చిన్న సినిమా బాగుంటే మరీ ఎత్తనక్కరలేదు. కాస్త పుష్ చేస్తే చాలు జనం నెత్తిన పెట్టేసుకుంటారు. 2019లోనే కాదు, అంతకు ముందు కూడా అలాంటి ఉదాహరణలు చాలా అంటే చాలా వున్నాయి. అయితే ఈ మధ్య చిన్న సినిమా కాస్త పెద్ద బ్యానర్ నుంచో, పెద్ద ఫ్యామిలీల నుంచో వస్తే, ప్రమోషన్లు పీక్ లో వుంటున్నాయి.
లేటెస్ట్ గా మత్తువదలరా సినిమాకు ప్రమోషన్లు అలాగే వున్నాయి. సినిమా మ్యూజిక్ డైరక్టర్, హీరో ఇధ్దరు దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి ప్యామిలీ నుంచి రావడంతో ఆ సినిమాను ఓ రేంజ్ లో ఎత్తుతున్నారు. నిజానికి సినిమాకు మాంచి పాజిటివ్ సమీక్షలు వచ్చినా, కమర్షియల్ గా మాత్రం ఏమంత అద్భుతమైన ఫలితాలు సాధించలేదు.
సినిమా ద్వితీయార్థం తేడా కావడం, క్లయిమాక్స్ లో సాగీదీసిన వ్యవహారాలు కలిసి సినిమాను బిసి సెంటర్లకు దూరం చేసాయి. అయితే దీన్ని ఎలాగైనా లేపాలని కీరవాణి ఫ్యామిలీ రంగంలోకి దిగిపోయింది. కీరవాణి సక్సెస్ మీట్ నిర్వహించారు. రాజమౌళి తన లెవెల్ కు దిగి మరీ కుర్రాళ్లను ఇంటర్వూ చేసారు.
ఇది చాలదన్నట్లు ప్రభాస్ ను కూడా రంగంలోకి దింపేసారు. ప్రభాస్ కూడా కుర్రాళ్లను ఇంటర్వూ చేసారు. నిజానికి మరే చిన్న సినిమా, ఇంత బాగున్నా, ఇంకా ఎక్కువ బాగున్నా, ఆ కుర్రాళ్లను ప్రభాస్ రేంజ్ హీరో కానీ, రాజమౌళి రేంజ్ దర్శకుడు ఇంటర్వ్యూ చేసేంత సీన్ వుండేది కాదు. మన ఫ్యామిలీ అని రాజమౌళి అండ్ కో, వాళ్ల కోసం ప్రభాస్ లాంటి వాళ్లు రంగంలోకి దిగిపోయారు.
కానీ చిత్రమేమిటంటే, ఇంతలా చేస్తున్నా ఆంధ్రలో కలెక్షన్లు మాత్రం అంతంత మాత్రంగానే వుంటున్నాయి. అయితే అదృష్టం ఏమిటంటే ఈ సినిమా బడ్జెట్ చాలా తక్కువ కావడం వల్ల హ్యాపీనే.
అయితే ఎవరు చిన్న సినిమా మంచిది తీసినా, ఏ కుర్రాళ్లు మంచి ప్రయత్నం చేసినా రాజమౌళి, ప్రభాస్ లాంటి వాళ్లు ఇలా ముందుకు వస్తే బాగుంటుంది. అంతే కానీ మన ఫ్యామిలీ, మన కుర్రాళ్లు కాబట్టి, తాడిచెట్టు ఎక్కేవరకు తోడుంటాం అనుకుంటే, సరి కాదేమో? టాలెంట్ ఎక్కడున్నా ఒకేలా స్పందించాలి పెద్దవాళ్లు.