రాజకీయ సంచలనం.. పీసీసీ చీఫ్ పదవికి కసరత్తు పూర్తి

టైటిల్ చూసి ఇదేదో కామెడీ అనుకోవద్దు. నిజంగా రాజకీయాల్లో ఇదో పెను మార్పు, పెద్ద సంచలనం కింద నమ్మాల్సిందేనంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఏపీ రాజకీయాల్లో ఇదో కీలక మార్పుగా చెబుతున్నారు. ఇన్నాళ్లూ శవాసనం వేసిన…

టైటిల్ చూసి ఇదేదో కామెడీ అనుకోవద్దు. నిజంగా రాజకీయాల్లో ఇదో పెను మార్పు, పెద్ద సంచలనం కింద నమ్మాల్సిందేనంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఏపీ రాజకీయాల్లో ఇదో కీలక మార్పుగా చెబుతున్నారు. ఇన్నాళ్లూ శవాసనం వేసిన ఏపీ కాంగ్రెస్ ఈ నియామకంతో లేచి నిలబడి పరిగెత్తుతుందని, ఏకంగా ఏపీలో అధికారం చేపడుతుందని నమ్మకంగా చెబుతున్నారు.

రాజశేఖర్ రెడ్డి జమానా తర్వాత ఏపీలో కాంగ్రెస్ వైభవం పోయింది. ఆ తర్వాత రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డితో నెట్టుకు రావాలని చూసినా ఫలితం లేదు. వైఎస్ఆర్ పై ఉన్న అభిమానంతోనే ఆయన హయాంలో గెలిచిన ఎమ్మెల్యేలమన్న ఒకే ఒక్క కారణంతో అప్పట్లో వారంతా కాంగ్రెస్ కి లాయల్టీగా ఉన్నారు, ఆ తర్వాత ఎవరి దారి వారు చూసుకున్నారు. రాష్ట్ర విభజన శాపం గట్టిగానే తగిలిన కాంగ్రెస్ ఇప్పుడు ఏపీలో ఏ మూల కూడా కనిపించడం లేదు. పై స్థాయి నాయకుల్లో కొందరు మిగిలారంతే, మిగతా బ్యాచ్ ని ఏ పార్టీ కూడా తీసుకునే పరిస్థితి లేదు కాబట్టి, వారికి అవకాశాలు లేవు.

ఇక జెండా మోసే కార్యకర్తల సంఖ్య సున్నా. ఎప్పుడు ఏ కార్యక్రమం పెట్టుకున్నా.. చదివింపులతో జనాల్ని తెచ్చుకోవాల్సిందే. పీసీసీ చీఫ్ గా రఘువీరా రెడ్డి తర్వాత ఎవరూ ముందుకు రాకపోవడంతో కొన్నాళ్లుగా శైలజా నాథ్ తో నెట్టుకొస్తున్నారు. అయితే ఆయన్ను కనీసం పీసీసీ చీఫ్ గా ఎవరూ గుర్తించడంలేదనేది వాస్తవం. ఈ దశలో ఎన్నికలకు రెండేళ్ల ముందుగా ఏపీ కాంగ్రెస్ కి అధ్యక్షుడిని ఎంపిక చేయాలని అధిష్టానం భావించింది.

అక్కడే దిక్కు లేదు, ఇక్కడికి తొందరెందుకు..?

వాస్తవానికి ఆలిండియా కాంగ్రెస్ కమిటీకే ఇంకా అధ్యక్షుడిని ఎన్నుకోవడం సాధ్యపడలేదు. ఇప్పుడు ఏపీకి చీఫ్ ని వెదకడం వల్ల పెద్ద ఉపయోగం లేదు కానీ, దీనికి కూడా ఓ కమిటీ, కమిషన్, అభిప్రాయ సేకరణ, ఓటింగ్ అంటూ పెద్ద సీన్ క్రియేట్ చేస్తోంది అధిష్టానం. ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి ఊమెన్ చాందీ విజయవాడలో మకాం వేసి ఈ పని పూర్తి చేశారట. హర్షకుమార్, గిడుగు రుద్రరాజు, జేడీ శీలం, చింతా మోహన్, మహిళా కోటా నుంచి సుంకర పద్మశ్రీ.. వీరంతా రేసులో ఉన్నారట. వీరిలో ఒకరి పేరు ప్రకటిస్తారట.

జనానికి కాంగ్రెస్ పార్టీ అంటే కామెడీ అయిపోయిన తర్వాత కూడా అధిష్టానం ఇలా ఎంపికల పేరుతో మరోసారి కామెడీ చేస్తోంది. అయితే మిగులు నాయకులు మాత్రం కాంగ్రెస్ కి పునర్వైభవం తెస్తామంటూ బీరాలు పలుకుతున్నారు. ఏపీలో ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ తీవ్రంగా కష్టపడుతున్నాయి. కనీసం వార్డు మెంబర్లు కూడా లేని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పీసీసీ రిక్రూట్ మెంట్ తో పూర్వ వైభవం తెచ్చుకుంటుందని చెప్పుకోవడం కామెడీ కాక ఇంకేంటి..?