జబ్బు ఏమిటి? దానికి మందు ఏమిటి? అని చకచకా ఆలోచించడంలో కేసిఆర్ ఒక విధంగా గొప్పోరే. ఒక్క ప్రెస్ మీట్ తో మొత్తం సీన్ మార్చగలరు. ఒక్క అఫీషియల్ మీట్ తో జనాలను తన వైపు తిప్పుకోగలరు.
ఇప్పుడు అలాంటి ప్రయత్నంలోనే వున్నారు కేసిఆర్. అనుకోకుండా విరుచుకుపడిన దారుణ వర్షాలు హైదరాబాద్ బస్తీలను అతలాకుతలం చేసాయి. అంతే కాదు, ఎకరాలకు ఎకరాల్లో కట్టిన గేటెడ్ కమ్యూనిటీలను కూడా ముంచెత్తాయి. సాధారణంగా వరద గెడ్డలు అనేవి కంటికి కనిపించేవి కాదు. అవి లోకల్స్ కు, ఏళ్లతరబడి ఆ ప్రాంతంలో బతికేవారికే తెలుస్తాయి. ఎక్కడ గెడ్డలు వున్నాయి. అవి ఏ దిశగా వస్తాయి అన్నది.
అయితే ఎకరాలకు ఎకరాలు తీసుకుని గేటెడ్ కమ్యూనిటీలు కట్టినపుడు ఈ గెడ్డలు వాటిలో అంతర్భాగం అయిపోతాయి. భయంకరమైన వర్షాలు పడనంత వరకు ఓకె. ఎవరికీ తెలియదు. ఏ ఇబ్బంది రాదు. కానీ ఇప్పుడు ఈసారి పడినలాంటి వర్షాలు పడితే మాత్రం సమస్య తప్పదు.
ఇక రెండో విషయం. మురుగునీటి పారుదల వ్యవస్థ. అధికారులు అనేవాళ్లు పాతికేళ్లు ముందుగా ఆలోచించి, అప్పటి పరిస్థితులు, అప్పటి జనాభా, అప్పటి నీటి వినియోగం లెక్కించి, నిర్మాణాలు చేపట్టాలి. రోడ్ల నిర్మాణమైనా, మరే పబ్లిక్ కోసం చేసే నిర్మాణమైన ఇలా ఆలోచించి చేయాల్సిందే. కురిసే వర్షం లెక్కకు, దాన్ని తీసుకుపోయే నాలాల సామర్ధ్యం లెక్కకు పొంతన కుదరకపోతే రోడ్లన్నీ కాలవలుగా మారిపోతాయి. దీనికి తోడు ఎక్కడిక్కడ నాలాలు ఆక్రమించి చేసే నిర్మాణాలు వుండనే వుంటాయి. పూడిక తీత అన్నది అంతంత మాత్రం.
ఇలా అన్నీ కలిసి హైదరాబాద్ ను అతలాకుతలం చేసాయి. దీంతో సహజంగానే ప్రజలు రివర్స్ అయ్యారు. అలా అని చెప్పి, ఎవ్వరూ రోడ్ల మీదకు రాలేదు. సోషల్ మీడియాలో ఒక లెక్కలో విమర్శలు, జోక్ లు, సెటైర్లు, మీమ్స్. అదే సమయంలో ఒకటి రెండు చోట్ల ప్రజా ప్రతినిధులను నిలదీయడం.
అసలే కార్పొరేషన్ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో తమదే విజయం అనే ధీమాతో తెరాస వుంది. ఇక్కడ దానికి భాజపా పక్కలో బల్లెం మాదిరిగా వుంది. ఇలాంటి నేపథ్యంలో అనుకోని విపత్తు అటు జనాలకు ఇటు తెరాసకు కూడా. అందుకే కేసిఆర్ అర్జెంట్ గా రంగంలోకి దిగిపోయారు. ఇంటికి పదివేలు వంతున సాయం ప్రకటించారు. అలాగే యాభై వేలు, లక్ష వంతున డ్యామేజ్ సాయం ప్రకటించారు.
నిజానికి డ్యామేజ్ జరిగిన వాటికి ఇవేమీ పెద్ద మొత్తాలు కాదు. ఒక కారు పాడయితేనే వేలు, లక్షలు ఖర్చయిపోతాయి. ఒక ఇంట్లో ఏ టీవీనో, మరోటో పోతేనే పదివేలు ఏ మూలకూ చాలదు. కానీ ముందు ఇమ్మీడియట్ గా ప్రభుత్వం నుంచి ఏదో ఒక సాయం అందుతోంది అన్న భావన జనాలకు కలగాలి. ఇది ఆరంభం మాత్రమే, ఇంకా చాలా చేస్తాం అన్న భావన ప్రభుత్వం కలిగించగలగాలి. కేసిఆర్ చేసింది ఇదే.
ఇదే టైమ్ లో కేసిఆర్ కు మరో ఆలోచన కూడా వుండి వుండాలి. ఆయన కేంద్రాన్ని వరదసాయం అడిగారు. అక్కడ నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. అలాగే కేంద్రం అర్జెంట్ గా సాయం చేస్తుందన్న ఆశ కూడా లేదు. కేంద్రం ఇప్పుడు రూపాయి ఇవ్వకపోతే, రేపు కార్పొరేషన్ ఎన్నికల టైమ్ లో తెరాస ప్రభుత్వాన్ని విమర్శించడం అన్నది భాజపాకు సాధ్యం కాదు.
తాము అయిదు వందల కోట్లు జనాలకు ఇచ్చి, ఆ పై రోడ్లకు, ఇతర మరమ్మతులకు వేల కోట్లు ఖర్చు చేసామని, రూపాయి ఇవ్వని భాజపా కేవలం విమర్శలు మాత్రం చేస్తోందని తెరాస తిప్పి కోట్టే అవకాశం వుంటుంది.
ఇక్కడ చమక్కు ఏమిటంటే, జనాల కష్టాలను తీర్చడానికి డబ్బులు దివ్వ ఓ ఔషథంగా పని చేస్తాయని ఆంధ్ర సిఎమ్ జగన్ ఎంచుకున్నదారినే కేసిఆర్ కూడా ఎంచుకోవడం.