బిహార్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచాడు అలనాటి స్టార్ హీరో , పొలిటీషియన్ శత్రుఘ్నసిన్హా తనయుడు లవ్ సిన్హా. రాజకీయంగా షాట్ గన్ నేపథ్యాన్ని వేరే చెప్పనక్కర్లేదు. కమలం పార్టీ తరఫున వరసగా రెండు సార్లు పట్నా సాహిబ్ లోక్ సభ సీటు నుంచి నెగ్గారు శత్రుఘ్న.
గత పర్యాయం బీజేపీ అధికారంలో ఉన్నప్పుడే ఆయనకు కమలం పార్టీతో పడలేదు. బీజేపీపై విమర్శలు చేస్తూ వచ్చారు. 2019 లోక్ సభ సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆయన కాంగ్రెస్ పార్టీలోకి చేరారు.
ఆ ఎన్నికల్లో పట్నాసాహిబ్ నుంచినే పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఈ బాలీవుడ్ అలనాటి స్టార్ హీరో. ఆయనపై నెగ్గిన రవిశంకర ప్రసాద్ కేంద్ర మంత్రయ్యారు.
ఇప్పుడు పట్నా సాహిబ్ లోక్ సభ సీటు పరిధిలోకి వచ్చే బంకీపుర్ అసెంబ్లీ సీటు నుంచి శత్రుఘ్న తనయుడు ఎమ్మెల్యేగా పోటీకి దిగాడు. కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద అతడు పోటీకి దిగారు.
తన తనయుడు రాజకీయాల్లో ప్రత్యక్ష పోటీకి దిగినంత మాత్రాన తను రాజకీయం నుంచి రిటైరయినట్టు కాదని శత్రుఘ్న స్పష్టం చేస్తున్నారు.
తను ఇంకా పోటీ చేసే అవకాశం ఉందని 74 యేళ్ల ఈ బాలీవుడ్ స్టార్ పరోక్షంగా చెప్పాడు. శత్రుఘ్న కూతురు బాలీవుడ్ లో సెటిలైంది. మరి పాలిటిక్స్ లో ఆయన తనయుడికి ఎలాంటి విజయాలు సొంతమవుతాయో!