రెండు గాజులు ఇచ్చుకోవాల్సి వచ్చింది

నేను సైతం ప్రపంచాగ్నికి సమధనొక్కటి ఆహుతిచ్చాను అన్నట్లుగా వుంది నారా వారి వ్యవహారం. అమరావతి ఉద్యమాన్ని మాగ్నిఫైయింగ్ గ్లాస్ లో చూపించి, దాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తోంది ఓ వర్గపు మీడియా. అమరావతి రైతులు…

నేను సైతం ప్రపంచాగ్నికి సమధనొక్కటి ఆహుతిచ్చాను అన్నట్లుగా వుంది నారా వారి వ్యవహారం. అమరావతి ఉద్యమాన్ని మాగ్నిఫైయింగ్ గ్లాస్ లో చూపించి, దాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తోంది ఓ వర్గపు మీడియా. అమరావతి రైతులు ఏకంగా సూసైడ్ చేసుకుంటామంటూ రాష్ట్రపతికి లేఖ రాసారంటూ హడావుడి. 

అసలు సమస్య ఏమిటన్నది వివరించడం లేదు. రైతులకు సమస్య ఏమిటి?  వాళ్లకు అమరావతి దగ్గర భూమి వుంది. దాన్ని నమ్ముకునే అయిదేళ్ల క్రితం వరకు బతకుతూ వచ్చారు. ఇలాంటి భూములకు యజమానులు చాలా వరకు విదేశాల్లో పట్టణాల్లొ వున్నారు.కొంత మంది లోకల్ గా వున్నారు. టోటల్ గా చూసుకుంటే స్వంతంగానో కౌలుకో పండించే రైతులు మాత్రం లోకల్ గానే వున్నారు. 

భూములు ప్రభుత్వం తీసుకోవం వల్ల వీరంతా నిరుద్యోగులు అవుతారు. అందుకోసం వాళ్లకు స్కిల్ డెవలప్ మెంట్ స్కీమ్ కింద శిక్షణ ఇస్తామని అయిదేళ్ల క్రితమే ప్రభుత్వం చెప్పింది. శిక్షణ ఇచ్చారా? లేదా? అన్నది పక్కన పెడితే, వాళ్లకు ఉపాథి ఇచ్చేంత కర్మాగారాలు కానీ, ఇతరత్రా అవకాశాలు కానీ అమరావతిలో రాలేదు. వచ్చినవి ప్రభుత్వ పరంగా సచివాలయం, హైకోర్టు మాత్రమే. ప్రయివేటు పరంగా కొన్ని విద్యా సంస్థలు. వీటివల్ల వచ్చిన ఉపాధి ఏమిటంటే రెస్టారెంట్లు, మెస్ లు, హాస్టళ్లు ఇలాంటివి. వీటిలో కొంతమందికి ఉపాధి.

రాజదానికి భూములు ఇచ్చిన వారిలో అప్పటికప్పుడు కొని ఇచ్చిన వారు కూడా వున్నారు. అంటే లాభం ఆశించి పెట్టుబడి పెట్టిన వారు. ప్రస్తుతానికి నష్టమే కానీ, ఎప్పటికి అయినా అమరావతి పూర్తి స్థాయికి చేరుకుంటే, అప్పుడు ప్రభుత్వం ఇచ్చిన స్థలాల విలువ పెరిగితే, ఇప్పుడు కొన్నదానికన్నా ఎక్కువ వస్తుంది అని ఆశిస్తూ పెట్టుబడులు పెట్టినవారు ఎందరో వున్నారు. ఇలా పెట్టుబడులు పెట్టినవారిలో ఎన్నారైలు, హైదరాబాద్ లో వున్నవారు ఎందరో వున్నారు.  
అంటే బేసిక్ గా అమరావతిలో భూములు కలిగి ఎక్కడో వుంటున్న వారు, అమరావతిలో వుంటున్నవారు, అమరావతిలో భూములు కొని పెట్టుబడులు పెట్టిన వారు. అనే మూడు క్యాటగిరీలు వున్నారు. 

మరి ఇప్పుడు ఏం జరుగుతోంది అంటే. 

కౌలుకు భూములు చేసుకుని, పంటలు పండించకుని అమ్మేవారికి సమస్య లేదు. ఎందుకంటే వారికి అదే వచ్చు. అదే ఇష్టం కూడా. సమస్య వారితో కాదు, భూములు వుంచుకుని రేట్లు పెరిగాయని, లెక్కలు వేసుకున్నవారు, అలాగే భూములు కొని ప్రభుత్వానికి ఇచ్చిన వారు. అమరావతిని నమ్ముకుని రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయాలుకునేవారు. 

ఇప్పుడు వీరే అమరావతి ఉద్యమం కొనసాగాలనుకుంటున్నారు. వీరే ఇప్పుడు ఉద్యమానికి అండ దండ ఇవ్వాలనుకుంటున్నారు. నిజానికి రోడ్డు మీద వంటా వార్పు చేయడానికో? రోడ్డు మీద ధర్నాలు చేయడానికో డబ్బులు అవసరం లేదు. నిజానికి లోకల్ గా వుంటున్నవారు నిత్యం రోడ్డు మీదకు వచ్చిన నిరసన తెలియచేయడానికి పెట్టుబడి అక్కరలేదు. శిబిరాలు నిర్వహించాల్సిన పని లేదు.  లోకల్ గా ఇల్లు, వాకిలి వున్నవారు, ఎక్కువగా భూములు కలిగినవారు శిబిరాల్లో వుండరు. వ్యవసాయ కూలీలు, రాజధాని పనులు లేక ఇబ్బంది పడుతున్నవారే శిబిరాల్లో వుంటారు.

ఇప్పుడు వీరినే రైతులుగా చూపించి, వీరినే ఉద్యమ దిశగా నడిపించి, అమరావతిని నిలబెట్టాలన్న ప్రయత్నం కనిపిస్తున్నట్లుంది. అందుకోసమే విదేశాలు, బంగళూరు, హైదరాబాద్ లోని ఓ వర్గం నుంచి విరాళాలు తీసుకుని, ఖర్చుచేసే ఆలోచనలు చేస్తున్నారని వార్తలు, వదంతులు వినిపిస్తున్నాయి. నిధుల సమీకరణ కు ఊతమిచ్చేలా ఇప్పుడు నారా ఫ్యామిలీ కూడా ముందుకు వచ్చింది.

నారా భువనేశ్వరి తన చేతి గాజులను ఉద్యమానికి అందించారు అంటూ వార్తలు వచ్చేసాయి. చంద్రబాబు అయిదేళ్లలో అమరావతిని కొంత అయినా కట్టేసి వుంటే, ఇప్పుడు ఈ విరాళాల సమస్య వుండేది కాదు, బాబుగారి భార్య తన గాజులు వదులుకోవాల్సి వచ్చేది కాదు. ఎవరో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు సాగించుకోవడం కోసం, ఎవరో లబ్ది పొందడం కోసం, అమరావతికి మరెవరో సమిధలు ఆహుతివ్వాల్సి వస్తోంది. ఆ సమిధలు సమీకరించడం కోసం గాజులు ఇచ్చుకోవాల్సి వస్తోంది.