ప్రభాస్‌ రేంజ్‌ తగ్గుతోంది.. అల్లు అర్జున్‌ క్రేజ్‌ పెరిగింది!

మొన్నటి వరకూ ఏపీ ఆవల మంచి గుర్తింపు ఉన్న టాలీవుడ్‌ స్టార్లలో టాప్‌ ఎవరంటే.. ప్రభాస్‌ పేరు ప్రముఖంగా వినిపించేది! బాహుబలితో ప్రభాస్‌ కు ఇలాంటి గుర్తింపు దక్కింది. తెలుగుకు మించి ప్రభాస్‌ సినిమాల…

మొన్నటి వరకూ ఏపీ ఆవల మంచి గుర్తింపు ఉన్న టాలీవుడ్‌ స్టార్లలో టాప్‌ ఎవరంటే.. ప్రభాస్‌ పేరు ప్రముఖంగా వినిపించేది! బాహుబలితో ప్రభాస్‌ కు ఇలాంటి గుర్తింపు దక్కింది. తెలుగుకు మించి ప్రభాస్‌ సినిమాల పట్ల హిందీ బెల్ట్‌ లో విపరీతమైన ఆదరణ కనిపించింది. సాహో వంటి సినిమా తెలుగు లో తిరస్కార భావం ఎదుర్కొంటే , హిందీలో మాత్రం ఆదరణకు నోచుకుంది! ఇలా ప్రభాస్‌ పట్ల నార్త్‌ లో ఆదరణ కనిపించింది. 

అయితే రాధేశ్యామ్‌ తో ప్రభాస్‌ కు గట్టి ఎదురుదెబ్బే తగిలింది. రాధేశ్యామ్‌ హిట్‌ అయి ఉంటే.. ప్రభాస్‌ ఆలిండియన్‌ స్టార్‌ హీరోగా తిరుగులేని స్థితికి చేరుకునేవాడు. ఆ సినిమా ఆకట్టుకోలేకపోవడం, మరోవైపు ఆదిపురుష్‌ ఔట్‌ పట్ల అనేక సందేహాలు నెలకొని ఉండటం కూడా ప్రభాస్‌ కు ఇబ్బందికరంగా మారింది. అయితే చేతిలో ఉన్న సినిమాలు ప్రభాస్‌ తదుపరి స్థాయిని నిర్ణయించబోతున్నాయి. ఇవేమీ అల్లాటప్పా ప్రాజెక్టులు కావు కాబట్టి.. ప్రభాస్‌ బౌన్స్‌ బ్యాక్‌ భారీ ఎత్తున ఉండవచ్చనే అంచనాలు లేకపోలేదు.

ఆ సంగతెలా ఉన్నా… ప్రభాస్‌ కాస్త వెనక్కు తగ్గినట్టుగా అగుపిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రభాస్‌ కు పోటీ ఇచ్చేలా దూసుకువస్తున్నాడు అల్లు అర్జున్‌. వాస్తవానికి ప్రభాస్‌, రామ్‌ చరణ్‌, మహేశ్‌, ఎన్టీఆర్‌.. వీళ్లందరి కన్నా ముందుగా పక్క రాష్ట్రంలో తనకంటూ ఉనికిని చాటుకున్నది అల్లు అర్జునే. 

మలయాళంలో తనకంటూ ఒక మార్కెట్‌ ను సృష్టించుకున్నాడు. అది అలా ముందుగా అల్లు అర్జున్‌ కు కలిసి వచ్చింది. అది అలాగే స్టడీగా కొనసాగుతూ ఉంది. ఇక ఇటీవలి సినిమాలతో అల్లు అర్జున్‌ తెలుగు వాళ్ల కన్నా పక్క రాష్ట్రాల వారినే బాగా ఆకట్టుకున్నాడు. ప్రభాస్‌ తర్వాత అటు నార్త్‌ లో అయినా, కర్ణాటక తమిళనాడుల్లో అయినా అల్లు అర్జున్‌ కే ఇప్పుడు మంచి గుర్తింపు దక్కుతోంది. తెలుగు హీరోల్లో పక్క రాష్ట్రాల వారి చేత, వేరే భాషల వాళ్ల చేత టక్కున గుర్తింపు బడుతున్నది అల్లు అర్జున్‌ ఇప్పుడు!

