మార్చి 8, 2014
ప్రపంచ విమానయాన చరిత్రలోనే ఒక మిస్టరీ జరిగింది. మలేసియా ఎయిర్‌లైన్స్ విమానం (MH 370) ఆకాశంలోనే మాయమైంది. ఇప్పటి వరకూ శకలాలు కూడా దొరకలేదు. 9 ఏళ్లు గడిచిపోయాయి. విమానంలో సిబ్బందితో సహా 239 మంది వున్నారు. వాళ్ల బంధువులు ఇంకా ఎదురు చూస్తూనే వున్నారు.
మార్చి 8 రాత్రి 12.41 గంటలు. కౌలాలంపూర్ నుంచి విమానం టేకాఫ్. తెల్లారి 6 గంటలకి బీజింగ్ చేరాలి. ఒంటిగంట తర్వాత విమానం మలేసియా గగనతలం దాటింది. హఠాత్తుగా రేడార్ నుంచి మాయమైంది.
రాత్రి 3 గంటలు. మలేసియా ఎయిర్‌లైన్స్ ఉన్నతాధికారులు సమావేశం అయ్యారు. థాయిలాండ్, వియత్నాం, చైనా , హాంకాంగ్‌లకి విషయం చెప్పి సాయం అడిగారు. ఎక్కడా ఆనవాలు దొరకలేదు.
ఉదయం 6.30 గంటలు. బంధువులని రిసీవ్ చేసుకోడానికి బీజింగ్ ఎయిర్‌పోర్ట్‌లో వందల మంది ఎదురు చూస్తున్నారు. విమానం ఆలస్యమైందని అనుకున్నారు. ఉదయం 7 గంటలకి ప్రపంచంలోని అన్ని న్యూస్ చానల్స్ బ్రేకింగ్ ఇచ్చాయి. మలేసియా విమానం మాయం. ఏడుపు, ఆర్తనాదాలతో ఎయిర్‌పోర్ట్ నిండిపోయింది.
వియత్నాం, థాయ్‌లాండ్, చైనా , మలేసియా నుంచి షిప్స్, చిన్న విమానాలు దక్షిణ చైనా సముద్రాన్ని గాలించాయి. ఎక్కడా శిథిలాలు లేవు. విమానం ఒకవేళ కూలిపోతే కనీసం 15 కిలో మీటర్లు శకలాలు పడతాయి. సముద్రంలో భారీగా ఆయిల్ తేలుతుంది. చిన్న క్లూ కూడా దొరకలేదు.
రెండు రోజుల తర్వాత కొత్త విషయం బయటికొచ్చింది. బీజింగ్ వెళ్లాల్సిన విమానం హఠాత్తుగా దారి మార్చుకుని వెనక్కి అంటే మలేసియా మీదుగా మలక్కా జలాల వైపు ప్రయాణం చేసింది. ఈ విషయాన్ని మలేసియా మిలటరీ రేడార్ గుర్తించింది. విమానంలోని సిగ్నల్ వ్యవస్థ పని చేయకపోయినా గుర్తించే సామర్థ్యం మిలటరీ రేడార్‌కి వుంటుంది. అయితే ముందుకు వెళ్లాల్సిన విమానం వెనక్కి ఎందుకొచ్చింది? ఏమైంది? ఇరువైపులా వెతుకులాట ప్రారంభం.
ప్రపంచంలోని ఏవియేషన్ నిపుణులు, జర్నలిస్టులు రంగంలోకి దిగారు. ఇది కుట్ర అని అనుమానించారు. అయితే ఎవరు చేశారు?
కుట్ర 1-
కెప్టెన్ జహరి అహ్మద్‌షా, విమాన ఫైలెట్. ఆయన సూసైడ్ చేసుకోవాలని అనుకుని మాస్ మర్డర్‌కి పాల్పడ్డాడు. కో ఫైలెట్‌ను కాక్‌పిట్‌లోంచి బయటికి పంపి లాక్ చేసుకున్నాడు. కమ్యూనికేషన్ సిస్టమ్ ఆఫ్ చేశాడు. దాంతో రేడార్ నుంచి విమానం మాయమైంది. విమానంలో ఆక్సిజన్ ఫ్రెషర్ తగ్గించాడు. ఆక్సిజన్ మాస్కులు వేలాడే సరికి ప్రయాణికులు భయపడ్డారు. 15 నిమిషాల తర్వాత అందరూ చనిపోయారు. విమానం వెనక్కి మళ్లించి ఇంధనం అయిపోయే వరకూ మలక్కా జలసంధి వరకూ ప్రయాణించి హిందూ మహాసముద్రంలో విమానాన్ని కూల్చేశాడు.
పత్రికలు రాసిన ఈ కథనంతో అధికారులు జహరీ ఇల్లు సీజ్ చేశారు. కుటుంబ నేపథ్యం విచారించారు. భార్యాపిల్లలతో హాయిగా ఉన్న అతనికి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఎలాంటి నేర చరిత్రా లేదు. దాంతో ఈ అనుమానం వీగిపోయింది.
కుట్ర 2-
విమానంలో ఫస్ట్ క్లాస్‌కి, ఎకానమికి మధ్య ఒక తివాచీ వుంటుంది. దాని కింద ఎలక్ట్రానిక్ బే వుంటుంది. టెక్నాలజీ మీద అవగాహన వున్న వాళ్లు ఎవరైనా అందులోకి దిగి విమానం ఎలక్ట్రానిక్ వ్యవస్థని స్వాధీనం చేసుకోవచ్చు.
ఆ రోజు ముగ్గురు రష్యన్లు విమానంలో వున్నారు. వాళ్లు ఈ రకంగా విమానాన్ని స్వాధీనం చేసుకుని వెనక్కి తిప్పి కూల్చేశారు. వాళ్లకి ఏంటి అవసరం?
