రాజకీయ నాయకులు మాట్లాడే చాలా మాటలకు అర్ధం పర్ధం ఉండదు. ప్రతీ రాజకీయ పార్టీ తమ బలం గోరంతగా ఉన్నా కొండంతలు చేసి చెబుతుంది. అతిశయోక్తులు మాట్లాడటంలో రాజకీయ నాయకులకు ఉండే నైపుణ్యం మరెవరికీ ఉండదు. ఏపీలో బీజేపీ ప్రజా ఆగ్రహ సభ అనే పేరుతో కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవదేకర్ ను పిలిపించి సభ పెట్టింది. వైసీపీ నాయకులు అన్నట్లుగా ఉనికిని చాటుకోవడానికే సభ నిర్వహించినట్లుగా కనబడుతోంది.
భారీగా సభ నిర్వహించినప్పుడు, అందులోనూ పాలక పక్షానికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా సభ నిర్వహించినప్పుడు, అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతున్నప్పుడు తమ పంథా ఏమిటో, తాము అధికారంలోకి వస్తే ఏం చేయదలచుకున్నామో స్పష్టంగా చెప్పగలగాలి. అదేమీ లేకుండా జగన్ ప్రభుత్వానిది ఆటవిక పాలన, కేంద్రం ఇస్తున్న డబ్బులతో అమలు చేస్తున్న పథకాలకు తన పేరు పెట్టుకుంటున్నాడు అంటే సరిపోతుందా ?
ఏయే అంశాల్లో జగన్ విఫలమయ్యాడో, తాము అధికారంలోకి వస్తే వాటిని తాము ఎలా సరి చేస్తామో చెప్పాలి. రోజూ మీడియాలో వస్తున్న విమర్శలను బీజేపీ నాయకులు కూడా వల్లే వేస్తే ప్రయోజనం ఏముంది? ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించినందువల్లనే గత ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిందని జవదేకర్ అన్నాడు. ఏపీ ప్రజల దృష్టిలో మోడీ దేవుడని, ఆయన్ని విమర్శించినందువల్లనే టీడీపీని ఓడగొట్టారని జవదేకర్ సారాంశం.
మరి తెలంగాణలో టీఆర్ఎస్ నాయకులు మోదీని పొట్టుపొట్టుగా విమర్శిస్తున్నారు. అక్కడ రెండోసారి కూడా ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా. అనేక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచింది కదా. ఏపీ ప్రజల దృష్టిలో బీజేపీకి, మోడీకి ఇమేజ్ ఉన్నట్లయితే బాబు ఓడిపోయాక బీజేపీ అధికారంలోకి రావాలి కదా. కానీ ప్రజలు వైసీపీకి పట్టం కట్టారు. టీడీపీ ఓడిపోవడానికి, జగన్ అధికారంలోకి రావడానికి అనేక కారణాలున్నాయి.
టీడీపీ ఓడిపోవడానికి బీజేపీ కూడా కారణమే. టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకోవడమే కాకుండా అధికారంలోనూ పాలు పంచుకుంది. టీడీపీతో ఆ విధంగా అంటకాగి ఏపీకి ఇచ్చిన కీలక హామీలను తుంగలో తొక్కింది. బీజేపీపై పెరిగిన నిరసన సెగ టీడీపీకి కూడా తగిలింది. దీంతో ప్రజలు వైసీపీ వైపు మొగ్గు చూపారు. బీజేపీని, మోదీని విమర్శించిన చాలా రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు అధికారంలోకి వచ్చాయి, మరి మోదీని విమర్శిస్తే ఆ పార్టీలు అధికారంలోకి రాకూడదు కదా.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా విఫలమైన సోము వీర్రాజు ఈ సభలో తన అతి తెలివిని బయట పెట్టుకున్నాడు. అధికారం అప్పగిస్తే తాము చేసే పనులు చెప్పకుండా జనాలకు చీప్ లిక్కర్ 70 రూపాయలకు ఇస్తామని, ఆర్ధిక పరిస్థితి బాగుంటే 50 రూపాయలకే ఇస్తామని చెప్పాడు. అధికారం కోరుకుంటున్న వారు చెప్పే మాటలు ఇవా? తెలంగాణా బీజేపీ నాయకులు టీఆర్ఎస్ ప్రభుత్వం మీద పోరాడినంతగా ఏపీ బీజేపీ నాయకులు జగన్ ప్రభుత్వం మీద పోరాటం చేయడం లేదనడం వాస్తవం. కేంద్ర నాయకులు వచ్చినప్పుడు హడావుడి చేస్తారు తప్ప మామూలు రోజుల్లో ఎవరి పనులు వారు చూసుకుంటారు.