కేసీఆర్‌ వార్నింగ్‌…మంత్రుల గుండెల్లో రైళ్లే…!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏ ఎన్నికల విషయంలోనైనా సరే చాలా సీరియస్‌గా ఉంటారు. పార్లమెంటు ఎన్నికలు, మున్సిపల్‌ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, శాసన మండలి ఎన్నికలు, ఉప ఎన్నికలు (ఒక్క ఉప ఎన్నికైనా సరే)…

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏ ఎన్నికల విషయంలోనైనా సరే చాలా సీరియస్‌గా ఉంటారు. పార్లమెంటు ఎన్నికలు, మున్సిపల్‌ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, శాసన మండలి ఎన్నికలు, ఉప ఎన్నికలు (ఒక్క ఉప ఎన్నికైనా సరే) …ఇలా పంచాయతీ ఎన్నికల నుంచి పార్లమెంటు ఎన్నికల వరకు చాలా సీరియస్‌గా వ్యవహరిస్తారు.

ఒక్క ఉప ఎన్నిక జరిగినా సరే అసెంబ్లీ ఎన్నికలకు రచించినంత వ్యూహం రచిస్తారు. విద్యార్థులు పరీక్షల్లో వందకు వంద మార్కులు సాధించాలనే లక్ష్యం పెట్టుకున్నట్లుగా కేసీఆర్‌ ఏ ఎన్నికల్లోనైనా సరే వందకు వంద శాతం సీట్లు గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంటారు. కొంతకాలం కిందట జరిగిన హుజూర్‌ నగర్‌ ఉప ఎన్నికలోనూ పకడ్బందీ వ్యూహం రచించి సాధారణ ఎన్నికల టైపులో హడావుడి చేశారు. 'చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి' అన్న సామెత మాదిరిగా ఆయన వ్యవహరిస్తారు. ఇంతటి సీరియస్‌నెస్సే టీఆర్‌ఎస్‌ విజయ రహస్యమని చెప్పుకోవచ్చు. 

'అన్ని సీట్లు టీఆర్‌ఎస్సే గెలుచుకోవాలి. క్లీన్‌ స్వీప్‌ చేయాలి' అంటూ పార్టీ నేతలకు, కార్యకర్తలకు గట్టిగా చెబుతారు. రాష్ట్రంలో త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు జరగబోతున్నాయి. 120 మున్సిపాలిటీలకు, 10 మున్సిపల్‌ కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికలపై సీఎం జోరుగా, సీరియస్‌గా కసరత్తు చేస్తున్నారు.

ఎన్నికల బాధ్యతను మంత్రి కమ్‌ కుమారుడు కేటీఆర్‌కు అప్పగించినప్పటికీ తెర వెనక సూత్రధారి కేసీఆరే. ఎన్నికలు జరుగుతున్న మొత్తం మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను టీఆర్‌ఎస్సే గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో దీనిపై దిశానిర్దేశం చేశారు. మంత్రులతోపాటు నాయకులందరికీ బాధ్యతలు అప్పగించారు. పాత కొత్త పాయకులంతా కలిసికట్టుగా పనిచేయాలన్నారు. 

ఇంతవరకు బాగానేవుంది. అయితే కేసీఆర్‌ ఓ తీవ్ర హెచ్చరిక  చేశారు. ఎన్నికలు జరుగుతున్న మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లలో ఏ ఒక్కదానిలో కూడా టీఆర్‌ఎస్‌ ఓడిపోకూడదని, ఎక్కడైనా ఓడిపోతే సంబంధిత మంత్రుల పదవులు ఊడిపోతాయని హెచ్చరించారు. ఇది మంత్రులకు గుండెల్లో గుబులు కలిగించే హెచ్చరికే. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించి తీరాల్సిన బాధ్యత వారి మీద ఉంది.

మంత్రులు ఏం చేస్తారనేది కేసీఆర్‌కు అనవసరం. వారు ఓటర్లకు డబ్బు పంచుతారో, మద్యం పోయిస్తారో, కానుకలే ఇస్తారో…ఇదంతా సీఎం పట్టించుకోరు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెవడమే ప్రధానం. ఇప్పటికే కొందరు నాయకులు కానుకలు ఇస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఎన్నికలయ్యేంతవరకు మంత్రులంతా వారి నియోజకవర్గాల్లోనే ఉండాలని, హైదరాబాదులో తిరిగితే ూరుకోనని కూడా ముఖ్యమంత్రి వార్నింగ్‌ ఇచ్చారు. 

మున్సిపల్‌ ఎన్నికల బాధ్యత మోస్తున్న మంత్రి కేటీఆర్‌ ఈ విషయంలో గట్టిగా ఉంటారనే చెప్పొచ్చు. రాష్ట్ర విభజన తరువాత జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ కేటీఆర్‌ నేతృత్వంలో కనీవినీ ఎరుగని విజయం సాధించింది. కేటీఆర్‌ని ముఖ్యమంత్రి చేస్తారనే వార్తలు, ఊహాగానాల నేపథ్యంలో మున్సిపల్‌ ఎన్నికలు జరగబోతున్నాయి.

కాబట్టి ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు పరాజయం ఎదురైతే ఆ ప్రభావం కేటీఆర్‌ పదవీ యోగంపై పడొచ్చేమో….!  చెప్పలేం. ప్రస్తుతమైతే టీఆర్‌ఎస్‌ను ఢీకొనే సత్తా బీజేపీకి, కాంగ్రెసుకు లేవు. ఏ ఎన్నికలైనా సరే అవి జరగడానికి కొంతకాలం ముందునుంచే కాంగ్రెసులో లుకలుకలు బయలుదేరుతాయి. ఆ పార్టీ నేతలంతా వాటిల్లో కొట్టుమిట్టాడుతుంటారు. 

ఈ ఎన్నికల ముందు కూడా పరిస్థితి అలాగే ఉంది. ఇదిలా ఉండగా టీఆర్‌ఎస్‌ గెలవకపోతే పదవులు మంత్రి పదవులు ఊడతాయని కేసీఆర్‌ వార్నింగ్‌ ఇచ్చినా, ఎక్కడైనా టీఆర్‌ఎస్‌ ఓడిపోతే మంత్రి పదవులు నిజంగానే ఊడబీకుతారా? పార్టీ ఎన్నికల్లో ఓడిపోతే ఆ పేరుతో మంత్రులు పదవులు తీసేయకపోవచ్చు.

పాలనాపరమైన కారణాలు చూపించి, మంత్రివర్గ ప్రక్షాళన పేరుతో తీసేయొచ్చు. అలా చేసే అవకాశం ఉంది. కాని చేస్తారా? చేయరా? అనేది చెప్పలేం. ఎవరినైనా పదవుల్లో నుంచి తీసేయాలంటే ముందుగా కారణాలు సిద్ధం చేసి పెట్టుకోవాలి కదా. చూద్దాం..సీఎం ఎలా వ్యవహరిస్తారో…!