ఎమ్బీయస్‍: సినిమాల్లో ప్రభుత్వజోక్యం ఏ మేరకు?

సినిమా పరిశ్రమ తరలి వస్తే వేలాది కుటుంబాలకు ఉపాధి దొరుకుందంటూ సినీ పెద్దలకు స్టూడియో కట్టుకోవడానికి ఉచితంగానో, తక్కువ రేటుకో స్థలం యిచ్చేది ప్రభుత్వమే – అభ్యంతరం లేదు! Advertisement దాన్ని రిజిస్టర్ చేసేటప్పుడు…

సినిమా పరిశ్రమ తరలి వస్తే వేలాది కుటుంబాలకు ఉపాధి దొరుకుందంటూ సినీ పెద్దలకు స్టూడియో కట్టుకోవడానికి ఉచితంగానో, తక్కువ రేటుకో స్థలం యిచ్చేది ప్రభుత్వమే – అభ్యంతరం లేదు!

దాన్ని రిజిస్టర్ చేసేటప్పుడు స్టాంప్ డ్యూటీ తగ్గించాలని అడిగితే సరేననేదీ ప్రభుత్వమే – అభ్యంతరం లేదు!

కొన్నాళ్లకు స్టూడియో కట్టడం కుదరలేదు, సినిమా హాలు కడతాం, షాపింగు కాంప్లెక్స్ పెడతాం, మార్పిడికి అనుమతి యివ్వండి అంటే యిచ్చేదీ ప్రభుత్వమే – అభ్యంతరం లేదు!

సినిమాలో రోజూ పని దొరికేది చాలా కొద్దిమందికే, నాలుగు రాళ్లు వెనకేసుకుని యిళ్లు కట్టుకునేది కొందరికే సాధ్యం. అందువలన సినీ కళాకారులకు, సాంకేతిక నిపుణులకు యిళ్లు కట్టుకోవడానికి స్థలాలు యివ్వాలని అడిగితే యిచ్చేదీ ప్రభుత్వమే – అభ్యంతరం లేదు!

మీరు ప్రత్యేకంగా సబ్సిడీ యిస్తేనే మీ రాష్ట్రంలో షూటింగు జరుపుతాం అంటే సరే, సబ్సిడీ యిస్తాం అనేదీ ప్రభుత్వమే – అభ్యంతరం లేదు!

ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ అని పెట్టి సినిమాలకు ఆర్థికసాయం అందించండి అంటే సరేనని యిచ్చేదీ ప్రభుత్వమే – అభ్యంతరం లేదు!

మంచి సినిమాలను ప్రోత్సహించడానికి ఏటేటా లక్షలాది రూపాయల అవార్డులు యిచ్చేదీ ప్రభుత్వమే – అభ్యంతరం లేదు!

సినిమా షూటింగు సమయాల్లో, సినిమా రిలీజు సమయంలో, విజయోత్సవసభల సందర్భంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసేది ప్రభుత్వమే – అభ్యంతరం లేదు!

టూరిస్టు స్పాట్‌లలో సందర్శకులను ఆపేసి, సినిమా షూటింగు చేసుకోవడానికి అనుమతి యిచ్చేది ప్రభుత్వమే – అభ్యంతరం లేదు!

తెరపై వందలాది సైనికులను చూపించాలంటే మిలటరీ వాళ్లనో, పోలీసులనో వాడుకోవడానికి అనుమతి యిచ్చేది ప్రభుత్వమే – అభ్యంతరం లేదు!

థియేటర్ల క్వాలిటీ ఎలా ఏడ్చినా సినిమా టిక్కెట్లు పెంచేది ప్రభుత్వమే – అభ్యంతరం లేదు!

సినిమా టిక్కెట్లు తగ్గించాలని నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది – అభ్యంతరం వుంది!

మా ప్రోడక్టు, అమ్మడానికి మేం రెడీ, కొనడానికి ప్రేక్షకుడు రెడీ, మధ్యలో ప్రభుత్వం ఎవరు ధర నిర్ణయించడానికి?

ప్రభుత్వమే కాదు, ఎవరూ మా పనితీరుని విమర్శించడానికి లేదు.

మేం లోకంలో అన్ని వర్గాలను, అన్ని వృత్తుల వాళ్లను చీల్చి చెండాడుతాం. కనబడిన ప్రతీదాన్నీ విమర్శిస్తాం. కానీ మా సినిమాలను మాత్రం ఎవరూ విమర్శించకూడదు. ఎవరూ అడక్కపోయినా కోట్లు ఖర్చుపెట్టి భారీగా సినిమా తీశాం. ఈ సినిమా నభూతో నభవిష్యతి అనే పబ్లిసిటీతో ప్రేక్షకులను ఊదరగొట్టి, చూడకపోతే నీ జీవితం వేస్టని మభ్యపెట్టి, థియేటర్లకు రప్పించి, మొదటి రెండు వారాల్లో నాలుగు రెట్లు టిక్కెట్టు ధర పెంచి మా పెట్టుబడి రాబట్టుకుందామని చూస్తున్నాం. మధ్యలో ప్రేక్షకుల ప్రతినిథి నంటూ ఓ సమీక్షకుడు వచ్చి అబ్బే అంత బాలే అంటాడా? కెమెరాలో ఎన్ని స్క్రూలు వుంటాయో వాడికి తెలుసా? విమర్శకుడంటే ఎలా వుండాలి? మా డబ్బు మాకు లాభాలతో సహా వెనక్కి వచ్చేట్లు చూడాలనే పాజిటివ్ దృక్పథంతో వుండాలి.

