అన్ని పాములూ లేచి ఆడితే.. తాను కూడా లేచి ఆడుతున్నానని అన్నదిట వెనకటికి వానపాము! ఇప్పుడు ప్రజాగ్రహ సభ పెట్టి.. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద రంకెలేస్తున్న బీజేపీ వైఖరి కూడా అదే తీరుగా కనిపిస్తోంది.
జగన్ ప్రభుత్వం తప్పులు చేస్తున్నదని చెప్పడానికి కమలదళం.. ప్రజాగ్రహ సభ పేరిట ఒక ప్రహసనం నడిపించింది. ఈ సభలో రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఎడాపెడా చెలరేగిపోయారు. ‘జగన్ కు ఏం చూపించాలో అది చూపించే పార్టీ బీజేపీ ఒక్కటేనని’ సోము వీర్రాజు లేకి విమర్శలతో విరుచుకుపడ్డారు.
సిద్ధాంతాల పార్టీ అని చెప్పుకునే బీజేపీలో సోము వీర్రాజు లాంటి లేకి నాయకులు ఉంటే.. ఇలాంటి విమర్శలే వస్తాయి. ఏం చూపిస్తుంది బీజేపీ.. జగన్‌కి? అసలు వాళ్ల దగ్గర ఏం ఉన్నదని చూపించగలరు? చేవలేని నాయకుల చెత్త మాటలు తప్ప ఇంకొకటిగా ప్రజలు బీజేపీ మీటింగ్ ను పరిగణించడం లేదు.
కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ ఒక విజిటింగ్ ప్రొఫెసర్ లాగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయనను చూస్తే నిజంగా జాలేస్తుంది. ఏపీలో ఏం జరుగుతోందో తెలియదు. పార్టీ వాళ్లు సభ పెడుతున్న సంగతి మాత్రమే తెలుసు. ప్రభుత్వం మీద లోతైన విమర్శలు చేయడానికి ఆయనకు ఏపీ వ్యవహారాల గురించి ఎలాంటి అవగాహన లేదు.
జవదేకర్ ను మించి.. మరో నాయకుడిని పిలిచి జగన్ ప్రభుత్వం దండయాత్ర ప్రకటించగల దమ్ము బీజేపీకి కూడా లేదు. ఇదే- ఏపీలో విజయావకాశాల మీద ఏ చిన్న నమ్మకం ఉన్నా.. ఇలాంటి ప్రజాగ్రహ సభకు సాక్షాత్తూ అమిత్ షా వచ్చి ఉండేవారనడంలో సందేహం లేదు.
తమ పార్టీ ఢిల్లీ ప్రతినిధి కూడా ఒకరు వేదిక మీద ఉండే సరికి సోము వీర్రాజు రెచ్చిపోయారు. ఆయన జగన్ మోచేతి నీళ్లు తాగుతూ.. రాష్ట్రంలో పార్టీని సమాధి చేసేస్తున్నాడనే విమర్శలు నిన్నటిదాకా వారి పార్టీలోనే బలంగా వినిపిస్తూ ఉండేవి. ఆ నేపథ్యంలో.. తాను జగన్ కు తొత్తు గానీ, తైనాతీగానీ కాదని నిరూపించుకోవడానికి సాగించిన ప్రయత్నంగా ఆయన ప్రసంగం కొనసాగింది.
రాజకీయ పార్టీగా విధానాల మీద మాట్లాడడం వేరు. కానీ.. జగన్ కు ఏం చూపించాలో అది చూపిస్తాం లాంటి మాటలు ఆయన చవకబారు బుద్ధికి నిదర్శనాలు. కేంద్రం డబ్బులు.. కేంద్రం డబ్బులు అంటారు.. మోడీ అండ్ కో.. ఏమైనా కూలి పనిచేసి సంపాదించి తెచ్చిన డబ్బును ఏపీలో పథకాలకోసం ఇస్తున్నారా అనేది ప్రజలకు అర్థం కాని సంగతి.
ఏపీ నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో వెళుతున్నదెంత? కేంద్రంనుంచి రాష్ట్రానికి నిధుల రూపంలో వస్తున్నదెంత? అనే లెక్కలు ఏనాడైనా చెప్పగల దమ్ము ఏ బీజేపీ నేతకైనా ఉందా? అనే ప్రశ్న ప్రజల మదిలో మెదలుతోంది.