విశాఖ ఉక్కు కర్మాగారం ఇపుడు ఏ స్థితిలో ఉంది అంటే బలిపీఠం మీద అని జవాబు వస్తుంది. ప్రైవేట్ పరం చేయడానికి కేంద్రం దూకుడుగా అడుగులు వేస్తోంది. పది నెలలుగా ఉక్కు కార్మికులు చేస్తున్న పోరాటాలకు కూడా పెద్దగా ఫలితం కనబడడంలేదు.
మరో వైపు చూస్తే రాజకీయ బలం కూడా జతకూడడంలేదు. ఈ నేపధ్యంలో ఏపీ బీజేపీ నేతల మాటలు మాత్రం అర్ధం కాకుండానే ఉంటున్నాయి. విశాఖ ఉక్కుని తామే పరిరక్షిస్తున్నామని సోము వీర్రాజు చెబుతున్నారు. ఏ పార్టీకి లేని చిత్తశుద్ధి తమకే ఉందని, అందుకే ఉక్కు అలా ఉందని అంటున్నారు. నిజానికి సోము మాటలే నిజం అనుకుంటే దానికి వచ్చిన ముప్పు కూడా కేంద్రంలోని అధికారంలో ఉన్న బీజేపీ నుంచే కదా. ఆ ముప్పు నుంచి ఉక్కుని కాపాడుతున్నామంటున్న సోము వీర్రాజు ప్రైవేటీకరణ జరగదు అని క్లారిటీగా ఎందుకు చెప్పడంలేదు అని కార్మిక సంఘాలు నిలదీస్తున్నాయి.
ఉక్కు కర్మాగారం ప్రభుత్వ రంగంలోనే ఉంటుంది అన్న ఒక్క మాటను వీర్రాజు ఎందుకు చెప్పడంలేదు అన్న ప్రశ్న కూడా వారి నుంచి వస్తోంది. మరో వైపు చూస్తే సమస్య సృష్టించిన వారే తాము కాపాడుతున్నామని చెప్పడం పట్ల కార్మిక లోకం మండుతోంది. ఒక వైపు కీలకమైన విభాగాలను ప్రైవేట్ పరం చేయడానికి చకచకా పావులు కదులుతున్నాయని, అయినా ఉక్కు ఎక్కడికీ పోదు అని కమలనాధులు అంటూంటే ఎలా నమ్మేది అన్నది వారి సూటి ప్రశ్న.
ఇక బీజేపీ నేతలు చెబుతున్న దాని ప్రకారం చూస్తే ప్రైవేట్ పరం అయినా కూడా కార్మిక ప్రయోజనాలు దెబ్బతినకుండా కాపాడుతామన్న భావన ఉంది తప్ప ఉక్కు కర్మాగారాన్ని యధా ప్రకారం కొనసాగిస్తామన్న భరోసా అయితే లేదని అంటున్నారు.
ఇప్పటికైనా స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ రంగంలోనే ఉంచుతామని కేంద్రం పక్కా క్లారిటీగా ప్రకటన చేస్తేనే తాము నమ్ముతాము తప్ప ఇలాంటి మాటలను వినలేమని ఉక్కు కార్మిక నేతలు అంటున్నారు. మరి ఉక్కు కర్మాగారమా ఊపిరి పీల్చుకో, నేను చెప్పాను, ఇదే నా ఆన అని సోము వీర్రాజు చెప్పేది నమ్మాలా. నమ్మితే జరిగేది ఏంటి అన్నదే పెద్ద చర్చగా ఉంది మరి.