సోము ‘మందు’ హామీ.. నీకు ఓకేనా పవన్?

ఏపీలో బీజేపీ, జనసేన దోస్తీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అవసరం ఉంటే రెండు పార్టీలు చేతులు కలుపుతాయి. అవసరం లేదనుకుంటే.. ఎవరికి వారే, యమునా తీరే అన్నట్టుగా ఉంటారు. అమరావతి అయినా, ఇంకే…

ఏపీలో బీజేపీ, జనసేన దోస్తీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అవసరం ఉంటే రెండు పార్టీలు చేతులు కలుపుతాయి. అవసరం లేదనుకుంటే.. ఎవరికి వారే, యమునా తీరే అన్నట్టుగా ఉంటారు. అమరావతి అయినా, ఇంకే సమస్య అయినా ఎవరి ప్రత్యేక అజెండా వారికి ఉంది. కానీ పైకి మాత్రం మిత్రపక్షం, ఏకపక్షం అంటూ బిల్డప్ ఇస్తుంటారు నాయకులు. 

సంప్రదాయం పాటిస్తూ ఆమధ్య బద్వేల్ ఉప ఎన్నికల్లో జనసేన పోటీ చేయడంలేదన్నారు పవన్ కల్యాణ్. తీరా బీజేపీ అక్కడ పోటీకి దిగితే.. మద్దతివ్వాల్సిందేనంటూ జనసైనికులకు ఉపదేశం ఇచ్చారు. తాజాగా ఏపీలో లిక్కర్ వ్యవహారంలో కూడా రెండు పార్టీల మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తోంది. చీప్ లిక్కర్ ని మరింత చీప్ గా జనాలకి ఇస్తామంటున్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.

పవన్ మాటేంటి..?

గతంలో పవన్ కల్యాణ్ మద్యనిషేధం కోసం డిమాండ్ చేశారు. ఎన్నికల హామీగా సంపూర్ణ మద్యనిషేధం అంటూ వైసీపీ ఇచ్చిన హామీని ఆయన పదే పదే గుర్తు చేస్తుంటారు. పోనీ వైసీపీ ప్రభుత్వం మద్యనిషేధం అమలు చేయలేకపోతే.. తాము అధికారంలోకి వస్తే చేసి చూపిస్తామని కూడా చాలా సార్లు సవాళ్లు విసిరారు. ఈ నేపథ్యంలో బీజేపీ మద్యాన్ని చౌక ధరలకే అందిస్తామని స్టేట్ మెంట్లు ఇస్తోంది. అంటే మద్యాన్ని ఏరులై పారిస్తామని చెప్పేసింది. మరి ఇది పవన్ కల్యాణ్ కి కూడా ఇష్టమేనా. చీప్ లిక్కర్ ని చీప్ గా పంపిణీ చేయడాన్ని పవన్ సమర్థిస్తారా..?

ప్రజా ఆగ్రహ సభ కంటే.. లిక్కర్ స్టేట్ మెంట్ హైలెట్..

నిన్న జరిగిన బీజేపీ ప్రజా ఆగ్రహ సభలో హైలెట్ ఏదైనా ఉందీ అంటే అది సోము వీర్రాజు ప్రసంగమే. ఆయన చీప్ లిక్కర్ గురించి చెప్పిన మాటలే. అవసరమైతే 70 రూపాయలకే ఇస్తాం, రాష్ట్ర పరిస్థితి బాగుంటే 50 రూపాయలకే ఇస్తామంటున్నారు. అంటే రాష్ట్రం ఆర్థికంగా బాగుంటే.. సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని చెప్పాలి కానీ, ఇలా చీప్ లిక్కర్ చీప్ గా ఇస్తామనడం ఏంటి..?

సోము వ్యాఖ్యలతో స్టేజ్ పైన ఉన్నవారు కూడా ఒక్కసారిగా షాకయ్యారు. మరి పవన్ కల్యాణ్ ఏమంటారో చూడాలి. అది ఆ పార్టీ వ్యక్తిగత అభిప్రాయం అంటూ కొట్టిపారేస్తారా లేకే బీజేపీతో పొత్తు కోసం తన ఎజెండాను కూడా పవన్ మార్చుకుంటారా?