టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరిపై కాపులు మండిపడుతున్నారు. వంగవీటి రాధా ఎపిసోడ్‌లో చంద్రబాబు చేసిన కామెంట్స్‌పై కాపులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలా మాట్లాడ్డానికి సిగ్గనిపించలేదా? అని వారు ప్రశ్నిస్తున్నారు. వంగవీటి మోహన్‌రంగాను అత్యంత దారుణంగా చంపిన వాళ్లే… ఇవాళ ఆయన తనయుడి భద్రత గురించి నీతులు వల్లించడం దెయ్యాలు వేదాలు వల్లించిన చందంగా ఉందని మండిపడుతున్నారు.
తన హత్యకు రెక్కీ నిర్వహించారని ఇటీవల వంగవీటి రాధా సంచలన ఆరోపణలు చేశారు. రాధా రక్షణ నిమిత్తం జగన్ ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టింది. రక్షణగా పోలీసులను నియమించారు. అయితే తనకు రక్షణ అవసరం లేదని, ప్రజలే కాపాడుకుంటారంటూ రాధా ప్రకటించారు. అంతేకాదు, ప్రభుత్వం రక్షణగా నియమించిన పోలీసులను ఆయన వెనక్కి పంపారు. ఈ నేపథ్యంలో చంద్రబాబునాయుడు డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు లేఖ రాయడం గమనార్హం.
రాధాపై జరిగిన రెక్కీ విషయంలో సమగ్ర విచారణ జరిపి.. దోషులపై చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. రాధాకి ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దారుణంగా ఉందని బాబు మండిపడ్డారు.
బెదిరింపులు, గూండారాజ్ పరంపరలో భాగంగా రాధాను లక్ష్యంగా చేసుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఇలాంటి చట్టవ్యతిరేక చర్యలు ఆటవిక పాలనను తలపిస్తున్నాయని ఆయన ఆక్షేపించారు. హింసాత్మక సంఘటనలపై తీవ్రమైన చర్యలు లేకపోవడం వల్లే ఈ తరహా ఘటనలు పునరావృతమవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అసలు వంగవీటి రాధా ఏ పార్టీలో కొనసాగుతున్నారో ఆయనకే తెలియని పరిస్థితి. రాధా తండ్రి వంగవీటి మోహన్‌రంగాను కాపులు దైవంగా భావిస్తారు. అందుకే తమను మచ్చిక చేసుకునేందుకు రాధాపై చంద్రబాబు ప్రేమ కనబరచడాన్ని కాపులు జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఇదిలా వుండగా, గతంలో వంగవీటి మోహన్‌రంగాను చంపినందుకు తమ ప్రభుత్వం బాధ్యత వహించిందా? అని కాపులు ప్రశ్నిస్తున్నారు.
ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని రాధాకు ఏం జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలని బాబు ప్రశ్నిస్తున్నారని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. తన హత్యకు రెక్కీ జరిగిందని రాధా చెప్పగానే, తమ ప్రభుత్వం వెంటనే రక్షణ చర్యలు చేపట్టిందని గుర్తు చేస్తున్నారు. నాడు నిరాహార దీక్ష శిబిరంలో రంగాను అత్యంత కిరాతకంగా అర్ధరాత్రి వేళ నిద్రిస్తున్న సమయాన టీడీపీ ప్రభుత్వం ఉసురు తీసిందని కాపులు, వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. నాడు ఎన్టీఆర్ ప్రభుత్వంలో చంద్రబాబు మంత్రిగా ఉన్నారని, రంగా హత్యలో ఆయన పాత్రపై నాటి కేబినెట్ మంత్రులు కూడా బహిరంగంగా ఆరోపించడాన్ని గుర్తు చేస్తున్నారు.
రాధా తండ్రిని పొట్టన పెట్టుకున్న వాళ్లు…నేడు ఆయన భద్రత గురించి డీజీపీకి లేఖ ఏ నైతికతతో రాశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాధాకు భద్రత కల్పించాలని డీజీపీకి రాసిన లేఖలోని ఆటవిక పాలన, గూండారాజ్, బెదిరింపులు, హింసాత్మకం లాంటివన్నీ చంద్రబాబు, టీడీపీ ప్రభుత్వానికే వర్తిస్తాయని వైసీపీ నేతలు చెప్పడం విశేషం.
ఎందుకంటే టీడీపీ పాలనలో వంగవీటి రంగా హత్యకు గురి కావడమే నిదర్శనమని అంటున్నారు. ఇప్పటికైనా నాటి రంగా హత్యకు బాధ్యత వహిస్తూ చంద్రబాబు క్షమాపణ చెప్పి పాప ప్రక్షాళన చేసుకోవాలని కాపులు, వైసీపీ నేతలు సూచిస్తున్నారు.