ఓవైపు జగన్ వద్దంటున్నారు. సవాలక్ష కండిషన్లు పెడుతున్నారు. అయినా టీడీపీ నేతలు మాత్రం ఆగేలా లేరు. పార్టీలో ఏదో ఒక మూల చిన్న చోటు ఇస్తే చాలు, అదే మహాప్రసాదం అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఒకరు జంప్. మరొకరు ఆన్-ది-వే. ఇప్పుడు మరో వ్యక్తి అదే దారిలో వడివడిగా అడుగులు వేస్తున్నారు. అతడి పేరు గొట్టిపాటి రవికుమార్.
అవును.. అద్దంకి టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కూడా పార్టీని వీడే ఆలోచనలో ఉన్నారు. తన పాత స్నేహితులైన వైసీపీ సభ్యులతో తీవ్రంగా మంతనాలు సాగిస్తున్నారు. వల్లభనేని వంశీ తరహాలో తనను కూడా స్వంతత్ర అభ్యర్థిగా గుర్తిస్తే అదే పదివేలు అంటున్నారు రవికుమార్. అటు మరో టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరి ఇప్పటికే జగన్ ను కలిశారు. చంద్రబాబును తిట్టారు. రేపోమాపో వంశీతో కలిసి అసెంబ్లీలో సీటు పంచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే గొట్టిపాటి, మద్దాలిపై జగన్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
నిజానికి గొట్టిపాటి రవికుమార్ వైసీపీ సభ్యుడే. 2014లో వైసీపీ తరఫున గెలిచారీయన. తర్వాత టీడీపీలో చేరారు. అయితే దీనికి ఆయన చెప్పే కారణాలు మాత్రం చాలా ప్రత్యేకం. తన వ్యాపారాలకు నష్టం వాటిల్లుతుండడంతో, ఒత్తిడి ఎక్కువై, గత్యంతరం లేక అప్పట్లో టీడీపీలో చేరానంటూ పొలిటికల్ సర్కిల్స్ లో ఆయన బాగానే ప్రచారం చేసుకున్నారు. తద్వారా సింపతీ కూడా కూడగట్టుకున్నారు. ఆ ప్రచారం-సింపతీ అతడికిప్పుడు పనికొచ్చేలా ఉంది.
టీడీపీ ఇప్పటికే వల్లభనేని వంశీ రూపంలో ఓ ఎమ్మెల్యేను పోగొట్టుకుంది. రేపోమాపో మద్దాలి కూడా వెళ్లిపోవడం ఖాయం. ఇప్పుడు గొట్టిపాటి కూడా జెండా ఎత్తేస్తే ఆ పార్టీ బలం 20కి పడిపోతుంది.