వైఎస్ జగన్ లాంటి ఫ్రెండ్లీ సీఎంను ఎక్కడా చూసి ఉండమని వైసీపీ ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. తిరుమల శ్రీవారిని బుధవారం ఆమె దర్శించుకున్నారు. అనంతరం రోజా మాట్లాడుతూ సినిమా టికెట్ల ధరల పెంపుపై తనదైన శైలిలో స్పందించారు.
సినిమా టికెట్ల ధరలు, ఆన్‌లైన్ విక్రయాలపై ప్రభుత్వం పునరాలోచించాలని సినీ నటులే కోరారన్నారు. ప్రజల సంక్షేమం కోసం సినిమా టికెట్ల రేట్లను ఈ విధంగా అమలు చేస్తున్నట్టు రోజా తెలిపారు. పేద ప్రజల కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు.
జగన్ లాంటి స్నేహపూర్వకమైన ముఖ్యమంత్రిని మనం ఎక్కడా చూసి ఉండమని రోజా అన్నారు. చిరంజీవి, నాగార్జున, ఇతర సినీ పెద్దలు ఆన్‌లైన్ టికెటింగ్ పెట్టాలని ఎన్నోసార్లు కోరడం వల్లే జగన్ అంగీకరించారన్నారు. సినిమా వాళ్లతో చర్చలు జరిపి, వాళ్ల అభ్యర్థన మేరకే ఇప్పటివరకూ ఆయన అన్నీ చేశారని రోజా అన్నారు.
కొంతమంది రాజకీయ లబ్ధి కోసం ఇప్పుడు సమస్యగా మారుస్తున్నారని రోజా విమర్శించారు. ఇది తెలుసుకుని మిగిలిన సినీ ప్రముఖులు ఇప్పుడిప్పుడే చర్చలకు వస్తున్నారన్నారు. సినీ పరిశ్రమపై నెలకున్న సమస్యకు త్వరలో ఓ మంచి పరిష్కారం వస్తుందని భావిస్తున్నట్టు రోజా తెలిపారు.
థియేటర్ల కలెక్షన్లు, వాటి పక్కనున్న కిరాణా షాపుల కలెక్షన్ల కంటే తక్కువగా ఉన్నాయని హీరో నాని ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అలాగే హీరో సిద్ధార్థ్ మంత్రుల విలాసాలపై ఘాటు విమర్శలు చేయడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో రోజా టికెట్ల ధరల పెంపుపై మాట్లాడ్డం ఆసక్తి కలిగిస్తోంది. స్వయంగా ఆమె సినీ పరిశ్రమ నుంచి వచ్చిన ప్రజాప్రతినిధి కావడంతో రోజా మాటలకు ప్రాధాన్యం సంతరించుకుంది.