ఏపీలో ‘స్థానిక’ ఎన్నికలు రెఫరెండమా?

ఏపీలో ఒక పక్క 'రాజధాని రగడ' ఉధృతంగా సాగుతూవుండగానే అధికార, ప్రతిపక్షాల నాయకులు స్థానిక సంస్థల అంటే  పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్‌ ఎన్నికల గురించి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాల ప్రభావం స్థానిక…

ఏపీలో ఒక పక్క 'రాజధాని రగడ' ఉధృతంగా సాగుతూవుండగానే అధికార, ప్రతిపక్షాల నాయకులు స్థానిక సంస్థల అంటే  పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్‌ ఎన్నికల గురించి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాల ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికలపై ఎంతవరకు ఉంటుంది? అనే విషయమై ఆలోచించడమే కాదు, గెలుపోటములపై అంచనాలు వేస్తున్నారు.

అధికార వైకాపా నాయకులు మూడు రాజధానులు నిర్ణయాన్ని పైకి సమర్థిస్తున్నప్పటికీ లోలోపల మాత్రం స్థానిక ఎన్నికల్లో ఏమవుతుందోనని ఆందోళన చెందుతున్నారు. టీడీపీ సహా ఇతర ప్రతిపక్షాలు ప్రస్తుత పరిణామాలు స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీపై ప్రతికూల ప్రభావం కనబరుస్తాయని అంచనా వేస్తున్నాయి. ఇలా ఎవరికి వారు రకరకాలుగా అంచనాలు వేసుకుంటున్నారు. 

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ఫిబ్రవరి చివరి వారంలోగాని, మార్చి మొదటి వారంలోగాని జరుగుతాయని అనుకుంటున్నారు. మొత్తంమీద మార్చి ముగిసేవరకల్లా ఎన్నికలు పూర్తవుతాయని కొందరు చెబుతున్నారు. పంచాయతీల పరిపాలనా కాలం 2018 ఆగస్టుతో పూర్తయిపోయింది. అయితే అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం రిజర్వేషన్‌ల సాకు చూపి ఎన్నికలు నిర్వహించలేదు.

దీంతో లోకల్‌ బాడీ ఎన్నికలు నిర్వహించడంలో జాప్యం చేస్తున్నారంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై విచారించిన కోర్టు సాధ్యమైనంత త్వరగా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది.కాబట్టి మార్చి నెల ముగిసేనాటికి ఎన్నికల జరగవచ్చని అనుకుంటున్నారు. ప్రభుత్వం మూడు రాజధానుల వివాదం తెర మీదికి తెచ్చింది కూడా స్థానిక సంస్థల్లో లబ్ధి పొందడానికేనని కొందరు చెబుతున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే సమయానికి  మూడు రాజధానుల సంగతి కూడా అటో ఇటో తేలిపోతుంది. కాబట్టి జగన్‌ ఆరు నెలల పరిపాలనపై ఈ ఎన్నికలు రెఫరెండంలా భావించవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఆరు నెలల్లో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ జగన్‌ ప్రభుత్వంపై ఉధృతంగా పోరాడుతోంది. ఇందులో ఇసుక కొరత, అమరావతి నుంచి రాజధాని తరలింపు వ్యవహారం ప్రధానంగా చెప్పకోవచ్చు. 

ఈ రెండు అంశాలపై ప్రతిపక్షం చేసిన పోరాటాలు స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపుతాయని, టీడీపీ పుంజుకోవడానికి ఉపయోగపడతాయని చెబుతున్నారు. ఈ ఎన్నికలు అధికార వైకాపాకు, ప్రతిపక్ష టీడీపీకి పరీక్షేనని చెప్పుకోవచ్చు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా అధికారులు మాత్రం గ్రౌండ్‌ వర్క్‌ వేగంగా చేస్తున్నట్లు సమాచారం.

లోకల్‌ బాడీస్‌ ఎలక్షన్స్‌లో గెలుపు కోసం వైకాపా ప్రధానంగా సంక్షేమ పథకాలనే నమ్ముకుంది. ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం ఎన్నికల్లోగా మరికొన్ని పథకాలను ప్రకటించే అవకాశముందని వైకాపా నాయకులు భావిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని భావిస్తున్న టీడీపీ దాన్ని క్యాష్‌ చేసుకోవచ్చని భావిస్తోంది. 

రాజధాని మార్పు అనే నిర్ణయం కేవలం అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాలకు సంబంధించింది కాదని, ఈ నిర్ణయం ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా ఉందని, కాబట్టి స్థానిక ఎన్నికల్లో వైకాపా ప్రతికూల ఫలితాలు వస్తాయని భావిస్తోంది. స్థానిక ఎన్నికల నాటికి రాజధాని వివాదం ఇంకా ఎన్ని మలుపులైనా తిరగొచ్చు. అమరావతి రైతుల ఉద్యమం రాష్ట్రమంతా వ్యాపించవచ్చని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఈ వివాదంలో కొన్ని కొత్త డిమాండ్లు తెర మీదికి రావొచ్చు. 

ఇదంతా ప్రభుత్వానికి, వైకాపాకు ఇబ్బందికరమైన పరిస్థితి సృష్టించవచ్చు. స్థానిక ఎన్నికలు మూడు దశల్లో జరుగుతాయి. మొదటి దశలో పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయి. రెండో దశలో ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు నిర్వహిస్తారు. మూడో దశలో మునిసిపాలిటీలకు ఎన్నికలు జరుపుతారు.

ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు అధికారులు చెబుతున్నారు.ప్రభుత్వ ఉత్తర్వుల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో స్థానిక ఎన్నికలు హోరాహోరీగా జరిగే అవకాశం కనబడుతోంది. ఎన్నికల్లో వైకాపా దెబ్బ తింటుందా? టీడీపీ పుంజుకుంటుందా? చూద్దాం ఏం జరుగుతుందో…!

టీడీపీ,వైసీపీ లా జాతకాలు మార్చేసిన 2019