కొత్త ఏడాదిలోనైనా పవన్ కి జ్ఞానోదయం అవుతుందా?

నమ్మినవారిని నట్టేట ముంచే రకం, నమ్మకద్రోహానికి నిలువెత్తు నిదర్శనం. ఇలా చంద్రబాబు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే బాబుకున్న స్పెషాలిటీ ఏంటంటే.. ఆయన ఉచ్చులో పడ్డవాళ్లు పూర్తిగా నాశనమైపోయేంత వరకు అది తెలుసుకోలేరు,…

నమ్మినవారిని నట్టేట ముంచే రకం, నమ్మకద్రోహానికి నిలువెత్తు నిదర్శనం. ఇలా చంద్రబాబు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే బాబుకున్న స్పెషాలిటీ ఏంటంటే.. ఆయన ఉచ్చులో పడ్డవాళ్లు పూర్తిగా నాశనమైపోయేంత వరకు అది తెలుసుకోలేరు, సరిగ్గా ఇప్పుడు పవన్ కల్యాణ్ అదే పరిస్థితుల్లో ఉన్నారు.

రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటాల్లో పవన్ ని ఓ పావులా వాడుకుంటున్నారు చంద్రబాబు. జగన్ ని వ్యతిరేకించే నిర్ణయాల్లో ప్రజా వ్యతిరేకత తనపైకి రాకుండా చూసుకోడానికి పవన్ ని అడ్డు పెట్టుకుని చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు. ఇసుక ధర్నాలయినా, తెలుగు మీడియం గొడవ అయినా, ఇప్పుడు 3 రాజధానుల అంశమైనా… అన్నిట్లో పవన్ కల్యాణ్ ని ఇరికించేశారు.

మీడియం గొడవలో సీఎం జగన్ కూడా చంద్రబాబు కంటే ఎక్కువగా పవన్ ని విమర్శించారంటే, డైవర్షన్ అంకుల్ ప్రతిభ ఏంటో అర్థమవుతోంది. స్థానిక ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను రాబట్టుకోడానికే చంద్రబాబు పన్నాగమంతా. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా ఒకవేళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా ఓటు వేయాలంటే అది టీడీపీకే పడుతుంది. బీజేపీ, జనసేన గుర్తులు బ్యాలెట్ లో ఉండాల్సిందే కానీ దేనికీ పనికిరావు. కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే పోరాటాల్లో మాత్రం ఆ రెండు పార్టీలు ప్రముఖంగానే కనిపిస్తాయి. కష్టం వారిది, ఫలితం బాబుది అన్నమాట.

అందుకే చంద్రబాబు తెలివిగా రాజధాని విషయంలో కూడా పవన్ ని బైటకు లాగారు. అనుకూల మీడియాతో ఈ గేమ్ స్టార్ట్ చేశారు. పవన్ ఏది మాట్లాడిదే అది హైలెట్ అయ్యేలా చేయడంతో.. ఆటోమేటిక్ గానే జనసేనాని, చంద్రబాబు ట్రాప్ లో పడిపోయారు. రాజధాని ప్రాంత రైతుల కోసం అదిచేస్తా ఇది చేస్తానంటూ రెచ్చిపోయారు. రాజధాని విషయంలో జగన్ ఇరుకున పడాలి, అదే సమయంలో రాయలసీమ, ఉత్తరాంధ్రలో టీడీపీ ఓటు బ్యాంకు పోకూడదు, ఇదీ చంద్రబాబు స్ట్రాటజీ. దీని కోసమే పవన్ ని అడ్డుపెట్టుకుని జగన్ పై తుపాకీ గురిపెట్టారు చంద్రబాబు.

పాపం ఆ విషయం తెలియక తానే హీరో అన్నట్టు బిల్డప్ ఇస్తున్నారు జనసేనాని. కనీసం కొత్త ఏడాది అయినా పవన్ కి జ్ఞానోదయం అవుతుందేమో, చంద్రబాబు ఉచ్చులో నుంచి బైటపడతారేమో చూడాలి.