ఒకప్పట్లో డీజీపీగా పనిచేసిన పోలీసు అధికారి హెచ్‌జె దొర జీవిత కథ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేటి సమాజంలో పోలీసుల పాత్ర, వారి చిత్తశుద్ధి, అవసరం తదితర సంగతుల గురించి ఆయన విపులంగా మాట్లాడారు.
ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక కొత్త ఆలోచనను పంచుకున్నారు. నిజానికి ఇలాంటి ఆలోచన చేసినందుకు ఆయనను సెభాష్ అనాల్సిందే. వచ్చే అకడమిక్ సంవత్సరం నుంచి పాఠశాలల్లో నైతిక విలువలను కూడా ఒక పాఠ్యాంశంగా పెట్టబోతున్నట్లు కేసీఆర్ ప్రకటించారు.
సత్యమునే పలుకవలెను, ఇతరులతో గౌరవంగా ప్రవర్తించవలెను, అమ్మాయిల పట్ల మర్యాదగా వ్యవహరించవలెను… ఇలాంటివన్నీ బహుశా తరగతి గదుల్లో పాఠాలుగా వస్తాయని అనుకోవచ్చు. నీతులను పాఠంగా చెప్పేసినంత మాత్రాన భవిష్యత్తరాల ప్రతినిధులైన పిల్లలందరూ నీతిమంతులైపోతారా? అని వితండంగా ప్రశ్నిస్తే మనం సమాధానం చెప్పలేం. కానీ ఏదో ఒక దశలో ప్రతి ఒక్కరికీ నైతిక విలువలను తెలియజెప్పడం అనవసరం అని కూడా అనలేం.
నైతిక విలువల పట్ల అవగాహన, గౌరవం లేకపోవడం వల్లనే.. కౌమారం దాటని పసిపిల్లలు కూడా ఇవాళ్టి రోజుల్లో అనేక రకాల కొత్త నేరాలకు పాల్పడడం కూడా జరుగుతోంది. అవన్నీ చేత్తో తుడిచినట్లుగా మాయమైపోతాయని కాదు గానీ.. కేసీఆర్ ప్రయత్నం వల్ల.. తగ్గుతాయని అనుకోవచ్చు.
అయితే ఈ సందర్భంగా కేసీఆర్ చెప్పిన కొన్ని మాటలు.. ఇటీవలి పోలీసు ఎన్ కౌంటర్ ను సమర్థిస్తున్నట్లుగా ఉన్నదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
పోలీసులకు సంబంధించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘ ప్రజాస్వామ్యంలో మంచిని కాపాడడానికి కొన్ని పనులు ఇష్టం లేకపోయినా చేయాల్సి ఉంటుంది. ప్రజల మనోభావాలు గుర్తించి గౌరవించి కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. ఇది తప్పు కాదు. సమాజానికి మంచి జరుగుతుందనుకున్నప్పుడు, అవి కఠినమైనప్పటికీ చేయక తప్పదు’ అని వ్యాఖ్యానించారు.
ఇది ప్రియాంకరెడ్డి కేసులో నిందితుల్ని పోలీసులు ఎన్ కౌంటర్ చేయడం గురించి సమర్థించినట్లే ఉన్నదనే భావన ప్రజల్లో కలుగుతోంది. ప్రజలందరూ కోరుకుంటే ముందు ముందు కూడా ఎన్ కౌంటర్లు జరుగుతూనే ఉంటాయనే అర్థాన్ని కూడా ఈ మాటలు ఇస్తున్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు.