బీజేపీకి త‌ల‌నొప్పిగా మారిన వ‌రుణ్‌

భార‌తీయ జ‌న‌తా పార్టీకి సొంత ఎంపీ త‌ల‌నొప్పిగా మారారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల ముంగిట బీజేపీ ఎంపీ వ‌రుణ్‌గాంధీ వ్య‌వ‌హారం రోజురోజుకూ అస‌హ‌నం క‌లిగిస్తోంది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ నుంచే ప్రాతినిథ్యం వ‌హిస్తున్న వ‌రుణ్‌గాంధీ… త‌న పార్టీనే టార్గెట్…

భార‌తీయ జ‌న‌తా పార్టీకి సొంత ఎంపీ త‌ల‌నొప్పిగా మారారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల ముంగిట బీజేపీ ఎంపీ వ‌రుణ్‌గాంధీ వ్య‌వ‌హారం రోజురోజుకూ అస‌హ‌నం క‌లిగిస్తోంది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ నుంచే ప్రాతినిథ్యం వ‌హిస్తున్న వ‌రుణ్‌గాంధీ… త‌న పార్టీనే టార్గెట్ చేస్తూ సోష‌ల్ మీడియా వేదిక‌గా తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తుండ‌డం దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది. ఒక‌వైపు సూక్తులు చెబుతూ, మ‌రోవైపు ఆచ‌రించ‌ని బీజేపీని వ‌రుణ్ దెప్పి పొడుస్తున్నారు. సాగు చ‌ట్టాల‌కు మ‌ద్ద‌తుగా మోడీ స‌ర్కార్‌ను వ‌రుణ్ గ‌ట్టిగా నిల‌దీసిన సంగ‌తి తెలిసిందే.

తాజాగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఎన్నిక‌ల నేప‌థ్యంలో బీజేపీ ద్వంద్వ విధానాల‌ను వ‌రుణ్‌గాంధీ తూర్పార‌ప‌డుతూ ట్వీట్ చేయ‌డం స‌ర్వ‌త్రా హాట్ టాపిక్‌గా నిలిచింది. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ఆ ట్వీట్ ఏంటో తెలుసుకుందాం.

‘రాత్రిపూట కర్ఫ్యూ విధించడం, పగలేమో ర్యాలీలకు లక్షల మందిని పిలవడం.. సామాన్య ప్రజలకు ఎంతకీ అంతుపట్ట‌డం లేదు. ఉత్తరప్రదేశ్‌లోని ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మనమంతా దృష్టిలో ఉంచుకోవాలి. ఒమిక్రాన్‌ వ్యాప్తిని అడ్డుకోవడమా? లేదా ఎన్నికల ప్రచార శక్తిని ప్రదర్శించడమా.. ఈ రెండింటో దేనికి ప్రాధాన్యం ఇవ్వాలనేది నిజాయతీగా నిర్ణయించుకోవాలి’ అని వరుణ్‌ గాంధీ ట్విటర్‌లో రాసుకొచ్చారు.

మ‌రికొద్ది నెల‌ల్లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఎన్నిక‌ల‌ను బీజేపీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. ఇప్ప‌టికే ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌ధాని మోడీ ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని కూడా ప్రారంభించారు. మ‌రోవైపు ప్ర‌పంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ వ్యాప్తి భ‌య‌పెడుతోంది. దీంతో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఒమిక్రాన్‌ను క‌ట్ట‌డి చేసేందుకు యోగి స‌ర్కార్ ఈ నెల 25 నుంచి రాత్రి క‌ర్ఫ్యూ విధించింది. ప‌గ‌లు మాత్రం య‌థాత‌థంగా బీజేపీ ఎన్నిక‌ల ర్యాలీలు నిర్వ‌హించ‌డాన్ని ట్విట‌ర్ వేదిక‌గా వ‌రుణ్‌గాంధీ ప్ర‌శ్నించ‌డం ప్ర‌తిప‌క్షాలు ఆయుధం ఇచ్చిన‌ట్టైంది.