షాక్ ఇస్తాడనుకున్న మోదీ.. స్వీట్ న్యూస్ చెప్పారు

ప్రధాని మోదీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగాలన్నీ దాదాపుగా షాకింగ్ న్యూస్ నే మోసుకొచ్చేవి. పెద్ద నోట్ల రద్దు అయినా, రాత్రికిరాత్రి లాక్ డౌన్ ప్రకటన అయినా అన్నీ అలాంటివే. దేశవ్యాప్తంగా థర్డ్ వేవ్ భయాలు,…

ప్రధాని మోదీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగాలన్నీ దాదాపుగా షాకింగ్ న్యూస్ నే మోసుకొచ్చేవి. పెద్ద నోట్ల రద్దు అయినా, రాత్రికిరాత్రి లాక్ డౌన్ ప్రకటన అయినా అన్నీ అలాంటివే. దేశవ్యాప్తంగా థర్డ్ వేవ్ భయాలు, ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్న వేళ మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తారనగానే అందరూ గాభరా పడ్డారు. సరిగ్గా థర్టీ ఫస్ట్ నైట్ వచ్చేటప్పటికి మోదీ లాక్ డౌన్ అంటారేమోనని కంగారుపడిపోయారు.

కానీ ప్రధాని ఈసారి షాకివ్వలేదు. పైగా స్వీట్ న్యూస్ చెప్పారు. చిన్న పిల్లలకు వచ్చే ఏడాది జనవరి 3 నుంచి టీకా ఇస్తామని ప్రకటించారు. కానీ చిన్న పిల్లలంటే ఇక్కడ అర్థం వేరు. 15నుంచి 18 ఏళ్ల లోపువారు మాత్రమే. ఇప్పటి వరకూ 18 ఏళ్లు పైబడిన వయోజనులకు మాత్రమే భారత్ లో టీకాలు ఇచ్చేవారు. ఇప్పుడు వయసుని ఓ మూడేళ్లు తగ్గించారంతే. దేశంలో ఈ ఏజ్ గ్రూప్ వాళ్లు 10 కోట్ల మంది ఉంటారని అంచనా. వీరందరికీ జనవరి 3నుంచి వ్యాక్సినేషన్ మొదలవుతుంది. గతంలో రోజుకి కోటి టీకాల రికార్డుని గుర్తు చేసుకుంటే పిల్లల టీకా టార్గెట్ పట్టుమని పది రోజుల్లో పూర్తయ్యే అవకాశముంది.

బూస్టర్ డోస్ పై క్లారిటీ..

భారత్ లో బూస్టర్ డోస్ ఎప్పుడిస్తారు, అసలు ఇస్తారా లేదా, ఇంకా ఫస్ట్ డోస్ వేసుకోనివారు కూడా ఉన్నారు, అప్పుడే బూస్టర్ డోస్ సాధ్యమేనా అనే ప్రశ్నలు చాన్నాళ్లుగా వినిపిస్తున్నాయి. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ బూస్టర్ డోస్ పై క్లారిటీ ఇచ్చారు మోదీ. 

జనవరి 10నుంచి బూస్టర్ డోస్ ఇవ్వడం మొదలు పెడతామన్నారు. అయితే మూడో డోసు అందరికీ ఉండదు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వృద్ధులు, వైద్య సిబ్బంది, ఇతర ఫ్రంట్ లైన్ వర్కర్లకు మొదటగా బూస్టర్ డోస్ ఇస్తారు. ఆ తర్వాత మిగతా వారి గురించి ఆలోచిస్తారు.

థర్డ్ వేవ్ వచ్చినా భారత్ రెడీ..

ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ భారత్ ని బాగా ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులతో థర్డ్ వేవ్ ముప్పు తప్పదనే సంకేతాలు వెలువడ్డాయి. దీంతో ఇప్పటినుంచే ఆస్పత్రులు, ఆక్సిజన్ బెడ్లు సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు ప్రధాని మోదీ. 

దేశవ్యాప్తంగా 18లక్షల ఐసోలేషన్ బెడ్లు, 5లక్షల మేర ఆక్సిజన్ బెడ్లు, లక్షా 50వేల ఐసీయూ బెడ్లు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. ఇక చిన్న పిల్లలకు కూడా దాదాపుగా లక్ష బెడ్లు రెడీ చేశామన్నారు.

ఏ టీకా ఇస్తారు..?

భారత ప్రభుత్వం సరఫరా చేస్తున్న కొవాక్సిన్, కొవిషీల్డ్ టీకాలలోనే చిన్న పిల్లలకు వేసే వ్యాక్సిన్లు కూడా తయారవుతున్నాయి. అయితే వీటిలో ఏ కంపెనీ టీకాను ఇస్తారనేది ప్రధాని ప్రకటించలేదు. పోనీ ఇతర దేశాల్లో లభిస్తున్న చిన్నారుల టీకాలను ఇక్కడకు తెచ్చి వినియోగిస్తారా అనే విషయంపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది.

ప్రధాని ప్రకటన అనంతరం.. రాష్ట్ర ప్రభుత్వాలు 15నుంచి 18 ఏళ్ల మధ్య ఉన్నవారి జాబితాలు తయారు చేయిస్తున్నాయి. అలాగే బూస్టర్ డోస్ కి అర్హులైనవారి వివరాలు కూడా రెడీ చేస్తున్నాయి. ఓవైపు రెగ్యులర్ వ్యాక్సినేషన్ కొనసాగిస్తూనే, మరోవైపు బూస్టర్, చిన్నారుల టీకాలు కూడా వేయాల్సి ఉంది.