బొంకరా బొంకరా బోలిగా అంటే.. తాడికొండ మిరియాలు తాటి కాయలంతా అన్నాడట! ఆ సంగతేమో కానీ.. ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారాన్ని పచ్చమీడియా టీడీపీకి అనుకూలంగా మార్చాలని తాపత్రయపడుతున్న తీరు మాత్రం ప్రహసనంగా మారింది. ఇప్పుడు కాదు.. దాదాపు నెలా, నెలన్నర నుంచి తోక పత్రిక ఒకటి ఈ విషయంలో తీవ్రంగా ప్రయాసపడుతూ ఉంది. ఏపీలో సినిమా టికెట్ ధర ఐదు రూపాయలు అయ్యిందంటూ ప్రచారం చేపట్టింది కూడా పత్రికారాజమే!
ఎక్కడో థియేటర్లే లేని గ్రామ పంచాయతీ పరిధుల్లో, అది కూడా నాన్ ఏసీ, నాన్ కూలర్.. నేల టికెట్ ను ఐదు రూపాయలుగా ప్రభుత్వం తన జీవోలో పేర్కొంటే, ఏపీ మొత్తం సినిమా టికెట్ ధర ఐదు రూపాయలు అయ్యిందన్నట్టుగా గోబెల్స్ ప్రచారాన్ని షురూ చేసింది తోక పత్రికే. ఈ తోకపత్రిక వాదనను సినిమా వాళ్లూ పట్టుకున్నారు.
నూటా యాభై రూపాయల టికెట్ మాటను పక్కన పెట్టి, ఐదు రూపాయలు అయ్యిపోయిందని లబోదిబో అంటూ ఉన్నారు. వీరి అసలు బాధ తొలి వారం పరిమితులు వస్తున్నాయనేది! తొలి వారంలో ఒక్కో సినిమా టికెట్ ను ఐదు వందల రూపాయలు, వీలైతే, వెయ్యి రెండు వేల రూపాయలకు అమ్ముకోలేమని వీరు తెగ బాధపడిపోతూ ఉన్నారు. మా సినిమా మా టికెట్ అంటూ వాదిస్తూ ఉన్నారు.
ఇక థియేటర్లలో నాసికరమైన ప్రమాణాల గురించి కానీ, సేఫ్టీ మెజర్స్ గురించి అడిగితే.. అది ఇప్పుడు రెండు కులాలపై దాడి అని తోకపత్రిక కొత్త భాష్యం చెప్పింది! అంటే.. థియేటర్లలో సేఫ్టీ మెజర్స్ పాటించమంటే అది రెండు కులాలపై దాడా! బోడిగుండుకూ, మోకాలికి ముడిపెట్టి.. టీడీపీకి అనుకూల వాదనను అడ్డగోలుగా చేయడం తోక పత్రికకే సాధ్యం.
టికెట్ల వ్యవహారం, థియేటర్లపై తనిఖీలు.. కమ్మ, కాపు కులాలపై దాడి అని తోక పత్రిక చెబుతోంది. అంటే.. సినిమా వ్యాపారం.. థియేటర్లతో సహా అంతా ఈ కులాలదేనా? సినిమా హీరోలంటే ఈ కులాల వారే అధికం అనుకుందాం. ఇక నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల ఓనర్లు అంతా ఈ రెండు కులాల వాళ్లే అని.. తోక పత్రిక చెబుతోంది!
అంటే.. ఎక్కడా రెడ్లకు థియేటర్లు లేవు, బీసీ కులాల వారు థియేటర్ల ఓనర్లు కాదు.. థియేటర్లపై తనిఖీలు చేస్తే నష్టమంతా కమ్మలకూ, కాపులకే. సినిమా టికెట్ల రేట్లను తగ్గించడం అంటే అది కమ్మ, కాపులపై దాడే! ఇదీ తోక పత్రిక వక్రోపన్యాసం సారాంశం!
తొలివారం దోపిడీ కి అతీతంగా విడుదలవుతున్న తాజా సినిమాల్లో ఫస్ట్ సినిమా బాధితుడు ఒక రెడ్డిగారే. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో.. మెజారిటీ థియేటర్ల ఓనర్లు రెడ్లు. వీరితో పాటు కోమట్లకూ, బీసీ కులాల వారికి కూడా ఈ ఆరు జిల్లాల్లో పెద్ద ఎత్తున థియేటర్లు ఉన్నాయి. ఈ జిల్లాల్లో కమ్మ వాళ్ల థియేటర్లో, బలిజల థియేటర్లో వేళ్ల మీద లెక్కబెట్టదగిన స్థాయిలో ఉంటాయి. రెడ్లు, బీసీల థియేటర్లు 90 శాతం ఉంటాయి!
అయితే ఇవన్నీ తోక పత్రికకు ఏం అవసరం? కమ్మలూ, కాపులు జగన్ ను ద్వేషించాలి. ఏం జరిగినా అది తమ కులంపై దాడి అని వీరు భావించాలి. వీళ్లంతా కలిసి చంద్రబాబును మళ్లీ సీఎంగా చేయాలి! ఇది కదా.. ఆ పత్రిక అవసరం!