అంతకు కొద్ది రోజుల ముందు క్రిమియాపై రష్యా దాడి చేసింది. ప్రపంచం అంతా దీనిపై నిరసిస్తున్నప్పుడు దృష్టి మళ్లించడానికి ఈ పని చేశారు. దీన్ని నిపుణులు ఎవరూ నమ్మలేదు. ఎలక్ట్రానిక్ బే నుంచి విమానాన్ని కంట్రోల్ చేయడం అసాధ్యమన్నారు. అయితే మామూలు మనుషులకి తెలియని కొత్త విషయం చెప్పారు. ఎలక్ట్రానిక్ బేలోకి ఎవరైనా రహస్యంగా వెళ్లగలిగితే విమాన సాంకేతిక వ్యవస్థని ఆఫ్ చేయవచ్చు.
కుట్ర 3-
గిస్లెయిన్ ఫ్రెంచి దేశస్తుడు. ఈ ప్రమాదంలో భార్యా, ఇద్దరు పిల్లల్ని పోగొట్టుకున్నాడు. ఇతనొక రోజు టీవీల ముందుకొచ్చి మలేసియాకి, వియత్నాంకి మధ్య ఎవరికీ చెందని గగనతలంలో విమానం ప్రయాణిస్తున్నప్పుడు రెండు ఎవాక్స్ అమెరికా విమానాలు పరిసరాల్లో వున్నాయని, విమానం ఏమైందో అమెరికాకి తెలుసని చెప్పాడు.
ఎవాక్స్ విమానాలను మిలటరీలో వాడతారు. అత్యంత సాంకేతిక వ్యవస్థ వుంటుంది. వీటి ద్వారా బోయింగ్ విమానాల సాంకేతిక సామర్థ్యాన్ని కంట్రోల్ చేయవచ్చు.
అయితే అతని మాటలని అమెరికా పట్టించుకోలేదు. రకరకాల ఊహాగానాలు నడుస్తూ వుండగా ప్రపంచమంతా ఉలిక్కి పడే సంఘటన నాలుగు నెలల తర్వాత జూలై 17 జరిగింది. మలేసియాకే చెందిన విమానం అమ్‌స్టర్ డ్యామ్ నుంచి కౌలాలంపూర్‌కి బయల్దేరింది. ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యన్ తిరుగుబాటుదార్లు కూల్చి వేశారు. 298 మంది చనిపోయారు. అయితే విమాన శకలాలు, మృతదేహాలు దొరికాయి. మొదటి విమానం కూడా ఇలాగే కూల్చేశారా? అందరిలో అనుమానం. అదే నిజమైతే శకలాలు ఎక్కడ?
16 నెలల తర్వాత హిందూ మహాసముద్రంలోని లా రీయూనియన్ దీవిలో విమానానికి సంబంధించిన రెక్క భాగం దొరికింది. అయితే అది ఒరిజినల్ కాదని అందరి అనుమానం. దాని మీదున్న నంబర్లు మ్యాచ్ కాలేదు. ఇలా వుంటే బ్లెయిన్ అనే అడ్వెంచర్ ట్రావెలర్ శిథిలాలు వెతకడానికి వెళ్లాడు. మొజాంబిక్‌లోని విలాంకుల్ టౌన్‌లో అతనికి శకలాలు దొరికాయి. ఒకే రోజు అవి దొరకడం, అతని వెంట రిపోర్టర్లు వుండడంతో అనుమానం. అతన్ని రష్యన్ గూడాచారి అన్నారు.
ఒక రచయిత్రి కొత్త విషయం చెప్పింది. మార్చి 8 ఆ విమానంలో రెండున్నర టన్నుల లిథియం బ్యాటరీలు, వాకీటాకీ విడి భాగాలు, చార్జర్లు కార్గోలో రవాణా అయ్యాయి. ఇవి లోడ్ చేసేటప్పుడు హైసెక్యూరిటీ ఏర్పాటు చేశారు. విచిత్రం ఏమంటే వీటిని స్కాన్ చేయలేదు. ఎక్స్‌రే యంత్రం పని చేయలేదు. ఈ పదార్థం చైనాకి చేరకుండా వుండడానికి అమెరికా యుద్ధ విమానాలు (అవాక్స్) రంగంలోకి దిగాయి. విమానాన్ని కూల్చేశాయి. ఈ వాదనలో ఒక చిన్న నిజం వుంది. ఆ సమయంలో దక్షిణ చైనా సముద్రంలో అమెరికా యుద్ధ విన్యాసాలు జరుగుతున్నాయి.
9 ఏళ్ల తర్వాత కూడా ఈ మిస్టరీ వీడలేదు.
హజిరిన్ (ఫ్లైట్ అటెండెంట్) డ్యూటీకి వెళుతూ తన మూడేళ్ల కూతురికి ముద్దు పెట్టి వెళ్లాడు. ఆ పాపకి ఇప్పుడు 12 ఏళ్లు. ఇప్పటికీ నిద్ర లేచి నాన్న వచ్చాడా? అని అడుగుతూ వుంటుంది. కొన్ని వందల మంది ఏదైనా అద్భుతం జరిగి తమ వాళ్లు తిరిగి వస్తారేమో అని ఎదురు చూస్తున్నారు.
విమానాలు గాల్లోకి ఎగిరి, నేల మీద దిగుతాయి. కానీ గాల్లోనే మాయమైపోయిన విమానం ఇదొక్కటే. (నెట్‌ప్లిక్స్‌లో 3 ఎపిసోడ్స్ MH 370 పేరుతో డాక్యుమెంటరీ వుంది. ఆసక్తి ఉన్న వాళ్లు చూడొచ్చు)
జీఆర్ మహర్షి