సురేష్ ప్రొడక్షన్స్ అంటే ప్రేక్షకుల్లో ఒక నమ్మకం, గౌరవం. నాకు గుర్తుండి మొదట చూసింది ప్రేమ్‌నగర్. మా చిన్నప్పుడు ఎక్కడ చూసినా అవే పాటలు. ఆ సినిమాలో కూడా రెండు వ్యాంప్ పాటలున్నాయి. అయితే మరీ హద్దు మీరి వుండవు. తర్వాత రాముడు-భీముడు చూశాను (సెకెండ్ రన్). అదో క్లాసిక్. జీవన తరంగాలు చాలా ఎమోషనల్ మూవీ. ఇప్పటికీ ఎవరైనా చనిపోతే ఈ జీవన తరంగాలలో పాట గుర్తొస్తుంది. తర్వాత సినిమా పేరు కాకుండా నిర్మాతగా రామానాయుడు పేరు వుంటే చాలు చూశాను. నేనే కాదు, నా తరం ప్రేక్షకులు ఎందరో సురేష్, జగపతి బ్యానర్లు చూసి సినిమాకి వెళ్లేవాళ్లు.
రామానాయుడు తీసిన వాటిలో క్లాసిక్స్ వున్నాయి. ఎమోషనల్ లవ్ స్టోరీస్ ఉన్నాయి. చెత్త సినిమాలు కూడా వున్నాయి. అయితే కక్ష (1980) లాంటి సుత్తి సినిమా కూడా ఫ్యామిలీతో వెళ్లడానికి ఇబ్బంది పడే సినిమా కాదు. శృంగారం, శృంగార నృత్యాలు వున్నా సురేష్ ప్రొడక్షన్స్ సినిమాలు ఎన్నడూ అశ్లీలపు హద్దు దాటలేదు. సెక్స్ సీన్స్, డబుల్ మీనింగ్ డైలాగ్‌లతో డబ్బులు సంపాయించాలని అనుకోలేదు.
ఇక వెంకటేష్ విషయానికి వస్తే శోభన్‌బాబు తర్వాత ఫ్యామిలీ క్రేజ్ వున్న హీరో. యాక్షన్ సినిమాల్లో నటించినా మాస్ హీరోగా పెద్ద గుర్తింపు రాలేదు. అయితే లవ్, ఎమోషనల్, కుటుంబ బంధాలకి బ్రాండ్ ఎంబాసిడర్. ఈ మధ్య వచ్చిన ఎఫ్2, ఎఫ్3లు కూడా ప్రేక్షకులు ఆదరించారంటే అది ఆయన గుడ్‌విల్. మహిళా ప్రేక్షకుల్ని ఇప్పటికీ థియేటర్‌కి రప్పించే సత్తా ఉన్న హీరో. సున్నితమైన హాస్యాన్ని పండించే తక్కువ మంది హీరోల్లో ఆయన ఒకడు.
ఇంత ఇంట్రో ఎందుకంటే ఘనమైన చరిత్ర వున్న వెంకటేష్, ఆయన అన్న కుమారుడు రానా కలిసి ఒక వెబ్ సిరీస్ చేశారు. దాని పేరు రానానాయుడు. నెట్‌ప్లిక్స్‌లో వుంది. వెంకటేష్ ఉన్నాడు కదా అని ఆసక్తిగా స్టార్ట్ చేశా. మొదటి సీన్‌తో షాక్ తిన్నా. అలాంటి సీన్స్ ఇంగ్లీస్ వెబ్ సీరిస్ , హిందీలో వుండవని కాదు. కానీ వెంకటేష్ అంటే ఫ్యామిలీస్‌లో ఒక గౌరవం వుంది. ఇంటిల్లిపాది టీవీలో చూడడం స్టార్ట్ చేస్తే వాళ్ల గతి ఏంది? వెబ్ సిరీస్ కంటెంట్ ఎదిగి ఉండొచ్చు (జుగుప్స సన్నివేశాలు, బూతులు మాట్లాడ్డం ఎదుగుదల అనుకుంటే). కానీ పిల్లల్ని పక్కన కూచోపెట్టుకుని బూతు దృశ్యాలు చూసే స్థాయికి మనం ఎదగలేదు కదా!
వెంకటేష్‌కి ఆ సీన్స్‌తో ఏమీ సంబంధం లేకపోవచ్చు. కానీ అలాంటి సీన్స్ వున్నాయని ఆయనకి తెలియకపోయినా రానాకి తెలియదా? తెలుగు ప్రేక్షకులంతా వెంకటేష్ కోసం చూస్తారని తెలుసు కదా! ఇన్నాళ్లు డీసెంట్ యాక్టర్‌గా పేరున్న వెంకటేష్‌కి ఈ వయసులో ఇలా పరువు పోగొట్టుకోవడం అవసరమా?
తండ్రి పేరు వెంకటేష్, తాత పేరు రానా. ఏకకాలంలో చెడగొట్టాలనే ఉన్నతాశయంతోనే ఈ వెబ్ సిరీస్‌లో నటించినట్టున్నారు. (మొదటి 15 నిమిషాల తర్వాత ఆఫ్ చేయడం వల్ల ఈ సీరిస్ మొత్తం ఎలా వుందో నాకు తెలియదు)
జీఆర్ మహర్షి