దమ్ముంటే ఆ ఒక్క ప్రకటన చేయగలవా బాబూ..!

ఏపీకి కాపు ముఖ్యమంత్రి. వినడానికి సౌండింగ్ చాలా బాగుంది. ఉమ్మడి ఏపీ అయినా, విభజిత ఆంధ్ర అయినా.. రెడ్డి, కమ్మ.. ఈ రెండు కులాలతోటే ఇప్పటి వరకు ఏపీ సీఎం కుర్చీ దోబూచులాడింది. మధ్యలో…

ఏపీకి కాపు ముఖ్యమంత్రి. వినడానికి సౌండింగ్ చాలా బాగుంది. ఉమ్మడి ఏపీ అయినా, విభజిత ఆంధ్ర అయినా.. రెడ్డి, కమ్మ.. ఈ రెండు కులాలతోటే ఇప్పటి వరకు ఏపీ సీఎం కుర్చీ దోబూచులాడింది. మధ్యలో ఇతర కులస్తులకు అవకాశం దక్కింది కానీ.. జనాభా పరంగా, రాజకీయంగా మూడో ప్రత్యామ్నాయం అనుకున్న కాపులకు మాత్రం ఆ ఛాన్స్ దొరకలేదు. భవిష్యత్తులో దొరుకుతుందా లేదా అనేది రాజకీయ పార్టీల తీరుతెన్నులపై ఆధారపడి ఉంటుంది.

వైసీపీలో జగనే సీఎం, మరో ఆల్టర్నేట్ లేదు. మరి టీడీపీలో చంద్రబాబు తర్వాత పరిస్థితి ఏంటి..? టీడీపీ వారసత్వ పార్టీ కాదు అని చంద్రబాబు రుజువు చేశారు. ఎన్టీఆర్ కొడుకులకు వెళ్లాల్సిన పార్టీ పగ్గాలను అల్లుడు స్థానంలో తాను ఒడిసి పట్టుకున్నారు. పేరుకి ఏపీ పార్టీకి బీసీ నాయకుడిని అధ్యక్షుడిగా చేశారు కానీ, లోపల ఆయనకు బీసీలపై ఎంత ప్రేముందో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు ఏపీలో కొత్త పల్లవి అందుకున్నారు చాలా మంది.

కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే కాపు వర్గానికి ముఖ్యమంత్రి పదవి ఇస్తామని అనధికారికంగా చెబుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి ఎలాగూ రాదు కాబట్టి.. వారి హామీ ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది. బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తే ఎవరిని ముఖ్యమంత్రి చేస్తారో ఇంతవరకు ప్రకటించలేదు. బహుశా ఆ ఆశ లేకపోవడం, ఏమీ లేని టైమ్ లో ఇలాంటి వ్యర్థ ప్రకటనలు ఎందుకని వారు ఊహించి ఉండొచ్చు.

ఇప్పుడిక టీడీపీ వంతు. కాపుల మద్దతుతో మరోసారి అధికారంలోకి రావాలనేది చంద్రబాబు ఆలోచన. 2014లో కాపు రిజర్వేషన్ల హామీ ఇచ్చారు. 2019లో కూడా రిజర్వేషన్లకు మద్దతుగా మాట్లాడారు. జనసేన వంటి పక్కా కాపు బ్రాండ్ పార్టీతో చేతులు కలపాలని చూస్తున్నారు. కాపు ఓట్ల కోసం ఇప్పటినుంచే తెగ కష్టపడుతున్నారు. ఎలాగైనా ఈసారి కాపుల మద్దతుతో అధికారంలోకి రావాలనేది చంద్రబాబు ఎత్తుగడ.

నిజంగా బాబుకు కాపులపై అంత ప్రేమ ఉంటే.. కాపుల ఓట్లన్నీ గంపగుత్తగా తనకే పడాలని కోరుకుంటే ఓ పని చేయాలి. టీడీపీ గెలిస్తే కాపు నేతనే ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించాలి. బాబుకు అంత ధైర్యం ఉందా..?

టీడీపీలో ఇప్పటివరకు తన పేరు తప్ప మరోపేరు తెరపైకి రాకుండా చేశారు బాబు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ పేరు బాగా పాపులర్ అయినప్పుడు ఎలాంటి రాజకీయాలు చేశారో అందరం చూశాం. ప్రస్తుతం మళ్లీ బాబే కావాలి, మళ్లీ బాబే రావాలంటూ తన స్లోగనే వినిపించేలా చేస్తున్నారు. పోనీ గతంలో కేసీఆర్ దళిత ముఖ్యమంత్రి అనే హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక నాలిక మడతేసినట్టు ఇప్పుడు చంద్రబాబు కూడా చేస్తారేమో చూడాలి.

పొరపాటున బాబు అలాంటి హామీ ఇస్తే మాత్రం ఇరుకునపడిపోతారు. కాపుల ఓట్లు దేవుడెరుగు.. ముందు కమ్మ ఓట్లు కనుమరుగైపోతాయి. ఆర్థిక మద్దతుదారులు ఎదురుతిరుగుతారు. అందుకే బాబుకి కాపు ఓట్లు కావాలి, కాపు నాయకులక్కర్లేదు.