న్యూ ఇయ‌ర్ మ‌ద్యం మ‌త్తు..తెలంగాణ టాప్!

క‌ర్ణాట‌క‌లో గ‌త సంవ‌త్స‌రం చివ‌రి ప‌ది రోజుల్లో అమ్ముడైన మ‌ద్యం మొత్తం విలువ 516 కోట్ల రూపాయ‌లు.. ఏపీలో మ‌ద్యం దొర‌క‌డం అంత ఈజీగా లేదు. అదే తెలంగాణ విష‌యానికి వ‌స్తే.. గ‌త సంవ‌త్స‌రం…

క‌ర్ణాట‌క‌లో గ‌త సంవ‌త్స‌రం చివ‌రి ప‌ది రోజుల్లో అమ్ముడైన మ‌ద్యం మొత్తం విలువ 516 కోట్ల రూపాయ‌లు.. ఏపీలో మ‌ద్యం దొర‌క‌డం అంత ఈజీగా లేదు. అదే తెలంగాణ విష‌యానికి వ‌స్తే.. గ‌త సంవ‌త్స‌రం చివ‌రి రెండు రోజులు అంటే డిసెంబ‌ర్ 30,31 తేదీల్లో అమ్ముడైన మొత్తం మ‌ద్యం విలువ దాదాపు 400 కోట్ల రూపాయ‌లు! మ‌ద్యం విషయంలో ఎలాంటి ష‌ర‌తులు లేని క‌ర్ణాట‌క‌లో, బెంగ‌ళూరు వంటి మ‌హా న‌గ‌రాన్ని క‌లుపుకుంటే.. ప‌ది రోజుల్లో ఐదువంద‌ల కోట్ల రూపాయ‌ల స్థాయిలో మ‌ద్యం అమ్ముడు అయితే, తెలంగాణ‌లో మాత్రం రెండు రోజుల్లో నాలుగు వంద‌ల కోట్ల రూపాయ‌ల లిక్క‌ర్ సేల్ అయ్యింది!

ఇలా న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా మ‌త్తుల్లో చిందేయ‌డంలో తెలంగాణ ముందు నిలిచింది. ఏకంగా రెండు రోజుల్లో నాలుగు వంద‌ల కోట్ల రూపాయ‌ల మ‌ద్యాన్ని తాగేశారంటే  ఏ స్థాయిలో మ‌త్తులో ఊగారో అంచ‌నా వేయ‌వ‌చ్చు.

తెలంగాణ వ్యాప్తంగా ప్ర‌తి రోజూ క‌నీసం అర‌వై కోట్ల రూపాయ‌ల స్థాయిలో మ‌ద్యం సేల్ అవుతుంద‌ని అంచ‌నా. అది రోజూ జ‌రిగే స‌గ‌టు వ్యాపారం విలువ‌. న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా మాత్రం అది అనేక రెట్లు పెరిగింది. రోజుకు రెండు వంద‌ల కోట్ల రూపాయ‌ల స్థాయికి చేరింది. ఈ విష‌యంలో తెలంగాణ క‌న్నా పెద్ద‌ది, బెంగ‌ళూరును కూడా క‌లిగి ఉన్న‌ క‌ర్ణాట‌క వంటి రాష్ట్రం కూడా తెలంగాణ‌కు పోటీ ఇచ్చే స్థితిలో లేదు. మ‌ద్యం మీద కేసీఆర్ స‌ర్కార్ ఆదాయం కూడా ఈ సేల్స్ కు త‌గ్గ‌ట్టుగా భారీగానే ఉంది.