జనసేనాని పవన్‌కల్యాణ్‌పై బీజేపీ ఆశలు వదులుకున్నట్టేనా? అంటే ఔననే సమాధానం వస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన తమ వెంట నడవదని బీజేపీ ఓ అభిప్రాయానికి వచ్చినట్టు ఆ పార్టీ ముఖ్యనేతల మాటలే చెబుతున్నాయి. విజయవాడలో నిన్న ‘ప్రజా ఆగ్రహ సభ’ లో బీజేపీ జాతీయ నాయకుడు ప్రకాశ్ జవదేకర్, రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రసంగాల్లో కీలక వ్యాఖ్యలు ….రానున్న ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందనే సంకేతాలు ఇస్తున్నాయి.
మరీ ముఖ్యంగా జనసేనాని పవన్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చురకలు అంటించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అనూహ్యంగా తమపై సోము వీర్రాజు వ్యంగ్యాస్త్రాలు విసరడంపై జనసేన ఆగ్రహంగా ఉంది. మనసులో ఏదో పెట్టుకుని సోము వీర్రాజు తమ నాయకుడిని టార్గెట్ చేశారని జనసేన నాయకులు వాపోతున్నారు.
‘ప్రజలు ఆశీర్వదిస్తే చిన్న పార్టీగా ఉన్న బీజేపీ 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వస్తుంది. ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయనిర్ణేతలు ప్రజలే’ అని ప్రకాశ్ జవదేకర్ అన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందనే సంకేతాల్ని ప్రకాశ్ జవదేకర్ స్పష్టం చేశారు. మిత్రపక్షమైన జనసేన ప్రస్తావనే లేకుండా, అది కూడా ఏపీలో చిన్న పార్టీగా ఉన్న బీజేపీ అని సంబోధించడం ద్వారా బలోపేతం చేయాలని శ్రేణులకి దిశానిర్దేశం చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక సోము వీర్రాజు ప్రసంగం అందరికంటే ఎక్కువగా జనసేనకే షాక్ ఇచ్చింది. ఆయన ఏమన్నారంటే…
‘పాలకేంద్రాలు అమ్మేశారు. సొంత పాలకేంద్రాలు పెట్టారు. ఆ డెయిరీల కోసం ఉద్యమం చేయమనండి పవన్‌కల్యాణ్‌ను. ఆ స్పిన్నింగ్ మిల్లుల కోసం ఉద్యమించమనండి పవన్‌కల్యాణ్‌ను. చంద్రబాబు, జగన్ జిల్లాల్లో మూతపడిన ఫ్యాక్టరీల ముందు పవన్ పోరాడాలి. చెరకు, స్పిన్నింగ్ ఫ్యాక్టరీలన్నీ అమ్మేసి, ఇప్పుడు ప్రభుత్వ భూములను అమ్మేస్తున్నారు. జగన్ జిల్లాలో మూడు చక్కెర ప్యాక్టరీలు మూతపడ్డాయి. చంద్రబాబు జిల్లాలో చక్కెర ప్యాక్టరీ మూతపడింది. ఆయన ఉండగా ఎందుకు తెరవలేకపోయారు’ అని సోము వీర్రాజు ఆవేశంతో పవన్‌పై ఊగిపోయారు.
జనసేనానితో బీజేపీకి పొత్తు చెదిరిందనేందుకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? పేరుకు తమతో పొత్తులో ఉంటూ, టీడీపీతో జనసేనాని పవన్ అంటకాగడంపై బీజేపీ ఆగ్రహంగా ఉందనేందుకు ముఖ్య నేతల దెప్పి పొడుపులే నిదర్శనం. ఇక బీజేపీ, జనసేన అధికారికంగా విడాకులు ఇచ్చుకోవడమే మిగిలి ఉందనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. దానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు.