మొత్తం మీద బాల్ హీరో బన్నీ కోర్టులోకి చేరింది. విదేశాల నుంచి వస్తున్న బన్నీ డిసైడ్ చేస్తారు అల వైకుంఠపురములో విడుదల డేట్. నిన్న దాదాపు గంటకు పైగా అల్లు అరవింద్, దిల్ రాజు, బన్నీ వాసు, హారిక వంశీ తదితరుల మధ్య జరిగిన సమావేశం ఏ నిర్ణయమూ తేల్చకుండానే ముగిసింది.
అల్లు అరవింద్ వేసిన లాజికల్ క్వశ్చన్ కు దిల్ రాజు దగ్గర సమాధానం లేకపోయింది. 'సేమ్ డే వచ్చినా, మర్నాడు వచ్చినా మా సినిమాకు ఒకే విధంగా థియేటర్లు వస్తుంటే, మర్నాడు ఎందుకు రావాలి' ఇదీ అల్లు అరవింద్ క్వశ్చను. అందుకే మహేష్ బాబు సినిమా కన్నా ఓ రోజు ముందే రావాలనుకుంటున్నామని, వస్తే వాళ్ల సినిమాను కూడా రానివ్వమని ఖరాఖండీగా చెప్పేసినట్లు తెలుస్తోంది. కానీ దీని వల్ల బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఇబ్బంది పడతారని, తాను ఓసారి బన్నీతో మాట్లాడతానని దిల్ రాజు సమావేశానికి ముగింపు పలికారు.
దాంతో ప్రస్తుతం అల వైకుంఠపురములో సినిమా డేట్ బన్నీ నిర్ణయంపై ఆధారపడి వుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రెండు సినిమాలు 11నే విడుదలయ్యే అవకాశం ఎక్కువగా వుంది.
ఇదిలా వుంటే అల వైకుంఠపురములో సినిమా ఈరోజు సెన్సారు జరుగుతోంది. ఈ సాయంత్రానికి డేట్ అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం వుంది. ఇప్పటి వరకు రెండు పెద్ద సినిమాల డేట్ ల విషయంలో అయోమయ పరిస్థితి ఏర్పడడంతో, సింగిల్ షో లు, ఫ్యాన్స్ షో లు, బెనిఫిట్ షో ల అమ్మకాలు నిలిచిపోయాయి