బీజేపీ ప్రజాగ్రహ సభలో రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మందుపై చేసిన వ్యాఖ్యలు సంచలనం రేకెత్తించాయి. సోషల్ మీడియా సోము వీర్రాజు ఆటాడుకుంటోంది. వీర్రాజు వీరావేశంతో మాట్లాడిన మాటలు…ఆయనపై భారీ ట్రోలింగ్‌కు కారణమయ్యాయి.
బీజేపీ పాలిత రాష్ట్రమైన గుజరాత్లో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలవుతోంది. ఆ రాష్ట్రంలో మహాత్మాగాంధీజీ పుట్టడంతో ప్రభుత్వం కఠిన నిషేధాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.
కానీ ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాత్రం మద్యం రేట్లను తగ్గిస్తాననే ప్రకటనతో మందు ప్రియుల మనసును చూర గొనే ప్రయత్నాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమకు అధికారమిస్తే చీప్ లిక్కర్ బాటిల్ రూ.70కి.. ఆర్థిక పరిస్థితి సహకరిస్తే రూ.50కే ఇస్తామని సోము వీర్రాజు హామీ ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశమైంది. వీర్రాజు మందు ధరలపై నెటిజన్లు సెటైర్లు విసురుతున్నారు.
“సోము వీర్రాజు గారూ! మీరు ఎక్కించాలని అనుకుంటున్న మతం మత్తు ప్రజలకు ఎక్కడం లేదు. అందుకని జనాన్ని చీప్ లిక్కర్ తాగించి మత్తెక్కించాలని అనుకుంటున్నారా?” అంటూ వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. మందుబాబుల ఓట్ల కోసం మహిళల పుస్తెలు తెంచుతారా సార్ అంటూ మరికొందరు వెటకరిస్తూ కామెంట్స్ పెట్టారు. ఇకపై మిమ్మల్ని సారాయి వీర్రాజు అని పిలవొచ్చా అంటూ ట్రోలింగ్ చేయడం గమనార్హం.