“రాయలసీమ ముద్దుబిడ్డ మన జగనన్న. నీ వెంట ప్రభంజనం చూడవే అన్నా.అభివృద్ధికి పెద్దదిక్కు మన జగనన్న. అన్నార్తులకు కన్నకొడుకు మన జగనన్న” అంటూ ప్రముఖ గాయని మంగ్లీ పాడిన ఆ పాట ఎంత పాపులర్ అయ్యిందో ప్రతి ఒక్కరికీ తెలుసు. ప్రస్తుతం ఆ పాటకు ఏపీ ఉప ముఖ్యమంత్రి, గిరిజనసంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్ప శ్రీవాణి టిక్‌టాక్‌లో తనదైన శైలిలో హావభావాలు వ్యక్తం చేస్తూ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రాయలసీమలోని అనంతపురం జిల్లాకు చెందిన మంగ్లీ గిరిజన యువతి. ఈమె అనంతపురం ఆర్డీటీ (రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్) సహకారంతో చదువుకున్నారు. జానపద పాటల గాయనిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన మంగ్లీ ప్రస్తుతం తెలంగాణలో స్థిరపడ్డారు. తెలంగాణ యాసను, భాషను సొంతం చేసుకున్న మంగ్లీ కళారంగంలో ముందుకు దూసుకెళుతున్నారు.
సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆమె పాడిన రాయలసీమ ముద్దుబిడ్డ అనే పాట ఒక ఊపు ఊపిందనే చెప్పొచ్చు. జగన్ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో తాజాగా ఆ పాటకు మరో గిరిజన మంత్రి పాముల పుష్ప శ్రీవాణి అద్భుతమైన హావభావాలతో ఆకట్టుకుంటున్నారు.
జగన్ కేబినెట్‌లో అతి చిన్న వయస్సు (31)లో మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. అంతేకాకుండా ఉప ముఖ్యమంత్రిగా కూడా ఆమె కొనసాగుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పుష్ప శ్రీవాణి వివాహానంతరం విజయనగరం జిల్లా జియమ్మవలస మండలంలోని చినమేరంగి కోటలో స్థిరపడ్డారు.
టీచర్‌గా పనిచేస్తూ భర్త ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చారు. కురుపాం అసెంబ్లీ (ఎస్టీ) స్థానం నుంచి ఆమె రెండుసార్లు విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో 27 ఏళ్ల వయసులో వైసీపీ తరపున శ్రీవాణి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రెండోసారి ఎన్నికైన ఆమెను మంత్రి పదవి వరించింది.