థాంక్స్ మీట్ అంటూ పుష్ప నిర్మాతలు, దర్శకుడు, హీరో ఇలా టోటల్ టీమ్ నాలుగు గంటల సుదీర్ఘమైన సమావేశం నిర్వహించింది. అందరూ ఎవరికి వారు వారి వారి లెవెల్ లో థాంక్స్ చెప్పారు.
మైత్రీ సంస్థ సిఇవో చెర్రీ ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి పై స్థాయి వరకు ప్రతి ఒక్కరికీ థాంక్స్ చెప్పారు. కానీ మాటల రచయిత శ్రీకాంత్ విస్సా ను మరిచిపోయారు. నిర్మాతలు క్లుప్తంగా మాట్లాడారు కాబట్టి తప్పు పట్టాల్సిన పని లేదు.
దర్శకుడు సుకుమార్ ఎమోషనల్ గా మాట్లాడారు. పేరు పేరునా ప్రతి ఒక్కరి గురించి ప్రస్తావించారు. కానీ ఆయన కూడా తన టీమ్ కు, సినిమాకు కీలకమైన మాటల రచయితను మరచిపోయారు. రచయితే చంద్రబోస్ ను వేదిక మీదకు పిలిచి పాదాభివందనం చేసారు.
హీరో అల్లు అర్ఙున్ అయితే ముందుగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మాదిరిగా స్లయిడ్ లు తయారుచేసుకుని, రిమోట్ పాయింటర్ పట్టుకుని వచ్చారు. ఈ రోజు సుదీర్ఘంగా మాట్లాడతా అంటూనే గంట సేపు మాట్లాడారు. ప్రతి ఒక్కరి గురించి ప్రస్తావించారు. తన సహాయకులను కూడా పరిచయం చేసారు. ఆయన కూడా మాటల రచయిత గురించి మరిచిపోయారు. ముందుగా ప్లాన్ చేసారు. స్లయిడ్ కూడా చేయించలేదు, ప్రస్తావించలేదు అంటే ఏమై వుంటుందో అన్న గుసగుసలు మీడియాలో వినిపించాయి.
నిజానికి కొత్త మాటల రచయితే శ్రీకాంత్ విస్సా వర్క్ కు ఈ సినిమాలో మంచి అప్లాజ్ వచ్చింది. అలాంటిది కీలకమైన థాంక్స్ మీట్ లో ఆయన ప్రస్తావనే లేదు.