పిల్ల‌ల‌కూ వ్యాక్సిన్.. సందేహాలు తీరేదెలా?

క‌రోనా పాత వేరియెంట్ల‌కూ.. వ్యాక్సిన్ల‌ కూ.. మ‌ధ్య పోరు సంగ‌తెలా ఉన్నా, క‌రోనా కొత్త వేరియెంట్ల‌తో వ్యాక్సిన్లు ఏ మేర‌కు పోరాట ప‌టిమ‌ని అందిస్తాయ‌నేదే ఇప్పుడు చ‌ర్చ‌గా మారింది! గ‌త కొన్నాళ్లుగా అంత‌ర్జాతీయంగా జ‌రుగుతున్న…

క‌రోనా పాత వేరియెంట్ల‌కూ.. వ్యాక్సిన్ల‌ కూ.. మ‌ధ్య పోరు సంగ‌తెలా ఉన్నా, క‌రోనా కొత్త వేరియెంట్ల‌తో వ్యాక్సిన్లు ఏ మేర‌కు పోరాట ప‌టిమ‌ని అందిస్తాయ‌నేదే ఇప్పుడు చ‌ర్చ‌గా మారింది! గ‌త కొన్నాళ్లుగా అంత‌ర్జాతీయంగా జ‌రుగుతున్న ప‌రిశోధ‌న‌లు ఏమిటంటే.. వ్యాక్సిన్ వ‌ర్సెస్ ఒమిక్రాన్ అనే అంశం. ఇప్ప‌టికే క‌రోనా విష‌యంలో వ్యాధినిరోధ‌క‌త‌ను పెంచుతాయ‌ని ప్ర‌పంచం మొత్తం తీసుకుంటున్న వ్యాక్సిన్లు ఒమిక్రాన్ వేరియెంట్ ను ఏ మేర‌కు ఎదుర్కొన‌గ‌ల‌వు? అనే పాయింట్ మీద ర‌క‌ర‌కాల ప‌రిశోధ‌న‌లు జ‌రిగాయి, జ‌రుగుతున్నాయి. 

వాటి ఫ‌లితాలు పాక్షికంగానే వెల్ల‌డ‌య్యాయ‌ని అనుకోవాలి. ఈ అధ్య‌య‌నాలు భార‌తీయుల‌కు భారీ షాక్ ఇచ్చే ప్ర‌క‌ట‌న‌నే చేశాయి. ఇండియాలో విస్తృతంగా వేసిన కోవీషీల్డ్, కోవ్యాగ్జిన్లు .. ఒమిక్రాన్ ను ఎదుర్కొన‌డంలో చూపిన ప్ర‌భావం అంతంత మాత్ర‌మే అని కొన్ని అధ్య‌య‌నాలు చెప్పుకొచ్చాయి! మ‌రి ఆ అధ్య‌య‌నాల విశ్వ‌స‌నీయ‌త ఏమో కానీ.. వారు చెప్పే మాట మాత్రం గుబులు పుట్టించ‌క‌మాన‌దు.

మ‌రోవైపు అమెరికా, ఇజ్రాయెల్ వంటి దేశాలు ఇబ్బ‌డిముబ్బ‌డిగా వేసుకోండి.. వ్యాక్సిన్ అంటున్నాయి. ప్ర‌జ‌ల‌కు మూడో డోసు, నాలుగో డోసు కూడా అక్క‌డ ఇవ్వ‌డానికి ప్ర‌భుత్వాలు పోటీలు పడుతున్నాయి. అమెరికాలో బూస్టర్ డోస్ అంటూ బైడెన్ చాన్నాళ్లు చెబుతున్నారు. ఇజ్రాయెల్ లో అయితే నాలుగో డోసు ఇస్తున్నార‌ట‌! 

మ‌రి కొన్ని ర‌కాల వ్యాక్సిన్లు ఒమిక్రాన్ ను ఎదుర్కొన‌గ‌ల‌వా? అనే సందేహాలు ఉన్న త‌రుణంలో, ప‌దే ప‌దే వీలైనన్ని డోసులు వ్యాక్సిన్ వేసుకోవాలంటూ… ప్ర‌భుత్వాలు చెబుతూ ఉండ‌టం దేనికో అంతుబ‌ట్ట‌నిదిగా మారింది.

ఇక ఇండియాలో 12 నుంచి 18 వ‌య‌సు పిల్ల‌ల‌కు వ్యాక్సిన్ ఇవ్వ‌డానికి డీసీజీఐ ప‌ర్మిష‌న్ ఇచ్చింది. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ కూడా జ‌న‌వ‌రి మూడు నుంచి ఆ వ‌య‌సు పిల్ల‌ల‌కు వ్యాక్సిన్ అని ప్ర‌క‌టించారు. అయితే పాత వ్యాక్సిన్లు.. కొత్త వేరియెంట్ పై ఏ మేర‌కు ప‌ని చేస్తాయో.. అనేదే పూర్తి స్ప‌ష్ట‌త లేని అంశం అంటున్న త‌రుణంలో, ఒమిక్రాన్ త‌లెత్త‌క పూర్వం త‌యారు చేసిన వ్యాక్సిన్ల‌ను కోట్ల మందిపై,అది కూడా పిల్ల‌ల‌కు ఇవ్వాలా? అనేది త‌ల్లిదండ్రుల‌ను వేధించే ప్ర‌శ్న‌గా మారుతోంది.

చాలా ప‌రిశోధ‌న‌లు జ‌రిగాయ‌ని ప్ర‌ధాన‌మంత్రి, ప‌రిశోధ‌కులు వ్యాక్సిన్ విష‌యంలో భ‌రోసా ఇస్తున్నారు.  ఏవైనా దీర్ఘ‌కాలిక వ్యాధుల‌తో ఇబ్బంది ప‌డే పిల్ల‌లకు మాత్రం వ్యాక్సిన్ ను త‌ప్ప‌నిస‌రిగా ఇవ్వాల‌ని ఇప్ప‌టికే వైద్యులు చెబుతున్నారు. 18 యేళ్ల లోపు పిల్ల‌ల్లో కూడా కొంద‌రు కొన్ని ర‌కాలా ఆరోగ్య ఇబ్బందుల‌ను ఎదుర్కొంటూ ఉండ‌వ‌చ్చు. వారికి వ్యాక్సిన్ అవ‌స‌రం ఎంతైనా ఉంది.