ఏపీ బీజేపీలో ఓ వికెట్ పడింది. పార్టీ వైఖరికి భిన్నంగా టీవీ చర్చల్లో మాట్లాడ్డమే కాకుండా ఒకసారి షోకాజ్ నోటీసు జారీ చేసిన తర్వాత కూడా అదే వైఖరి అవలంబిస్తున్నాడనే కారణంతో బీజేపీ నేత లంకా దినకర్‌పై ఆ పార్టీ సస్సెన్షన్ వేటు వేసింది.
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి పాలూరి శ్రీనివాసరావు సస్పెన్షన్ వేటుకు గురైన దినకర్‌కు రాసిన లేఖలో స్పష్టం చేశారు.
ఇదే సందర్భంలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అనుమతి లేకుండా టీవీ చర్చలకు వెళ్లినా, సొంత ప్రకటనలు విడుదల చేసినా అలాంటి వారిపై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందని ఆ ప్రకటనలో విష్ణు హెచ్చరించారు. ఇక మీదట పార్టీ నియమించిన వారిని మాత్రమే టీవీ చానళ్లు చర్చలకు పిలవాలని ఆయన కోరారు.
పార్టీ నియమావళిని అతిక్రమించారని, పలు చానళ్ల ఎజెండాకు అనుగుణంగా మాట్లాడుతున్నారని దినకర్‌పై వేటు వేయడంతో పాటు ఇక మీదట మరెవరినైనా ఉపేక్షించేది హెచ్చరించడం వరకూ అభినందించాల్సిందే.
మరి క్రమశిక్షణ చర్యలు చిన్నవాళ్లపై మాత్రమేనా, పెద్ద నాయకులకు వర్తించవా? అనే ప్రశ్న బీజేపీ శ్రేణుల నుంచి వినవస్తున్న మాట. నిజంగా బీజేపీలో పార్టీ నియమావళిని అతిక్రమించిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి వస్తే …ఎల్లో మీడియా పాలసీకి అనుగుణంగా మాట్లాడ్డం లేదా ప్రకటనలివ్వడాన్ని తప్పు పట్టాల్సి వస్తే …ఆ పని చేస్తున్న వారిలో బీజేపీ జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్ ఉన్నారు.
ఈయనపై చర్యలకు తీసుకునే దమ్ము బీజేపీ జాతీయ నాయకులకు ఉందా? అని సస్పెన్షన్‌కు గురైన నాయకులు, వాళ్ల అనుచరులు ప్రశ్నిస్తున్నారు.
‘సత్యకాలమ్’ పేరుతో బీజేపీ జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్ వారానికి ఒక రోజు ఆంధ్రజ్యోతిలో వ్యాసం రాస్తున్న సంగతి తెలిసిందే. (ఆయనకు వ్యాసం రాసేంత సీన్ లేదు. ఘోష్ట్ రైటర్ ఉన్నారనే అభిప్రాయాలు సొంత పార్టీలో ఉన్నాయనుకోండి. అది వేరే విషయం. దాని గురించి మనకు అనవసరం)
ఈ రోజు ఆంధ్రజ్యోతి ఎడిట్ పేజీలో ‘స్వీయ విధ్వంసంలో జగన్!’ శీర్షికతో సత్యకుమార్ ఓ సత్య కథనాన్ని వండివార్చారు. ఈ వ్యాసాన్ని చదివిన వారికెవరికైనా ఆంధ్రజ్యోతి, ఈనాడులో జగన్‌పై రాస్తున్న వ్యతిరేక వార్తల సమూహారమని తప్పక అనిపిస్తుంది.
ముఖ్యంగా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో పాటు పలువురు హైకోర్టు న్యాయమూర్తులపై తీవ్ర ఆరోపణలు గుప్పిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆ ఫిర్యాదుకు సంబంధించిన లేఖను విడుదల చేశారు. ఈ విషయంపై ముఖ్యంగా బీజేపీ ఇంత వరకూ నోరు మెదపలేదు. జగన్ వెనుక బీజేపీ ఉందనే ఆరోపణలు కూడా లేకపోలేదు.
ఈ నేపథ్యంలో జగన్ లేఖపై సత్యకుమార్ అభిప్రాయాలు పార్టీ నియమావళికి భిన్నమో, కాదో బీజేపీ అగ్రనేతలు తేల్చుకోవా ల్సిన సమయం వచ్చింది. సత్యకుమార్ తన కాలమ్‌లో ఏం రాశారో చూద్దాం.
‘సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడమే కాక ఆ లేఖను అధికారికంగా విడుదల చేయడం జగన్మోహన్ రెడ్డి వివేకాన్ని ప్రశ్నార్థకం చేసింది. ఆ లేఖలో చేసిన ఆరోపణలు వాస్తవమేనా, లేక జగన్ కేవలం ఒక వర్గంపై కక్ష పెంచుకుని గుడ్డి వ్యతిరేకతతో కన్నూమిన్నూ గానకుండా వ్యవహరిస్తున్నారా అన్న చర్చ దేశ వ్యాప్తంగా చెలరేగింది.
బహుశా తన ఆరోపణల్లో బలం లేదని, దాన్ని న్యాయప్రపంచం పట్టించుకోదని అనిపించినందువల్లే ఆయన తన లేఖను విడుదల చేయడం ద్వారా రచ్చ చేయాలని భావించి ఉండవచ్చు’
ఇంతకంటే అన్యాయమైన రాతలు మరేమైనా ఉన్నాయా? నిజంగానే జగన్ రాసిన లేఖపై సత్యకుమార్ అభిప్రాయమే, బీజేపీదే కూడా అయితే …ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోడానికి భయమెందుకు? అలాగే అదే విషయాన్ని జాతీయ నాయకత్వం ప్రకటించడానికి మొహమాటం ఎందుకు? .
సత్యకుమార్ తన కాలమ్‌లో వెలబుచ్చిన అభిప్రాయాలు టీడీపీ, ఆ పార్టీకి కొమ్ముకాసే ఎల్లో మీడియావి కావా? ఈయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే దమ్ము, ధైర్యం బీజేపీ జాతీయ నాయకత్వానికి ఉందా? అని సామాన్య కార్యకర్తల ప్రశ్నలకు సమాధానం ఏంటి?