గాయకులకి అంత తక్కువ పేమెంట్ ఇస్తారా?

హీరోల రెమ్యూనరేషన్ గురించి తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ప్రస్తుత చర్చ నేపథ్యంలో ఒక వీడియో వైరల్ అవుతోంది.  Advertisement ఆ వీడియోలో గతంలో వేరు వేరు ఇంటర్వ్యూల్లో గాయకులు మనో, కారుణ్య, ప్రణవి, గీతామాధురి…

హీరోల రెమ్యూనరేషన్ గురించి తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ప్రస్తుత చర్చ నేపథ్యంలో ఒక వీడియో వైరల్ అవుతోంది. 

ఆ వీడియోలో గతంలో వేరు వేరు ఇంటర్వ్యూల్లో గాయకులు మనో, కారుణ్య, ప్రణవి, గీతామాధురి చెప్పిన వారి రెమ్యునరేషన్ అనుభవాలు ఉన్నాయి. 

ఒకసారి ఆ నలుగురు చెప్పిన మాటలు చూద్దాం. 

మనో: “నిర్మాతలెందుకో సింగర్స్ కి డబ్బులివ్వడానికి బాధపడతారు. ఇచ్చే 1500, 2000 కి కూడా బేరాలాడితే ఎక్కడికి పోవాలండి?”

ప్రణవి: “పాటకి 5000 ఇస్తారు. నమ్ముతారా? 2000 లకి, 3000 లకి కూడా బెరాలాడతారు”.

కారుణ్య: “కోట్లు పెట్టి తీసే సినిమాల్లో మేము వేలల్లో అడుగుతున్నామంతే. దానికి కూరగాయల బేరాలాడతారు. ఏమన్నా అంటే వీళ్లింతకి పాడారు, వాళ్లంతకి పాడారు అని ప్రవర చెబుతారు”

గీతామాధురి: “కీరవాణి గారు నాకు మొదటి రెమ్యునరేషన్ గా రూ 3000 ఇచ్చారు”. 

ఈ మాటలు వింటే అందరికీ కలిగే సందేహం ఒక్కటే. వీళ్లు నిజమే చెబుతున్నారా? 

అబద్ధమైతే వేరు వేరు సందర్భాల్లో అందరూ ఒకలాంటి అబద్ధమే ఎందుకు చెబుతారు? 

నిజంగా సినీరంగంలో పేమెంట్స్ ఇంత దయనీయంగా ఉంటాయా?

సమాధానాలు వెతికితే కొన్ని విషయాలు తెలిసాయి. 

మనో ఇన్నేళ్లుగా పాడుతూ తీసుకునేది 1500-2000 నే అని డౌటొస్తుంది. నిజానికి ఆయన కోట్లకి పడగెత్తిన గాయకుడు. ఎవరో చెప్పడం ప్రకారం ఎస్పీబాలసుబ్రహ్మణ్యం కంటే ఆస్తిపరుడు. మరి ఈ లెక్కలో పాడితే ఆ లెక్కలో ఆస్తులెలా వస్తాయి? 

కనుక ఇక్కడ మనో చెప్పిన అంకెలు కేవలం ఉదాహరణ మాత్రమే అనుకోవాలి. లేదా ఆయన 1980ల్లో తీసుకున్న పేమెంట్ అయ్యుండాలి. 

ఎస్పీ బాలు చివరి రోజుల్లో పుచ్చుకున్నది పాటకి లక్షన్నర నుంచి రెండు లక్షలట. మనోకి ఎంత బేరమాడినా 50-75 వేలకి తక్కువైతే లేదని ఒక సమాచారం. 

ఇక ప్రణవి కి 3000-5000 ఇవ్వడం మాట అయితే తొలి రోజుల్లోనో, లేదా కేవలం ట్రాక్ పాడినందుకు అయి ఉండవచ్చని తెలిసింది.

సాధారణంగా అందరూ అనుకోవచ్చు..చిన్న సినిమా అయితే తక్కువ ఇస్తారు, పెద్దదైతే బాగా ముట్ట చెబుతారు అని. కానీ ఇక్కడ చాలా సందర్భాల్లో రివర్సులో ఉంటుందట. 

చిన్న సినిమాల వాళ్లకి వీళ్లు పెద్ద సింగర్స్. మాట పోకూడదని, తమని తక్కువగా చూదకూడదని వీళ్లు గౌరవప్రదమైన పేమెంట్స్ ఇస్తారట. 

కానీ పెద్ద సంగీత దర్శకులైతే తమ వద్ద పెద్ద సినిమాలకి పాడడమే మహదవకాశం కాబట్టి, దాని వల్ల సింగర్స్ కి పేరొస్తుంది కాబట్టి, వేరు వేరు వేదికలమీద పాడుకోవచ్చు కాబట్టి తక్కువ పేమెంట్స్ ఇస్తారట. 

