలో అధికారం దక్కితే యాభై కే చీప్ లిక్కర్ బాటిల్ ను ఇస్తామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు ప్రకటించాడని హెడ్ లైన్స్ ద్వారా పాఠకులకు తెలియజేస్తున్నాయి మీడియా వర్గాలు. ఇక ఆ వార్తా కథనాలకు సంబంధించిన లింకులపై ఆగ్రహావేశాలు, సెటైర్లు తప్పడం లేదు!
కొందరేమో రూపాయికే లిక్కర్ బాటిల్ ఇచ్చినా తాము బీజేపీకి ఓటు వేయబోం అంటూ పంచ్ లు వేస్తున్నారు. ఇక మరి కొందరు యాభై రూపాయలతో చీప్ లిక్కర్ తాగి.. లివరూ, కిడ్నీలు చెడిపోతే.. దేవుడు కాపాడతాడా? అంటూ రామభక్త పార్టీకి ప్రశ్నలు సంధిస్తున్నారు. మద్యరహిత విధానం మహాత్మగాంధీది అని, అందుకు వ్యతిరేకంగా బీజేపీ చీప్ లిక్కర్ ను ప్రమోట్ చేస్తోందేమో అని మరి కొందరు అనుమానిస్తున్నారు.
ఇక ఇంకొందరైతే.. ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చాడని, అదే యాభై కే చీప్ లిక్కర్ బాటిల్ అంటూ.. మోడీ మాస్టర్ స్ట్రోక్ లను గుర్తు చేస్తున్నారు! మొత్తానికి ఎంత చేసినా రాని గుర్తింపు చీప్ లిక్కర్ కామెంట్లతో సోము వీర్రాజు ఒక్క రోజు వ్యవధిలోనే సంపాదించేశారు!