టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏమీ దిక్కుతోచనట్టుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను అనుసరించాల్సిన పరిస్థితి. సోషల్ ఇంజనీరింగ్‌లో జగన్ ఆరితేరారు. దీని వల్ల 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘన విజయాన్ని సొంతం చేసుకోగలిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత అణగారిన వర్గాలకు తానిచ్చిన హామీలను అమలు చేయడంలో జగన్ ఎంతో చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నారు. దీంతో జగన్ మాట ఇస్తే తండ్రిలాగే తప్పడనే పేరు సొంతం చేసుకోగలిగారు.
ఈ నేపథ్యంలో జగన్ మాదిరిగానే కుల సమీకరణల్లో చంద్రబాబు తలమునకలయ్యారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్లను పురుగులను చూసినట్టు అసహ్యించుకున్న చంద్రబాబు … ప్రతిపక్షానికి వచ్చే సరికి అందరూ గుర్తుకొస్తున్నారు. తాజాగా పార్టీ పదవుల పంపకాల్లో బీసీలకు అగ్రస్థానం కల్పించామని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అదిరిపోయే పంచ్‌లు విసిరుతూ ట్వీట్ చేశారు. అదేంటో తెలుసుకుందాం.
‘అధికారంతో విర్రవీగిన రోజుల్లో అంతు చూస్తా, తోక కోస్తా అని బీసీలను.. చంద్రబాబు ఈసడించిన వీడియోలు సోషల్‌మీడియాలో ఇప్పటికీ చక్కర్లు కొడుతున్నాయి. పవర్ పోయాక పార్టీ పదవులు విదిలిస్తే ఎవరూ నమ్మరు చంద్రబాబు. విస్తరిలో వడ్డించేటప్పుడే ఆకలి మంటను గుర్తించాలి, వాటిని ఎత్తేసేటప్పుడు కాదు’అని విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు.
కమీషన్ పెంచాలని కోరిన నాయీబ్రాహ్మణులను నడిరోడ్డుపై తోకలు కత్తెరిస్తానని చంద్రబాబు తీవ్ర స్వరంతో హెచ్చరించిన విషయం తెలిసిందే. దాన్నే విజయసాయి పరోక్షంగా ప్రస్తావిస్తూ అవహేళన చేశారు. ముఖ్యంగా విస్తరిలో వడ్డించేటప్పుడే ఆకలి మంటను గుర్తించాలని, వాటిని ఎత్తేసేటపుడు కాదని చెప్పడం ద్వారా బాబుకు బాగా గడ్డి పెట్టారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.