బహుశా పైన గీతామాధురి కీరవాణి గురించి చెప్పిన సమాచారం ఆ కోవకే చెంది ఉండవచ్చు. లేదా కొత్తమ్మాయి కాబట్టి తొలినాళ్లల్లో కేవలం ట్రాక్ పాడించుకుని ఆమెకి 3000 ఇచ్చుండొచ్చు. 

ఇక కారుణ్య చెప్పిన విషయానికొద్దాం. కోట్లల్లో తీసే సినిమాలకి కూడా సింగర్స్ కి తక్కువిస్తున్నారని అన్నాడు. నిజానికి సిద్ శ్రీరాం పేమెంట్ ఒక పాటకి ప్రస్తుతం దాదాపు 5 లక్షలు. శంకర్ మహదేవన్ కి 3 లక్షలు. ఇక అర్జిత్ సింగ్, శ్రేయా గోషాల్ లాంటి సింగర్స్ కి లక్షల్లోనే ఉంది పాటకి పేమెంట్. అంతెందుకు తెలుగులో సింగర్ గా ఈ మధ్యనే పేరు తెచ్చుకున్న మంగ్లీకి పాటకి లక్ష తక్కువ లేదు. 

ఈ పాటికి విషయం అర్థం అయ్యుండాలి. ఎవరికైతే మాస్ ఫాలోయింగ్ ఉంటుందో, సింగర్ ఎవరైతే యూట్యూబులో మిలయన్ల వ్యూవ్స్ తన్నుకుంటూ వస్తాయో, ఎవరైతే స్టేజ్ మీద పాడి అలరించగలరో, ఎవరు పాడితే ఆడియో కి మంచి బేరం వస్తుందో వాళ్ల చేత నిర్మాతలు అధికమొత్తాలలిచ్చి పాడించుకుంటారు. 

జాతీయ స్థాయి దాటి అంతర్జాతీయ స్థాయికి పాకిన పాకిస్తానీ సింగర్ రెహత్ ఫతే ఆలీఖాన్ లాంటి గాయకులున్నారు. వాళ్లకైతే పాటకి రూ 15 లక్షలదాకా పేమెంట్ ఉందట. 

ఏ సింగర్ కైనా ఎన్ని అవార్డులొచ్చాయి, ఎన్నాళ్లనుంచి పాడుతున్నారు అన్న దాని మీద కంటే పస్తుతం మాస్ ఫాలోయింగ్ ఎంతుంది అన్న దాని మీదనే పేమెంట్లుంటాయి. 

నిజానికి పైన గాయకులంతా జీవితంలో తాము తీసుకున్న అతి తక్కువ పేమెంట్ గురించో, బేరాలెదుర్కున్న కొన్ని సందర్భాలో గుర్తు పెట్టుకుని చెప్పారు తప్ప వాళ్లు అధిక మొత్తంలో షోస్ నుంచి సంపాదించింది చెప్పలేదు. 

సినిమా పాటలు పాడుతుంటేనే వీళ్లకి స్టేజ్ షోస్ లో గిరాకీ ఉంటుంది. విదేశాల నుంచి పిలుపులుంటాయి. 

ఉదాహరణకి పుష్పలో “ఊ అంటావా” పాట పాడిన ఇంద్రావతికి దేవిశ్రీప్రసాద్ అసలేమీ ఇవ్వకపోయినా ఆమెకి కోట్లు సంపాదించేంత కీర్తికి రెడ్ కార్పెట్ పరిచినట్టయ్యింది ఈ పాటతో. అంత హిట్టు పడి ఆమె విజువల్ గా కూడా అందరి కళ్లల్లోనూ పడ్డప్పుడు ఫాలోయింగ్ సహజంగా వస్తుంది. యూట్యూబులో ఆమె పాటకి డిమాండ్ పెరుగుతుంది, నిర్మాతలు అధికమొత్తమిచ్చి పాడించుకుంటారు, స్టేజ్ షోస్ వస్తాయి…అదంతా మామూలు ఆదాయం కాదు. 

కనుక పాటకి ఎంతపుచ్చుకుంటున్నాము అనే దానికంటే ఏ సింగరైనా హిట్టు పాట పాడాలని కోరుకుంటారు. ఆ రేంజ్ హిట్ రానంతవరకు, తమకంటూ లిస్టులో అద్భుతమైన చార్ట్ బస్టర్స్ లేనంతవరకు లక్షల్లో రెమ్యునరేషన్స్ సాధ్యం కాదు. కనుక ఇంటర్వ్యూల్లో ఇలా కంప్లైంట్లు ఇవ్వకూడదు. 

– శ్రీనివాసమూర్తి