అసలు సినిమాలకు సెన్సారింగ్ ఎందుకు? మాకు మేము సెల్ఫ్-సెన్సారింగ్ చేసుకోలేమా? ద్వంద్వార్థాలతో రాయిస్తే నేరమా? ఒక్క మాటకు రెండేసి అర్థాలు కనిపెట్టిన సమాజానిది తప్పు. అశ్లీలమా!? మాకేమీ కనబడటం లేదే! అది మీ చూపులో వుంది. మీ బుర్ర పుచ్చిపోయింది కాబట్టి ఆ నగ్నత్వం, ఆ భంగిమలు అసభ్యంగా వున్నాయనుకుంటున్నారు. చూపించడానికి మా నటీమణులు రెడీగా వున్నారు, చూడ్డానికి ప్రేక్షకులు ఉవ్విళ్లూరుతున్నారు. మధ్యలో మీరెవరు చెయ్యి అడ్డుపెట్టడానికి? ఇది భావప్రకటనాస్వేచ్ఛకు, సౌందర్యప్రదర్శనాస్వేచ్ఛకు అడ్డు తగిలినట్లు కాదా?

మా యిండస్ట్రీలోనే చిన్న స్థాయి నటీనటులున్నారు, సాంకేతిక నిపుణులున్నారు. వాళ్ల సినిమాలకు థియేటర్లు దొరక్కుండా చేస్తాం. మేమంతా పెట్టుబడి పెట్టిన పెద్ద సినిమా రిలీజుకు నెల్లాళ్ల ముందే సినిమాలు లేకుండా ఎండగడతాం. మా రెండు వారాల దోపిడీ అయ్యాక థియేటర్లు ఖాళీగా వున్నా మాకు అనవసరం. ఓ పక్క రిలీజు కాకుండా సినిమాలు బిక్కుబిక్కు మంటూన్నా, మరో పక్క థియేటర్లు బావురుమంటూన్నా మాకు పట్టదు. మా పెద్ద సినిమాలు, మా పెద్ద హీరోలు పచ్చగా వుంటే చాలు. చేసిన పనికి పారితోషికాలు దక్కక, సినిమా విడుదలైతే తమ పేరు తెరపై చూసుకోవచ్చనుకునే తృప్తి సైతం దొరక్క వేలాది మంది బాధపడుతున్నా మాకు పట్టదు. అది మా కుటుంబ వ్యవహారం. బయటివాళ్లు వచ్చి వ్యాఖ్యానిస్తే, చిన్నవాళ్ల తరఫున వకాల్తా తీసుకుంటే ఒప్పుకోం.

నల్లధనం పోగేసేవాడు పాపి అని నొక్కి వక్కాణిస్తాం. అందుకే మేం పోగేయకుండా మా హీరోలకు యిచ్చేస్తాం. పబ్లిసిటీకోసం ఒక అంకె చెప్తాం, ఇన్‌కమ్‌టాక్స్ గురించి యింకో అంకె చెప్తాం, వినోదపు పన్ను కట్టాల్సి వస్తే మరో అంకె చెప్తాం. ఈ అంకెల గారడీపై ఎవరూ ప్రశ్నించకూడదు. కులమత, ప్రాంత, భాషాభేదాలుండకూడదని మా సినిమాల్లో ముఖ్యపాత్రల ద్వారా ప్రవచిస్తాం. ఆ భేదాలున్నవాణ్ని విలన్‌గా చూపిస్తాం. మా సంస్థలకు వచ్చేసరికి ప్రాంతాల వారీగా విడివిడి సంస్థలు పెట్టుకుంటాం. పరభాషీయుడికి యిక్కడేం పని అంటాం. కులాల వారీ చీలుస్తాం, ఆధిపత్యం ప్రదర్శించుకుంటాం. వీటిని ఎవడైనా ఎత్తి చూపిస్తే మా సినీమోతుబర్లం ఊరుకోం. మా మాట వినే పెద్ద హీరోల అభిమానుల ద్వారా మిమ్మల్ని వెంటాడతాం, వేధిస్తాం, విసిగిస్తాం. మేమింతే!

ఇదీ తెలుగు సినీరంగం తీరు!

– ఎమ్బీయస్ ప్రసాద్ (డిసెంబరు 2021)