టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కాలానుగుణంగా మారడం లేదు. అందుకే ఆయన సారథ్యం వహిస్తున్న టీడీపీ కూడా రోజురోజుకూ పతనమవుతోందనే అభిప్రాయం బలపడుతోంది. తానేదో గొప్ప ప్రజాస్వామ్య పరిరక్షకుడైనట్టు, ఒక్క పిలుపు ఇస్తే జనమంతా వింటారనే భావనలో చంద్రబాబు ఉన్నట్టు కనిపిస్తోంది. తనలో ఆ భావనే లేకపోతే ఎమ్మెల్సీ ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజానీకానికి బహిరంగ లేఖ రాసి వుండేవారు కాదనే చర్చకు తెరలేచింది.
చంద్రబాబు రాజకీయాన్ని చూసిన వారెవరైనా ఆయనంటే ఇష్టపడతారా? చంద్రబాబు అంటే కుట్ర, వంచన, వెన్నుపోటుకు పర్యాయపదంగా చెప్పుకుంటారు. ఎందుకంటే ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం అట్లే సాగింది. ఆదరించి దగ్గరికి తీస్తే, అందలం ఎక్కేందుకు ఎవరికైనా వెన్నుపోటు పొడుస్తారనే పేరుపై ఆయనవే సర్వహక్కులు. చిత్తూరు జిల్లాలో రాజకీయ భిక్ష పెట్టిన రాజగోపాలనాయుడు (మాజీ మంత్రి గల్లా అరుణ తండ్రి), నల్లారి అమర్‌నాథ్‌రెడ్డి (నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి తండ్రి) తదితరులను మొదలుకుని పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ వరకూ అందరూ చంద్రబాబు వంచనకు గురైన వారే. అలాగే తండ్రిని వెన్నుపోటు పొడవడానికి బావ బాబుకు సహకరించిన నందమూరి హరికృష్ణ, తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావులకు బాబు చేతిలో ఏ గతి పట్టిందో జగమెరిగిన సత్యం.
అలాంటి చంద్రబాబు పట్టభద్ర, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్లను ఉద్దేశించి రాసిన బహిరంగ లేఖలో…. రాష్ట్ర వినాశనానికి కారణమైన వైసీపీకి ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలని పిలుపునివ్వడం గమనార్హం. వైసీపీ ప్రభుత్వం ప్రతి వర్గానికి మోసం చేసిందని ఆ లేఖలో ప్రస్తావించారు. అలాగే తన పాలన గొప్పతనాన్ని పేర్కొన్నారు.
‘ ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో సుమారు పది లక్షల ఉద్యోగాలు కల్పించింది. 6లక్షల మంది నిరుద్యోగులకు నెలకు రూ.2వేల వంతున నిరుద్యోగ భృతి ఇచ్చింది. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వ టెర్రరిజంతో పరిశ్రమలు పారిపోతున్నాయి. నిరుద్యోగం పెరిగి పోతోంది. జాబ్ క్యాలెండర్, డీఎస్సీ నిర్వహణలో యువత ను వైసీపీ ప్రభుత్వం మోసం చేసింది. తిరుపతి లోక్‌సభ స్థానం ఉప ఎన్నికలో దొంగ ఓట్లు ఎలా వేశారో ప్రపంచం అంతా చూసింది. సిగ్గు లేకుండా ఇప్పుడు కూడా అదే దారిలో వెళ్తున్నారు ’ అని పేర్కొన్నారు.
వైసీపీ అరాచకాలను ఎదుర్కోడానికి ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ చేస్తున్నదేంటి? ఇలా లేఖలు రాయడం వల్ల తమ బాధ్యత నెరవేరినట్టా? లోక్‌సభ ఉప ఎన్నికలో చూసిన తర్వాతైనా టీడీపీ ఎందుకు అప్రమత్తమై, దొంగ ఓట్ల నమోదును అడ్డుకోలేదనే ప్రశ్నకు సమాధానం ఏంటి? ఒకవైపు టీవీల ముందుకొచ్చి విమర్శలతో తమ పని పూర్తయిందనే భావనలో టీడీపీ, ఇతర ప్రతిపక్షాలుంటే, మరోవైపు అధికార పార్టీ యాక్షన్‌లో దిగుతోంది. అంతిమంగా టీడీపీ సాధిస్తున్నదేంటి? టీడీపీ ఇదే పంథాలో రాజకీయం చేస్తే మాత్రం రానున్న ఎన్నికల్లో మరోసారి ఘోర పరాజయాన్ని మూటకట్టుకోక తప్పదు. కావున చంద్రబాబు ఇలా లేఖలు, మీడియా సమావేశాలతో కాలం వృథా చేయకుండా ఏదైనా ఆచరణ మార్గముంటే చూడాలి.