ఒకే ఒక్క ప్ర‌శ్న‌…ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో జ‌న‌సేన‌!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎన్నిక‌ల వేడి మొదలైంది. ఎన్నిక‌ల‌కు స‌రిగ్గా ఏడాది స‌మ‌యం మాత్ర‌మే వుంది. దీంతో అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీలు ఎత్తుకుపైఎత్తులేస్తున్నాయి. అధికారాన్ని నిలబెట్టుకోడానికి వైసీపీ ఎందాకైనా స‌రే అంటోంది. అలాగే ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ…

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎన్నిక‌ల వేడి మొదలైంది. ఎన్నిక‌ల‌కు స‌రిగ్గా ఏడాది స‌మ‌యం మాత్ర‌మే వుంది. దీంతో అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీలు ఎత్తుకుపైఎత్తులేస్తున్నాయి. అధికారాన్ని నిలబెట్టుకోడానికి వైసీపీ ఎందాకైనా స‌రే అంటోంది. అలాగే ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ కూడా చావోరేవో తేల్చుకోడానికి సిద్ధ‌మైంది. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన పార్టీ పాత్ర ఏంట‌నేది స్ప‌ష్ట‌త రాలేదు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ నిల‌క‌డ‌లేని రాజ‌కీయాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

ముఖ్య‌మంత్రిని గ‌ద్దె దించేందుకు త‌న మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీని రోడ్ మ్యాప్ అడిగి స‌రిగ్గా ఏడాది అయ్యింది. ఆల్రెడీ ఇచ్చామ‌ని బీజేపీ చెబుతోంది. ఈ నేప‌థ్యంలో బీజేపీతో జ‌న‌సేన‌కు పొత్తు వుందా? లేదా? అనేది అంతుచిక్క‌ని ప్ర‌శ్న‌గా మిగిలింది. ప్ర‌శ్నించ‌డానికే పార్టీ పెట్టాన‌న్న ప‌వ‌న్‌క‌ల్యాణ్‌… తానే నిల‌దీత‌కు గురి అవుతున్నారు. పార్టీ పెట్టి ప‌దేళ్లు అయిన పార్టీ క‌నీసం అధినేతే గెల‌వ‌లేని దుస్థితి. దీంతో ప్ర‌త్య‌ర్థులు మ‌రోసారి జ‌న‌సేనానితో మైండ్ గేమ్‌కు తెర‌లేపారు.

తాము 175కు 175 స్థానాల్లో పోటీ చేస్తామ‌ని, అన్నింటిలో గెలుపొందుతామంటూ ప్ర‌త్య‌ర్థుల‌ను క‌వ్విస్తోంది. ఇదే సంద‌ర్భంలో జ‌న‌సేన ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందో చెప్పాల‌ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మొద‌లుకుని, ఆ పార్టీ నేత‌లు డిమాండ్ చేయ‌డం గ‌మ‌నార్హం. తాము ఎన్నిస్థానాల్లో పోటీ చేస్తామో వైసీపీకి ఎందుక‌ని జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, నాదెండ్ల మ‌నోహ‌ర్ అంటున్నారు. దీంతో ఆ పార్టీ ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డిన‌ట్టైంది.

ఎందుకంటే తాము అధికారంలోకి వ‌స్తే టీటీడీ బోర్డు మెంబ‌ర్ల‌లో స‌గానికి స‌గం మందిని బీసీల‌ను నియ‌మిస్తామ‌ని, ఫ‌లానా సంక్షేమ కార్య‌క్ర‌మాలు చేస్తామ‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, ఆ పార్టీ నేత‌లు చెబుతున్నారు. అస‌లు ఎన్ని సీట్ల‌లో పోటీ చేస్తారో చెప్ప‌లేని నాయ‌కులు, అధికారంలోకి ఎలా వ‌స్తార‌నే ప్ర‌శ్న‌కు స‌మాధానం కొర‌వ‌డింది. మొత్తం 175 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అధికారంలోకి రావాలంటే 88 సీట్ల‌లో గెల‌వాల్సి వుంటుంది. టీడీపీతో పొత్తు కుదుర్చుకంటే జ‌న‌సేన‌కు ఇచ్చే సీట్లు 25కు లోపే అని ప్ర‌చారం జ‌రుగుతోంది. దీన్ని ఖండించ‌లేని దుస్థితిలో జ‌న‌సేన వుంది.

టీడీపీతో పొత్తు వుంటుందా? వుండ‌దా? అని చెప్పే ద‌మ్ము, ధైర్యం జ‌న‌సేన‌కు లేక‌పోయింది. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన‌పై రాజ‌కీయ దాడి తీవ్ర‌మ‌వుతోంది. తాము ఎన్ని సీట్లో పోటీ చేస్తామో మీకెందుక‌ని జ‌న‌సేన చెప్ప‌డానికి వీల్లేదు. ఎందుకంటే ఎన్ని సీట్ల‌లో పోటీ చేయ‌లేని వాళ్లు, తాము అధికారంలోకి వ‌స్తామ‌ని క‌నీసం త‌మ శ్రేణుల‌కు ఏ విధంగా భ‌రోసా ఇస్తార‌నే ప్ర‌శ్న ఎదుర‌వుతోంది. 

టీడీపీతో పొత్తు పెట్టుకోవాల‌ని మ‌న‌సులో ఉన్న‌ప్ప‌టికీ, గౌర‌వ‌ప్ర‌ద‌మైన సీట్లు ఇవ్వ‌ద‌నే అప‌న‌మ్మ‌కం ప‌వ‌న్‌ను వెంటాడుతున్న‌ట్టుంది. అందుకే ఆయ‌న చంద్ర‌బాబును న‌మ్మి ముంద‌డుగు వేయ‌లేక‌పోతున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఏది ఏమైనా వైసీపీ సంధిస్తున్న ఒకే ఒక్క ప్ర‌శ్న‌… జ‌న‌సేన‌ను ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేసింద‌న్న‌ది వాస్త‌వం.