పవన్ కల్యాణ్ ‘మిడిల్ డ్రాప్స్’

పవన్ కల్యాణ్ ఎప్పుడు ఏ సినిమా లాంచ్ చేసినా, ఆ మూవీపై ఎప్పుడూ ఓ రకమైన అనిశ్చితి కనిపిస్తుంది. మొన్నటివరకు హరీశ్ శంకర్ సినిమాపై ఊగిసలాట కనిపించింది. ఆ సినిమా ఆగిపోయిందనే ప్రచారం కూడా…

పవన్ కల్యాణ్ ఎప్పుడు ఏ సినిమా లాంచ్ చేసినా, ఆ మూవీపై ఎప్పుడూ ఓ రకమైన అనిశ్చితి కనిపిస్తుంది. మొన్నటివరకు హరీశ్ శంకర్ సినిమాపై ఊగిసలాట కనిపించింది. ఆ సినిమా ఆగిపోయిందనే ప్రచారం కూడా నడిచింది అప్పట్లో. ఇక సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా వస్తుందా రాదా అనే అనుమానం ఇప్పటికీ ఉంది.

అయితే ఈ పరిస్థితి ఇప్పుడు మాత్రమే కాదు, ఓవరాల్ గా చూసుకుంటే, పవన్ కల్యాణ్ కెరీర్ మొత్తం ఈ అనిశ్చితి కనిపిస్తుంది. మిగతా హీరోలతో పోలిస్తే పవన్ కెరీర్ లోనే మిడిల్ డ్రాప్స్ ఎక్కువగా ఉన్నట్టున్నాయి.

పవన్ కెరీర్ లో చాన్నాళ్ల పాటు నలిగిన సినిమా సత్యాగ్రాహి. స్వీయ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా రావాల్సిన ఈ సినిమా ఆగిపోయింది. ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టి మరీ ఆపేశాడు పవన్. ఏఎం రత్నం ఈ సినిమాకు నిర్మాత. రెహ్మాన్ ను సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. ఈ సినిమా ఓపెనింగ్ అయితే నభూతో అనే రేంజ్ లో జరిగింది. అంతలోనే ఆగిపోయింది.

ఇక పవన్ కెరీర్ లో భారీ హైప్ తో వచ్చి, చాన్నాళ్లు నలిగి ఆగిపోయిన సినిమా కోబలి. టైటిల్ తోనే ప్రకంపనలు సృష్టించింది ఈ మూవీ. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎప్పుడెప్పుడు ఈ సినిమా థియేటర్లలోకి వస్తుందా అని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూశారు. వాళ్ల ఆశలు ఫలించలేదు, సినిమా సెట్స్ పైకి రాలేదు, ఆ తర్వాత కొన్నాళ్లకు పూర్తిగా పక్కకుపోయింది.

ఇలా మిడిల్ డ్రాప్ అయిన మరో మూవీ 'ప్రిన్స్ ఆఫ్ పీస్'. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో పవన్ కల్యాణ్ చేయాల్సిన సినిమా ఇది. దీనికి సంబంధించి జెరూసెలంలో ఓ షెడ్యూల్ కూడా పూర్తిచేశారు. ఆ తర్వాత ఎందుకో ఈ కథపై పవన్ కు నమ్మకం సన్నగిల్లింది. సినిమా ఆపేశాడు.

ఇక అత్తారింటికి దారేది సక్సెస్ తర్వాత పవన్-వినాయక్ కాంబో దాదాపు ఫిక్స్ అయింది. నిర్మాతలు, టెక్నీషియన్లు.. అన్నింటికీ మించి పవన్ కాల్షీట్లు ఇలా అన్నీ సెట్ అయిపోయాయి. కానీ అంతలోనే దాన్ని ఆపేశాడు పవన్. పొలిటికల్ ఎంట్రీతో పాటు మరెన్నో కారణాలతో ఆ సినిమా ఆగిపోయింది.

ఏఎం రత్నం నిర్మాతగా నేసన్ దర్శకత్వంలో ఓ సినిమాకు కొబ్బరికాయ కొట్టాడు పవన్ కల్యాణ్. లారెన్స్ దర్శకత్వంలో కూడా ఓ పోలీస్ కథకు ఓకే చెప్పాడు. కానీ ఇవేవీ సెట్స్ పైకి రాలేదు. కార్యరూపం దాల్చలేదు.

ఇవన్నీ ఒకెత్తు, చిరంజీవితో పవన్ కల్యాణ్ చేయాల్సిన మెగా మల్టీస్టారర్ మరో ఎత్తు. ఈ సినిమా ప్రకటన కూడా అధికారికంగా వచ్చింది. కానీ ఇప్పటికీ ఆ ప్రకటనే మిగిలింది. ఇలా చెప్పుకుంటూ పోతే పవన్ కల్యాణ్ కెరీర్ లో ఆగిపోయిన సినిమాలు ఇంకొన్ని కూడా ఉంటాయి. బహుశా ఇప్పుడు మనం చెప్పుకున్నవి కొన్ని మాత్రమే.