ఇక రెమ్యూనిరేషన్‌ కూడా ఇదే విషయాన్ని చెబుతున్నట్టుగా ఉంది. టాలీవుడ్‌ హీరోల్లో భారీ రెమ్యూనిరేషన్‌ ను అందుకుంటున్న వారిలో ప్రభాస్‌ పేరు మొన్నటి వరకూ నిలిచింది. ప్రభాస్‌ తన సినిమాల్లో ఒక్కోదానికి వంద కోట్ల రూపాయల రెమ్యూనిరేషన్‌ ను అందుకుంటున్నాడనే టాక్‌ ఉంది. ఇది అధికారికం కాకపోయినా.. అనధికారికంగా ప్రభాస్‌ రెమ్యూనిరేషన్‌ వంద కోట్ల రూపాయలంటారు. ఇలాంటి టాక్‌ ట్రేడ్‌ లోనూ, అభిమానుల్లోనూ ఉంది. ఇప్పుడు ఈ మార్కును అల్లు అర్జున్‌ అధిగమించినట్టుగా కూడా ఇలాంటి టాకే వస్తోంది.

సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా టీ సీరిస్‌ వారు ఒక సినిమాను ప్రకటించారు. ఇందుకు సంబంధించి లాంఛనం జరిగింది. మరి ఈ సినిమాకు అల్లు అర్జున్‌ అందుకునే రెమ్యూనిరేషన్‌ ఏకంగా 125 కోట్ల రూపాయలు అని టాక్‌! దర్శకుడిగా సందీప్‌ రెడ్డితో టీ సీరిస్‌ కు ఇది వరసగా నాలుగో సినిమా అనుకోవాలి. అర్జున్‌ రెడ్డి హిందీ రీమేక్‌ కబీర్‌ సింగ్‌ కు టీ సీరిస్‌ వాళ్లు సహనిర్మాతలుగా వహించారు. 

ఆ తర్వాత అనిమల్‌ అనే సినిమాను అనౌన్స్‌ చేశారు. రణ్‌ బీర్‌ కపూర్‌ హీరోగా సందీప్‌ దర్శకత్వంలో ఆ సినిమా రూపొందుతోంది. అలాగే స్పిరిట్‌ అంటూ ఇంకో పెద్ద సినిమా ఈ దర్శకుడు, నిర్మాత కాంబినేషన్లోనే రూపొందోందనే ప్రకటన ఉంది. అదలా ఉండగానే.. ఇప్పుడు అల్లు అర్జున్‌ సినిమాను కూడా టీ సీరిస్‌ వాళ్లు ప్రొడ్యూస్‌ చేస్తున్నారు. ఇలా వరసగా ఆ దర్శకుడితో టీ సీరిస్‌ సినిమాలు అనౌన్స్‌ చేస్తోంది.

అల్లు అర్జున్‌ తో సినిమాకు గానూ టీ సీరిస్‌ ఏకంగా 125 కోట్ల రూపాయల రెమ్యూనిరేషన్‌ ఇస్తోందని టాక్‌. ఇలా ప్రభాస్‌ వంద కోట్ల రూపాయల స్థాయిని అల్లు అర్జున్‌ 125 కోట్ల రూపాయల స్థాయితో అధిగమిస్తున్నాడనేది ఇండస్ట్రీ టాక్‌. అంతే కాదు..ఈ రెమ్యూనిరేషన్‌ తో టాలీవుడ్‌ హీరోల్లో కెళ్లా అతి భారీ పారితోషికాన్ని అల్లు అర్జున్‌ పొందుతున్నాడనుకోవాలేమో!

మరి ఇది తెలుగు హీరోలకు భారీ స్థాయికి ఆరంభం మాత్రమేనేమో! తెలుగు రాష్ట్రాల్లో వీరికి భారీ మార్కెట్‌ ఉండటం, ఆ పై పక్క భాషల్లో కూడా వీరి సినిమాల విడుదలలకు బ్రహ్మాండమైన క్రేజ్‌, అలాగే హిందీ బెల్ట్‌ థియేటర్లలో వీరి సినిమాలకు స్టడీ కలెక్షన్లు వచ్చే పరిస్థితి కనిపిస్తే వీరి మార్కెట్‌ రేంజ్‌ భారీ గా నమోదవుతుంది. దానికి అనుగుణంగా వీరి రెమ్యూనిరేషన్లు కూడా అతి భారీ స్థాయిలో నమోదు కావడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఈ క్రేజ్‌ లు ఒకటీ రెండు సినిమాలకు పరిమితం కాకుండా.. వీటిని స్టడీగా కొనసాగించడం మాత్రం వీరి సినిమాల జయాపజయాల మీదే ఆధారపడి ఉంటుంది.

-హిమ