ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ కింజరాపు అచ్చెన్నాయుడు అద్భుతమైన జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో నూటికి రెండు వందల శాతం టీడీపీ విజయం సాధించడం ఖాయమని ఢంకా భజాయించారు. చంద్రబాబుని సీఎం కానీయకుండా ఎవరూ అడ్డుకోలేరని కూడా అచ్చెన్న శపధం చేశారు.
ఏపీలో టీడీపీని గెలిపించుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పారు. అస్తవ్యస్తమైన ఏపీని గాడిన పెట్టగల సామర్ధ్యాలు, శక్తియుక్తులు ఒక్క చంద్రబాబుకే ఉన్నాయని ఆయన అంటున్నారు. ఈ విషయంలో జనాలు కూడా రెండవ మాటకు తావు లేకుండా టీడీపీకే పట్టం కడతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
జగన్ వివిధ వర్గాలకు హామీలన్నీ ఇచ్చి నీట ముంచారని, చంద్రబాబు అయితే ఉద్యోగ కార్మిక వర్గాలకు ఎంతో మేలు చేశారని ఆయన చెప్పారు. ఎంతో చేసిన చంద్రబాబుని ఓడించి ఒక్క చాన్స్ అంటూ వచ్చిన జగన్ని జనాలు ఎన్నుకున్నారని ప్రజల మీద కూడా అచ్చెన్న అక్కసు వెళ్లగక్కారు.
మొత్తానికి అచ్చెన్న చెప్పేది ఏంటి అంటే ఆరు నూరు అయినా ష్యూర్ గా బాబు సీఎం కావడం గ్యారంటీ అని. ఇవన్నీ సరే కానీ ఆ మధ్యన తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల వేళ పార్టీ లేదు మరేదో లేదని చెప్పిన అచ్చెన్నేనా ఇలా చెబుతున్నదీ అని ఎవరైనా అనుకుంటే తప్పు విన్న వారి చెవులదే తప్ప ఆయనది కానే కాదని సెటైర్లు పడుతున్నాయి.
ఇక అచ్చెన్న చంద్రబాబు సామర్ధ్యం టీడీపీ ఆవశ్యకత గురించి హఠాత్తుగా చెప్పడం వెనక ఏపీలో మారుతున్న జోరుగా రాజకీయ పరిణామాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఏపీలో కొత్త పార్టీ అంటూ న్యూస్ తెగ హల్ చల్ అవుతోంది. దాంతోనే ఎవరొచ్చినా మా బాబే సీఎం అని ఆయన క్లారిటీగా చెప్పేశారు అని అంటున్నారు. మొత్తానికి ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తుందో రాదో కానీ అచ్చెన్న జోస్యం మాత్రం ఇయర్ ఎండింగ్ వేళ టీడీపీ తమ్ముళ్లకు శ్రవణానందంగా ఉంటుందనడంలో డౌటే లేదు.