నిర్మాత దిల్ రాజు మాట తప్పారా? నిర్మాతగా కాదు డిస్ట్రిబ్యూటర్ గా? అందుకే అల్లు అరవింద్ తన కుమారుడు బన్నీ సినిమాను ముందుగా అనుకున్నట్లుగా 12న కాకుండా 10న విడుదల చేయాలనుకుంటున్నారా? పేరు వెల్లడించడానికి ఇష్టపడని వర్గాలు అందించిన సమాచారం ఇలా వుంది.
అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు సినిమాలు రెండూ జనవరి 12న విడుదల కావాల్సి వున్నపుడు రెండు సినిమాల మేజర్ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు రంగ ప్రవేశం చేసి, థియేటర్ల వ్యవహారం తను చూసుకుంటాను, తనను నమ్మి వేరే వేరే డేట్లకు రమ్మని ఇరు వర్గాలకు చెప్పారు. అప్పుడు బన్నీ యూనిట్ వెనకే వుంటామని చెప్పడంతో మహేష్ సినిమా యూనిట్ ముందుకు వెళ్లింది.
ఇక్కడ కుదిరిన జెంటిల్ మెన్ అగ్రిమెంట్ ఏమిటంటే, 11న మొత్తం థియేటర్లు సరిలేరుకు తీసుకుని, రెండో రోజు అయిన 12న అల వైకుంఠపురంలో సినిమాకు మూడు వంతులు వదలాలి. 13 నుంచి చెరి సగం థియేటర్లు తీసుకోవాలి. అయితే దర్బార్ సినిమా కూడా వుంది.
అంటే ఏ విధంగా అయితే, 100 థియేటర్లు వుంటే 20 థియేటర్లలో దర్బార్ వుంటుంది. 11న 80 థియేటర్లలో సరిలేరు నీకెవ్వరు వస్తుంది. 12న 60 థియేటర్లు అల వైకుంఠపురములో సినిమాకు ఇవ్వాలి. 13 నుంచి చెరో 40 థియేటర్లు తీసుకోవాలి. ఇదీ లెక్క.
కానీ ఇప్పుడు దగ్గరకు వచ్చి అగ్రిమెంట్లు, లెక్కలు తేలుతుంటే అలా జరగడం లేదన్నది బన్నీ యూనిట్ వర్గాలు చెబుతున్న విషయం. విడుదల డేట్ అయిన 12 నాటికి కేవలం ఇరవై థియేటర్లలో బన్నీ సినిమా, 60 థియేటర్లలో మహేష్ సినిమా వుంటున్నాయి. 13న 40 వాళ్లకి 40 వీళ్లకు వస్తున్నాయి.
ఇప్పుడు బన్నీ యూనిట్ ఏమంటోంది? ముందుగా అనుకున్న ప్రకారం 60 వస్తే, ఏమీ ఇబ్బంది వుండేది కాదు, కానీ అలా చేయకుండా మాట తప్పడం వల్లనే ఆలోచించాల్సి వస్తోందని.ఇప్పుడు 10న వస్తే, మహేష్ సినిమా కూడా 10నే వస్తుంది. ఇద్దరికీ సమానంగా థియేటర్లు వుంటాయి. ఏ గొడవా లేదు. అదీ లాజిక్.
దిల్ రాజు ప్రెషర్
ఇదిలా వుంటే ఇదంతా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజుకు సమస్యగా మారినట్లు సమాచారం. ఆయన ఇప్పుడు మహేష్ తో ఓ సినిమా నిర్మించబోతున్నారు. పైగా ఆయనకు సరిలేరునీకెవ్వరు సినిమాను తక్కువ రేటుకు ఇచ్చారని బోగట్టా. అందువల్ల అటు మొగ్గాల్సి వస్తోందన్నది బన్నీ వర్గాల వాదన.
ఇప్పటికే దిల్ రాజు అటు అరవింద్ ను, ఇటు శిరీష్ హారిక హాసినిని ఎలాగైనా ఒప్పించి 12నే వచ్చేలా చూడాలని ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు ఆ ఇద్దరూ విపరీతంగా ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే నాపేరు సూర్య సినిమా సమయంలో కూడా మహేష్ నుంచి ఇదే తరహా సమస్య వచ్చిందని, ఈసారి ఇక వెనక్కు తగ్గేది లేదని బన్నీ సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.
ప్రతీసారి అమాయకంగా కనిపిస్తున్నామని అంటున్నాయి. ఈసారి వదిలేది లేంటున్నారు. అయితే తమకు 10వ తేదీ సెంటిమెంట్ కనుక వస్తే 11నే వద్దామని హారిక హాసిని యూనిట్ అంటోంది. అది వేరే సంగతి.