తప్పు థియేటర్లదా? ప్రభుత్వానిదా?

గత వారం, పది రోజులుగా థియేటర్లు మూతపడుతుంటే, థియేటర్లను అధికారులు తనిఖీ చేస్తుంటే పలువురు రాజకీయనాయకులు గొంతు చించుకున్నారు. ప్రభుత్వం థియేటర్లను చంపేస్తోంది అంటూ నానా యాగీ. సోషల్ మీడియా పోస్ట్ లు. నిన్నటికి…

గత వారం, పది రోజులుగా థియేటర్లు మూతపడుతుంటే, థియేటర్లను అధికారులు తనిఖీ చేస్తుంటే పలువురు రాజకీయనాయకులు గొంతు చించుకున్నారు. ప్రభుత్వం థియేటర్లను చంపేస్తోంది అంటూ నానా యాగీ. సోషల్ మీడియా పోస్ట్ లు. నిన్నటికి నిన్న ఈ విషయంలో మంత్రి పేర్ని నాని క్లారిఫికేషన్ ఇచ్చారు. 

'మూడు నెలల క్రితమే ఎగ్జిబిటర్ల మీటింగ్ లో చెప్పాం. థియేటర్ల ఫారం బి లు, అలాగే సేఫ్టీ లైసెన్స్ లు రెన్యూవల్ చేసుకోమని.,మూడు నెలల తరువాత తనిఖీలు ప్రారంభించాం. ఫారం బి రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకున్న థియేటర్లను వదిలేసాం. అసలు దరఖాస్తు చేసుకోని వాటిని సీజ్ చేసాం. ఇది చూసి, చాలా థియేటర్లు రేట్ల వంక పెట్టి మూత పెట్టాయి. సి సెంటర్లలో అంటే రేట్లు సమస్య ఏమో, పెద్ద పట్టణాల్లో కూడా అదే సమస్య వుందా? అందుకే మూసారు అంటే నమ్మాలా'

ఇలా అర్థం వచ్చేలా మంత్రి మాట్లాడారు. ఏ వ్యాపారానికైనా లైసెన్స్ లు వుంటాయి. లేకుండా వ్యాపారాలు సాగిస్తాం అంటే ఊరుకోవాలా? ఏళ్లకు ఏళ్లు లైసెన్స్ లు లేకుండా థియేటర్లు నడుపుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు? అసలు ముందు ఆ అధికారులను బోనులో నిలబెట్టాలి. 

అంటే సేఫ్టీ లైసెన్స్ లేకుండా ప్రేక్షకుల ప్రాణాలతో చెలగాటం ఆడతామంటే థియేటర్లను చూసీ చూడనట్లు వదిలేయాలా? బండికి లైసెన్స్ లేకుంటే నిత్యం తనిఖీలు చేస్తున్నారుగా. అది తప్పు కానపుడు థియేటర్ కు లైసెన్స్ వుందోలేదో తనిఖీ చేయడం తప్పు ఎలా అవుతుంది?

అసలు ప్రభుత్వం ఈ విషయంలో ఓ ప్రకటన చేయాలి. ఎన్ని థియేటర్లు వున్నాయి? వాటిలో ఎన్నింటికి ఫారం బి వుంది. ఎన్నింటికి రెన్యూవల్ చేసుకోలేదు. ఎన్ని థియేటర్లకు సేఫ్ణీ లైసెన్స్ లేదు అన్నది థియేటర్ పేరుతో సహా ప్రజలకు వెల్లడించాలి. అప్పుడు కానీ ప్రజలను తప్పు దారి పట్టించే రాజకీయ ప్రచారాలకు తెరపడదు.