శ్రీకాకుళం జిల్లా రాజకీయాలలో ధర్మాన సోదరులది కీలకమైన పాత్ర. అన్న క్రిష్ణ దాస్ జగన్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రధానమైన రెవిన్యూ శాఖను చూస్తున్నారు. ఇక ఆయన తమ్ముడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం ఎమ్మెల్యేగా ఉన్నారు. మాజీ మంత్రిగా ఆయన జిల్లాలో ముఖ్య భూమికను పోషిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ ఇద్దరు సోదరులు ఒక ప్రధానమైన నిర్ణయం తీసుకున్నారు. అదేంటి అంటే 2022 కొత్త సంవత్సరం వేడుకలకు మేము దూరం అంటున్నారు. ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. దేశంలో, రాష్ట్రంలో కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తున్న నేపధ్యంలో న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కి ఈసారి దూరంగా ఉంటున్నట్లుగా అందులో పేర్కొన్నారు.
ఒమిక్రాన్ వ్యాప్తి చెందకుండా అందరూ సహకరించాలని, అందుకే తాను వేడుకలకు దూరమని క్రిష్ణదాస్ చెప్పారు. కాబట్టి తనను వ్యక్తిగతంగా ఆఫీసులో జనవరి 1న కలిసేందుకు ఎవరూ రావద్దు అంటూ ఆయన కోరారు. తాను సైతం స్థానికంగా అందుబాటులో ఉండనని ఆయన స్పష్టం చేశారు. ఒమిక్రాన్ వైరస్ నియంత్రణ పూర్తిగా జరగాలని, పరిస్థితులు చక్కబడాలని, అంతవరకూ మూకుమ్మడి వేడుకలకు ప్రతీ ఒక్కరూ దూరంగా ఉండాలని క్రిష్ణదాస్ విజ్ఞప్తి చేశారు.
ఇదిలా ఉండాగా ప్రసాదరావు సైతం ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వేడుకలకు కలవనంత మాత్రాన అనుబంధాలు అభిమానాలు ఎక్కడా చెక్కుచెదరవని ఆయన అంటున్నారు. పరిస్థితుల తీవ్రతను అర్ధం చేసుకోవాలని ఆయన క్యాడర్ ని కోరారు. ఇదే బాటలో మిగిలిన ప్రజా ప్రతినిధులు కూడా ఇపుడు నడుస్తున్నారు. మొత్తానికి దూరంగా ఉండడమే మేలు అని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. జనమంతా ఈ సదేశాన్ని పాటిస్తే అందరికీ మంచిదే కదా.