భాజపా పెద్దల నోళ్లకు తాళాలు!!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ప్రధాన విపక్షాలు తెలుగుదేశం జనసేన కలసికట్టుగా జగన్మోహన్ రెడ్డి పై విరుచుకు పడటంలో ఆశ్చర్యం ఏమీ లేదు.  అయితే భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా వారిని మించి సర్కారుపై…

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ప్రధాన విపక్షాలు తెలుగుదేశం జనసేన కలసికట్టుగా జగన్మోహన్ రెడ్డి పై విరుచుకు పడటంలో ఆశ్చర్యం ఏమీ లేదు.  అయితే భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా వారిని మించి సర్కారుపై విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు.

ప్రధానంగా అమరావతి నుంచి రాజధాని తరలింపు అనే అంశంపై ఇష్టం వచ్చినట్టు గా మాట్లాడుతున్నారు.  వీరిని ఇలా ప్రేరేపిస్తున్న కారణాలు వేర్వేరుగా ఉండవచ్చు కానీ… మొత్తానికి భాజపా కేంద్ర నాయకత్వం నుంచి తాజాగా వస్తున్న సంకేతాలు వీరి నోర్లకు తాళాలు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇదివరకటి స్థాయిలో  రాజధాని తరలింపు మీద ఇక పై విమర్శలు ఉండవు.  జగన్ సర్కారు మీద విమర్శలు తగ్గే అవకాశం ఉంది.

అమరావతిలో ఇప్పుడున్న తరహాలో రాజధాని ఏర్పాటును తొలగించి.. మూడు రాజధానులుగా వికేంద్రీకరించే ఆలోచనకు రాష్ట్ర భారతీయ జనతా పార్టీనుంచి గట్టి విమర్శలే ఇప్పటిదాకా వస్తున్నాయి. గుంటూరు ప్రాంతానికే చెందిన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ సుజనాచౌదరి లాంటి వాళ్లు పెద్దస్థాయిలో విరుచుకుపడుతున్నారు. జీవీఎల్ నరసింహారావు వంటివారి మాటలు భిన్నంగా ఉన్నాయి.

ఇలాంటి నేపథ్యంలో.. అమరావతి విషయంలో తొందరపాటు ప్రకటనలు చేయవద్దంటూ.. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ఏపీనేతలకు సూచించడం చర్చనీయాంశమే. పైగా, రాజధాని అనే వ్యవహారంతో కేంద్రానికి సంబంధం లేదని, పూర్తిగా రాష్ట్రానికే సంబంధించిన వ్యవహారం అని కిషన్ రెడ్డి ప్రకటించడం చూస్తోంటే.. జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా గళం విప్పవద్దని పార్టీ వారికి బ్రేకులు వేస్తున్నట్లుగా ఉంది.

రాజధాని అమరావతి అనే పేరిట ఇన్‌సైడర్ ట్రేడింగ్ సహా జరిగిన భూబాగోతాల్లో పాత్ర ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సుజనాచౌదరి జగన్ నిర్ణయంపై పెద్దగానే విరుచుకుపడ్డారు. తాజాగా కిషన్ రెడ్డి మాటలు తాళాలు వేస్తుండడంతో.. వీరంతా ఎలా స్పందిస్తారో చూడాలి.  కిషన్ రెడ్డి మాటల వల్ల, జగన్మోహన రెడ్డికి.. విమర్శల పరంగా కొంత చికాకు తగ్గినట్లే భావించొచ్చు.